Ukraine Crisis: మాస్కోకు ఎదురు దెబ్బ.. ఉక్రెయిన్‌ చేతికి కీలక ఎలక్ట్రానిక్‌ వార్ఫేర్‌ వ్యవస్థ..!

రష్యాకు చెందిన అత్యాధునిక ఎలక్ట్రానిక్‌ వార్ఫేర్‌ వ్యవస్థను ఉక్రెయిన్‌ స్వాధీనం చేసుకొంది. రష్యాకు చెందిన క్రాసుఖా-4 ఈడబ్ల్యూ వ్యవస్థ కీవ్‌ శివార్లలో పడిఉంది. ఇప్పటి వరకు రష్యా నుంచి ఉక్రెయిన్‌ స్వాధీనం చేసుకొన్న

Updated : 25 Mar 2022 12:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యాకు చెందిన అత్యాధునిక ఎలక్ట్రానిక్‌ వార్ఫేర్‌ వ్యవస్థను ఉక్రెయిన్‌ స్వాధీనం చేసుకొంది. రష్యాకు చెందిన క్రాసుఖా-4 ఈడబ్ల్యూ వ్యవస్థ కీవ్‌ శివార్లలో పడి ఉంది. ఇప్పటి వరకూ రష్యా నుంచి ఉక్రెయిన్‌ స్వాధీనం చేసుకొన్న అత్యంత కీలకమైన వ్యవస్థ ఇదే. ఈ వ్యవస్థతో.. అవాక్స్‌ విమానాలు, నిఘా ఉపగ్రహాలను గుర్తించి జామ్‌ చేయవచ్చు. శత్రువు ప్రయోగించే రాకెట్లు వంటి వాటికి లక్ష్యాలు అందనీయకుండా చేయవచ్చు. ఈ వ్యవస్థను రెండు వాహనాలపై ఉంచి వినియోగిస్తారు. దీనిలో ఒక దానిలో ఎలక్ట్రానిక్‌ వార్ఫేర్‌ వ్యవస్థ ఉండగా.. మరో దానిలో కమాండ్‌ పోస్టు ఉంటుంది. కొన్నాళ్ల క్రితం ఇటువంటిదే ఝిటెల్‌ అనే కమ్యూనికేషన్‌ జామింగ్‌ వ్యవస్థను ఉక్రెయిన్‌ దళాలు ధ్వంసం చేశాయి.

ఏంటీ క్రాసుఖా-4..?

క్రాసుఖా-4 మొబైల్‌ జామింగ్‌ వ్యవస్థ. దీనిని రష్యాలోని బ్రయాన్స్క్‌ ఎలక్ట్రో మెకానికల్‌ ప్లాంట్‌లో తయారు చేస్తారు. ఈ వ్యవస్థ 150-300 కిలోమీటర్ల దూరంలోని సిగ్నల్స్‌ను జామ్‌ చేయగలదు. ముఖ్యంగా భూదిగువ కక్ష్యలో తిరిగే ఉపగ్రహాలను, భూ ఉపరితలంపై అమర్చిన రాడార్లు, ఏరియల్‌ రాడార్లను కూడా స్తంభిపంజేస్తుంది. అంతేకాదు శత్రువుల ఎలక్ట్రానిక్‌ వార్ఫేర్‌, కమ్యూనికేషన్‌ వ్యవస్థను నిర్వీర్యం చేయగలదు.

నిఘా, ఇంటెలిజెన్స్‌ సేకరించే ఉపగ్రహాల నుంచి రష్యా ఆయుధ వ్యవస్థలను రక్షించడానికి చేపట్టిన ఓ ప్రాజెక్టులో భాగంగా దీనిని అభివృద్ధి చేశారు. ఈ వ్యవస్థలను బెలారస్‌, ఉక్రెయిన్‌ భూభాగాలపై రష్యా మోహరించింది. వీటి ద్వారా నాటో గగనతలం , అంతర్జాతీయ గగనతలంలో ప్రయాణించే నిఘా విమానాలు, డ్రోన్లను జామ్‌ చేయడానికి వినియోగిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని