Turkey earthquake: తుర్కియేను కూల్చిందిదే.. అసలేమిటీ పాన్‌కేక్‌ కొలాప్స్‌..?

తుర్కియేలో వచ్చిన భూకంపం కంటే భవనాలు కూలిన విధానం ఎక్కువ నష్టాన్ని కలిగించింది.  ఓ నిర్దిష్టమైన విధంగా భవనాలు ధ్వంసం కావడంతో క్షతగాత్రులను రక్షించడం కూడా కష్టంగా మారింది. 

Published : 20 Feb 2023 16:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

తుర్కియే-సిరియాలో వచ్చిన భూకంపం దెబ్బకు దాదాపు 45వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. 70 వేల మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. 7.8 తీవ్రతతో వచ్చిన ప్రధాన ప్రకంపన, అనంతరం వేల సంఖ్యలో వచ్చిన చిరు ప్రకంపనలు ఆ దేశాల్లోని భవనాలను దారుణంగా దెబ్బతీశాయి. భూకంపం వచ్చిన తర్వాత చాలా సేపు భవనాలు నిట్టనిలువునా కూలిపోతున్న  వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. చాలా భవనాలు నిట్టనిలువునా కుప్పపోసినట్లు కూలిపోయాయి. ప్రతి భారీ భూకంపంలో అత్యధిక ప్రాణనష్టానికి ఆయా కారణాలు ఉంటాయి. తుర్కియే-సిరియా భూకంపంలో భవనాలు కూలిన విధానాన్ని బట్టి దానిని నిపుణులు ‘పాన్‌కేక్‌ కొలాప్స్‌’తో పోలుస్తున్నారు.

వరల్డ్‌ట్రేడ్‌ సెంటర్‌ ఉదాహరణ‌..!

భవన అంతస్తులు నేల కూలే సమయంలో ఒక దానిపై మరొకటి పేర్చినట్లు కూలడాన్ని ‘పాన్‌కేక్‌ కొలాప్స్‌’ అంటారని సెయింట్‌ లూయీస్‌ రీజనల్‌ రెస్పాన్స్‌ సిస్టమ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గ్రెగ్‌ ఫావ్రె వివరించారు. భవనం ఈ విధంగా ధ్వంసమయ్యే సమయంలో భవనం శకలాల బరువు చతురస్త్రాకారంలో కింద ఉన్న ఫ్లోర్‌పై పడుతుంది. వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ భవనం నిట్టనిలువునా కూలిపోయిన దృశ్యాలు చాలా మంది మదిలో ఇప్పటికీ ఉంటాయి. పాన్‌కేక్‌ కొలాప్స్‌కు అదే అతిపెద్ద ఉదాహరణ.

కింద నుంచి పతనం మొదలై..

‘పాన్‌కేక్‌ కొలాప్స్‌’ సాధారణంగా భవనం కింద నుంచి మొదలై పైభాగాలకు చేరుతుంది. సాధారణంగా భూకంప సమయంలో భవనం కింద భాగంలోని పునాదులు లేదా పిల్లర్లు దెబ్బతిని కూలుతాయి. దీంతో వాటిపైన ఉన్న నిర్మాణాలు నిట్టనిలువునా పడిపోతాయని యూనివర్శిటీ ఆఫ్‌ సెంట్రల్‌ ఫ్లొరిడాకు చెందిన నిర్మాణ రంగ నిపుణుడు నికిషీయా కాట్‌బాస్‌ వివరించారు. సాధారణంగా భూకంపం వచ్చిన తర్వాత ఈ విధంగా భవనాలు, వంతెనలు బరువు మోయలేక పడిపోతాయన్నారు. 

ఇటువంటి నిర్మాణాలను సాఫ్ట్‌స్టోరీ భవనాలంటారు. వీటిల్లో నిర్మాణాల కింద ప్రదేశాలు బలహీనంగా.. పైనిర్మాణాలు బలంగా ఉంటాయి. కింద ప్రదేశాల్లో పార్కింగ్‌ లేదా వాణిజ్య అవసరాల కోసం  కేవలం పిల్లర్లతోనే నిర్మాణం ఉంటుంది. వాటికి గోడల ఆధారం ఉండదు. సాధారణంగా చాలా చోట్ల అపార్ట్‌మెంట్ల వంటి నిర్మాణాలు ఈ విధంగానే ఉంటాయి. తుర్కియే, భారత్‌, పాకిస్థాన్‌ వంటి జనాభా కిక్కిరిసిన దేశాల్లో ఇటువంటి నిర్మాణాలు విరివిగా కనిపిస్తాయి. 

1999లో తుర్కియేలో భూకంపం వచ్చిన సమయంలోనే ఈ సమస్యను గుర్తించారు. దీంతో భవనాల కింద ఉన్న పిల్లర్లకు మద్దతుగా ఇనుప స్తంభాలు ఏర్పాటు చేయాలని, గోడలకు ఆధారంగా మరింత ఇనుము వాడాలని నిర్ణయించారు. ప్రపంచ బ్యాంక్‌ అంచనాల ప్రకారం 6.7 మిలియన్లకు పైగా ఇళ్లకు ఇటువంటి చర్యలు తీసుకోవాలి. దీనికి 465 బిలియన్‌ డాలర్లు ఖర్చవుతుందని అంచనా. కానీ, 2021 నాటికి కేవలం 4 శాతం భవనాలకే ఈ పనులు పూర్తయ్యాయి.

అత్యంత ప్రమాదకర విధ్వంసం..

భూకంపాలు వచ్చిన సమయంలో సాధారణ విధ్వంసాలతో పోలిస్తే.. ‘పాన్‌కేక్‌ కొలాప్స్‌’ కారణంగా జరిగే విధ్వంసం ప్రమాదకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పైఅంతస్తుకు చెందిన సిమెంట్‌, కాంక్రీట్‌ నిర్మాణాలు మొత్తం కింద అంతస్తుపై పడిపోవడంతో వాటిల్లో చిక్కుకొన్న వారిని గుర్తించడం, రక్షించడం కూడా చాలా కష్టమైన పని. ఈ రకంగా కూలిన భవనంలో గాలి చేరడానికి తక్కువ మార్గాలు ఉంటాయి. ఇక చిక్కుకుపోయిన బాధితులు తప్పించుకొనే మార్గాలు కూడా అతి స్వల్పంగా ఉంటాయి. తాజాగా తుర్కియేలో సంభవించిన భూకంపంలోనూ ఇలాగే భవనాలు కుప్పకూలి ప్రాణనష్టం అధికంగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని