UN Chief: మహిళలపై హింస ‘పెద్ద క్యాన్సర్‌’ వంటిది.. దానిపై పోరాడాల్సిందే : గుటెరస్‌

సామాజిక మాధ్యమాల్లో మహిళలపై జరిగే హింస అనేది ‘పెద్ద క్యాన్సర్‌’ వంటిదని.. దానిపై పోరాడేందుకు ప్రతి దేశమూ ‘అత్యవసర ప్రణాళిక’ను రూపొందించుకోవాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ పిలుపునిచ్చారు.

Published : 19 Oct 2022 22:27 IST

ముంబయి: మహిళలపై జరిగే హింస పెద్ద క్యాన్సర్‌ వంటిదని.. దానిపై పోరాడేందుకు ప్రతి దేశమూ ‘అత్యవసర ప్రణాళిక’ రూపొందించుకోవాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ పిలుపునిచ్చారు. ఐఐటీ బాంబే విద్యార్థుల ముఖాముఖిలో భాగంగా పలు అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఆయన.. మహిళా సామాజికవేత్తలు, రాజకీయ నాయకులే లక్ష్యంగా సోషల్‌ మీడియాలో దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గడిచిన 75ఏళ్లలో భారత్‌ సాధించిన ప్రగతి, కొవిడ్‌ వంటి అత్యవసర సమయాల్లో ప్రపంచ దేశాలకు భారత్‌ అందించిన సహకారాన్ని ఐరాస చీఫ్‌ కొనియాడారు.

‘మహిళలపై జరిగే హింస అనే అంశం ముఖ్యమైనదే కాదు, అత్యవసరమైనది. ఎందుకంటే రోజురోజుకు పరిస్థితులు మెరుగుపడకపోగా..  మరింత దిగజారుతున్నాయి. మహిళా కార్యకర్తలు, రాజకీయ నాయకులపై సోషల్‌ మీడియాలో భయంకరమైన ప్రచారం జరుగుతోంది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతోన్న ఈ హింస అత్యంత దారుణంగా తయారయ్యింది. మహిళలపై ఇటువంటి హింసను అరికట్టేందుకు ప్రతి దేశం కూడా అత్యవసర ప్రణాళికను రూపొందించుకోవాలి’ అని పేర్కొన్నారు.

ఇక అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపైనా గుటెరస్‌ మాట్లాడారు. ‘కేవలం సంపన్న దేశాలకు అనుకూలంగా ఉన్న అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థ ‘నైతికంగా దివాలా’ తీసింది. సంపన్న దేశాలకు ప్రయోజనాల కోసం ఆ దేశాల్లోనే చీలిక వచ్చింది. ఆ పరిస్థితిని మార్చే సమయం ఆసన్నమైంది. అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థ రూపకల్పనలో సంస్కరణలు అవసరం. ఇందులో భారత్‌ క్రియాశీలంగా వ్యవహరించడాన్ని నేను కూడా ప్రోత్సహిస్తా. ఇందుకు జీ20 సదస్సుకు భారత్‌ అధ్యక్షత వహించడం ఓ సదవకాశంగా భావిస్తోన్నా’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని