Ukraine Crisis: ఉక్రెయిన్‌కు బల్గేరియా మిగ్‌-29లు..?

అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ కీలక నిర్ణయం తీసుకొంది. బల్గేరియాకు ఎనిమిది ఎఫ్‌-16 యుద్ధవిమానాలను విక్రయించాలని నిర్ణయించింది.

Published : 05 Apr 2022 23:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ కీలక నిర్ణయం తీసుకొంది. బల్గేరియాకు ఎనిమిది ఎఫ్‌-16 యుద్ధవిమానాలను విక్రయించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని అమెరికా రక్షణశాఖ వెల్లడించింది. ‘‘ఈ ప్రతిపాదన బల్గేరియా సామర్థ్యాన్ని ప్రస్తుత, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా బలోపేతం చేస్తుంది. నల్ల సముద్రంలో బల్గేరియా ఎయిర్‌ ఫోర్స్‌ అత్యాధునిక విమానాలను మోహరించే అవకాశం లభిస్తుంది’’ అని అమెరికా డిఫెన్స్‌ సెక్యూరిటీ కోపరేషన్‌ ఏజెన్సీ వెల్లడించింది.

నాటో సభ్యదేశమైన బల్గేరియా నుంచి ఉక్రెయిన్‌కు మిగ్‌ 29 విమానాలను సరఫరా చేస్తారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో బల్గేరియా అవసరాలు తీర్చేలా అమెరికా ఎఫ్‌-16లు సమకూరుస్తోందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా వివరణ ఇచ్చింది. ఈ ఒప్పందానికి రష్యా-ఉక్రెయిన్‌ ఘర్షణకు ఎటువంటి సంబంధం లేదని వెల్లడిచింది. 

సోవియట్‌ తయారీ మిగ్‌-29 విమానాలను కలిగి ఉన్న నాటోదేశాల్లో బల్గేరియా, స్లొవాకియా, పోలాండ్‌ ఉన్నాయి. తాజాగా బల్గేరియాకు అమెరికా విమానాలను సరఫరా చేయడం ఆసక్తికరంగా మారింది. దీనిపై పెంటగాన్‌ ప్రతినిధి జాన్‌ కెర్బీ మాట్లాడుతూ.. బల్గేరియా విమానాల లోటును తాము భర్తీ చేస్తున్నట్లుగా చూడటం లేదని వెల్లడించారు. ఈ ప్రచారాన్ని బల్గేరియా కూడా తోసిపుచ్చుతోంది. ప్రస్తుతం తాము సైనిక సాయం అందించే పరిస్థితి లేదని బల్గేరియా రక్షణ మంత్రి పెట్‌కోవ్‌ వెల్లడించారు. అటువంటి సాయానికి బల్గేరియా పార్లమెంట్‌ ఆమోదం తప్పని సరి అని వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని