Biden: నాటోలో చేరిక... ఉక్రెయిన్‌కు సులభ మార్గం లేదు: బైడెన్‌

ఉక్రెయిన్‌ (Ukraine) నాటో (NATO) కూటమిలో చేరేందుకు సులభమైన మార్గాలేవీ లేవని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. నాటో దేశాలు పాటిస్తున్న ప్రమాణాలను కచ్చితంగా అవలంభించాల్సిందేనని చెప్పారు.

Published : 17 Jun 2023 22:54 IST

వాషింగ్టన్‌: రష్యా (Russia) దండయాత్ర చేస్తున్నప్పటికీ నాటో దేశాల కూటమిలో చేరేందుకు ఉక్రెయిన్‌కు (Ukraine) సులభమైన మార్గాలేవీ లేవని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేశారు. ఈ అంశంపై వాషింగ్టన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. నాటో కూటమిలో చేరాలంటే ఏయే ప్రమాణాలు పాటించాలో వాటన్నింటినీ కచ్చితంగా అమలు చేయాల్సిందేనని చెప్పారు. ఈ విషయంలో ఉక్రెయిన్‌ దేశానికి ఎలాంటి సులభతర మార్గాలు లేవన్నారు. దీనికి అమెరికా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయబోదని బైడెన్‌ స్పష్టం చేశారు. 

నాటో (నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌) ఒక సైనిక కూటమి. సోవియట్‌ విస్తరణను అడ్డుకోవడానికి 1949లో అమెరికా, యూకే, ఫ్రాన్స్‌, కెనడా సహా 12 దేశాలు కలిసి దీనిని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత దీనిని విస్తరించారు. ప్రస్తుతం 30 సభ్యదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా సోవియట్‌ యూనియన్‌ పతనం తర్వాత పలు తూర్పు ఐరోపా దేశాలు సభ్యత్వం తీసుకొన్నాయి. వీటిల్లో కొన్ని రష్యాతో నేరుగా సరిహద్దులు పంచుకొంటున్నాయి.

ముఖ్యంగా నాటోలో చేరాలనుకునే దేశాల్లో ప్రజాస్వామ్యం ఉండాలి. మార్కెట్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అయి ఉండాలి. దీంతోపాటు ఆ దేశంలోని అల్పసంఖ్యాక వర్గాలపై ఎటువంటి వివక్ష లేకుండా సమానంగా చూడాలి.  వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకొనేందుకు సిద్ధంగా ఉండాలి.  నాటో కూటమి కార్యకలాపాల్లో సైనిక సహకారం అందించడానికి సద్ధంగా ఉండాలి. ప్రజస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి సైన్యంపై నియంత్రణ ఉండాలి.  ఎలాంటి సరిహద్దు వివాదాలు ఉండకూడదు. దీంతోపాటు రక్షణ రంగంపై సభ్య దేశాలు.. తమ జీడీపీలో 2 శాతం వెచ్చించడానికి అంగీకరించాలి.  నాటోలోని 30 సభ్యదేశాలు 2021లో 1,174 బిలియన్‌ డాలర్లను సైన్యంపై ఖర్చుపెట్టాయి. 2020లో ఈ బడ్జెట్‌ 1,106 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2008లోనే ఉక్రెయిన్‌, జార్జియా దేశాలు భవిష్యత్తులో తమ సభ్యులు అవుతాయని నాటో ప్రకటించింది. కానీ, పాలన, పారదర్శకతలో నాటో ప్రమాణాలు అందుకోవడంలో ఉక్రెయిన్‌ విఫలమైంది. ఆ దేశంలో ఉన్న అవినీతి, బలహీనమైన ప్రజాస్వామ్య వ్యవస్థ కారణంగా సభ్యత్వం రాలేదు. కానీ, రష్యా నుంచి ఉక్రెయిన్‌ను కాపాడేందుకు నాటో సాయం చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని