Afghanistan: తాలిబన్ల రెండేళ్ల పాలన.. 200 మంది మాజీ ప్రభుత్వాధికారుల హత్య!

తాలిబన్ల రెండేళ్ల పాలనలో అఫ్గానిస్థాన్‌లో 200కుపైగా మాజీ ప్రభుత్వాధికారులు హతమయ్యారు. ఈ మేరకు ఐరాస ఓ నివేదిక విడుదల చేసింది.

Updated : 22 Aug 2023 15:32 IST

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌ (Afghanistan)ను తాలిబన్లు స్వాధీనం చేసుకుని ఇటీవలే రెండేళ్లు పూర్తయ్యింది. ఈ మధ్య కాలంలో దాదాపు 200కుపైగా మాజీ ప్రభుత్వ అధికారులు, భద్రతా సిబ్బంది తాలిబన్ల (Taliban) చేతిలో హతమైనట్లు ఐరాస (UN) తన నివేదికలో పేర్కొంది. సైన్యం, పోలీసు, ఇంటెలిజెన్స్‌ వర్గాలను ఎక్కువగా లక్ష్యం చేసుకున్నట్లు అఫ్గానిస్థాన్‌లో ఐరాస సహాయ మిషన్‌ (UNAMA) తెలిపింది. 2021 ఆగస్టు 15నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు.. అఫ్గాన్‌ మాజీ ప్రభుత్వ అధికారులు, భద్రతా బలగాల విషయంలో 800కుపైగా హక్కుల ఉల్లంఘనల కేసులను యూఎన్‌ఏఎంఏ నమోదు చేసింది. విచారణ లేకుండా హత్యలు, ఏకపక్ష అరెస్టులు, నిర్బంధం, చిత్రహింసలు వంటివి ఇందులో ఉన్నాయి.

తాలిబన్లు చుట్టుముట్టడంతో అప్పటి దేశాధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ తన పదవికి రాజీనామా చేసి, విదేశాలకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ‘ఈ క్రమంలోనే అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు.. మాజీ ప్రభుత్వ అధికారులు, భద్రతాబలగాలపై విరుచుకుపడ్డారు. వందల మందిని అక్రమంగా నిర్బంధించారు. చిత్రహింసలు పెట్టారు. కొందరిని నిర్బంధ కేంద్రాల్లోనే చంపేశారు. మరికొందరిని గుర్తుతెలియని ప్రదేశాలకు తీసుకెళ్లి హతమార్చారు. హత్యల్లో దాదాపు సగం కేసులు మొదటి నాలుగు నెలల్లోనే చోటుచేసుకున్నాయి. కాబుల్‌, కాందహార్‌, భాల్క్‌ ప్రావిన్స్‌లలో అత్యధికంగా ఉల్లంఘనలు నమోదయ్యాయి. 424కుపైగా ఏకపక్ష అరెస్టులు, 144కుపైగా చిత్రహింసలు, దాదాపు 14 అదృశ్య ఘటనలు ఇందులో ఉన్నాయి’ అని నివేదిక పేర్కొంది.

పసిఫిక్‌లో టెన్షన్‌.. మరో 48 గంటల్లో అణు జలాల విడుదల..!

మాజీ ప్రభుత్వం, సైన్యంతో సంబంధం ఉన్న వ్యక్తుల దుస్థితిని ఈ నివేదిక ప్రదర్శిస్తోందని ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ వోల్కర్ టర్క్ తెలిపారు. అందరికీ క్షమాభిక్ష ప్రసాదిస్తామని బహిరంగ ప్రకటన చేసిన తాలిబన్లు.. మాట తప్పి, నమ్మక ద్రోహానికి పాల్పడ్డారన్నారు. హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఈ పరిణామాలతో దేశ భవిష్యత్తు స్థిరత్వానికి ముప్పు పొంచి ఉందని నివేదిక పేర్కొంది. మరోవైపు.. తాలిబన్ నేతృత్వంలోని అఫ్గాన్‌ విదేశాంగ శాఖ ఈ నివేదికను తోసిపుచ్చింది. తాలిబన్ల చేతిలో మాజీ ప్రభుత్వ సిబ్బంది, సైన్యంపై హక్కుల ఉల్లంఘనల గురించి తమకు తెలియదని పేర్కొంది. అసలు ఇటువంటి ఘటనలే నమోదు కాలేదని తెలపడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని