USA: భారత కాన్సులేట్‌పై ఖలిస్థాన్‌ మద్దతుదారుల దుశ్చర్య.. ఖండించిన అమెరికా

భారత దౌత్యకార్యాలయం(Indian Consulate)పై ఖలిస్థాన్‌ మద్దుతుదారులు చేసిన దాడిని అమెరికా(USA) తీవ్రంగా ఖండించింది. ఇలాంటి చర్యలకు శిక్ష తప్పదని హెచ్చరించింది. 

Updated : 11 Jul 2023 17:17 IST

వాషింగ్టన్: ఖలిస్థాన్‌ మద్దతుదారులు శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్యకార్యాలయం(Indian Consulate in San Francisco)పై దాడికి పాల్పడ్డారు. దానిని దహనం చేయడానికి ప్రయత్నించారు. నెలల వ్యవధిలో రెండోసారి ఈ తరహా దుశ్చర్య జరగ్గా.. దీనిని అమెరికా(US) ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. నేరపూరిత చర్య అంటూ అభివర్ణించింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం..

రెండురోజుల క్రితం వేకువజాములో ఖలిస్థాన్‌ మద్దతుదారులు శాన్‌ఫ్రాన్సిస్కో(San Francisco) దౌత్యకార్యాలయానికి నిప్పంటించారు. అయితే స్థానిక అగ్నిమాపక విభాగం వేగంగా స్పందించి మంటల్ని ఆర్పేశారు. ఈ ఘటనలో సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అయితే, ఈ దాడిపై అమెరికా స్పందించింది. ‘దౌత్యకార్యాలయంపై విధ్వంసానికి పాల్పడటం, దహనం చేయడానికి చేసిన యత్నాలను అమెరికా తీవ్రంగా ఖండిస్తోంది. దౌత్యకార్యాలయాలు, విదేశీ దౌత్యవేత్తలపై హింసకు పాల్పడటం వంటి చర్యలను అమెరికాలో తీవ్ర నేరాలుగా పరిగణిస్తాం’అని యూఎస్‌ విదేశాంగ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ట్వీట్ చేశారు. ఈ దుశ్చర్యకు సంబంధించిన వీడియోను ఖలిస్థాన్ మద్దతుదారులు విడుదల చేశారని, దీనికి ఎలాంటి ధ్రువీకరణ లేదని మీడియా కథనాలు వెల్లడించాయి. ఆ వీడియోలో.. హింస హింసను ప్రేరేపిస్తుందనే వ్యాఖ్యలతో పాటు ఇటీవల కెనడాలో మృతి చెందిన ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌కు సంబంధించిన వార్తా కథనమూ కనిపించింది. గత నెల కెనడాలోని ఓ గురుద్వారాలో నిజ్జర్‌ను ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. 

ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ సభ్యులకు.. కార్యకలాపాల నిర్వహణ, నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయడం, శిక్షణ, ఆర్థిక సహకారం వంటివి హర్‌దీప్‌ అందించేవాడు. ఇతడిపై ఎన్‌ఐఏ భారత్‌లో ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. హర్‌దీప్‌ సింగ్‌కు ‘సిక్‌ ఫర్‌ జస్టిస్‌’ సంస్థతో కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. ఇటీవల ఆస్ట్రేలియాలో ఖలిస్థాన్‌ మద్దతుదారులు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో కూడా ఇతడి హస్తం ఉంది. హర్‌దీప్‌ సామాజిక మాధ్యమ ఖాతాల్లో విద్వేషపూరిత ప్రసంగాలు, చిత్రాలు ఉన్నాయి. గతంలో పంజాబ్‌ ముఖ్యమంత్రిగా అమరీందర్‌ సింగ్‌ ఉన్న సమయంలో కెనడా(Canada)కు అప్పగించిన మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో ఇతడి పేరును కూడా చేర్చారు. 2018లో ఈ జాబితాను కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోకు అప్పగించారు.

ఇదిలా ఉంటే మార్చిలో కూడా శాన్‌ఫ్రాన్సిస్కో దౌత్యకార్యాలయంపై దాడి జరిగింది. ఈ వరుస ఘటనలపై సోమవారం భారత విదేశాంగ మంత్రి జై శంకర్ (S. Jaishankar) స్పందించారు. భారత్‌ భాగస్వామ్య దేశాలైన కెనడా, యూకే, యూఎస్‌, ఆస్ట్రేలియా.. ఈ తరహా అతివాద భావజాలానికి తావివ్వకూడదని, అది దేశాల మధ్య సంబంధాలకు మంచిది కాదని వ్యాఖ్యానించారు.

కెనడా రాయబారికి కేంద్రం సమన్లు..

ఖలిస్థాన్‌ మద్దతుదారులు జులై ఎనిమిదిన కెనడాలోని టొరంటోలో స్వేచ్ఛార్యాలీకి పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి అంటించిన పోస్టర్లలో ఒట్టావా, టొరంటోలోని దౌత్యవేత్తలపై బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై స్పందించిన కెనడా ప్రభుత్వం తమ దేశంలోని భారత దౌత్యవేత్తల భద్రతకు కట్టుబడి ఉన్నామని వెల్లడించింది. ఈ క్రమంలోనే ఈ ర్యాలీని ఖండిస్తూ భారత ప్రభుత్వం మన దేశంలోని కెనడా రాయబారికి సమన్లు ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని