కాలేయ మార్పిడులు కావట్లేదు!

ప్రధానాంశాలు

కాలేయ మార్పిడులు కావట్లేదు!

ఓ 30 ఏళ్ల యువకుడికి హెపటైటిస్‌ వైరస్‌తో  కేన్సర్‌ సోకింది. కాలేయ మార్పిడికి ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఎక్కువ డబ్బులు పెట్టలేక ఉస్మానియా వైద్యులను సంప్రదించాడు. కానీ కొంతకాలంగా సర్జరీలు నిలిచిపోవడంతో ఉసూరుమన్నాడు.

* జన్యుపరమైన కారణాలతో ఓ బాలుడు కాలేయ వ్యాధికి గురయ్యాడు. కాలేయంలో రాగి (కాపర్‌) పేరుకుపోవడంతో పనితీరు మందగించి పొట్ట పెద్దదిగా మారింది. వైద్యులను సంప్రదిస్తే ఖర్చు రూ.25లక్షలపైనే అవుతుందని, కాలేయ మార్పిడి చేయకపోతే బతకడం కష్టమని అన్నారు. కూలీకి పోతే తప్ప కుటుంబాన్ని పోషించలేని స్థితిలో ఉన్న ఆ బాలుడి తల్లిదండ్రులు.. చికిత్స కోసం ఉస్మానియాకు వెళ్తే అక్కడ శస్త్రచికిత్సలే జరగడం లేదు.

ఉస్మానియాలో కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు ఏడాదిన్నర కాలంగా నిలిచిపోవడంతో దాదాపు 200 మంది బతుకు ఆగమాగమవుతోంది. జన్యుపరమైన ఇబ్బందులతో చాలామంది పిల్లలు కాలేయ జబ్బుల బారిన పడుతుంటారు. విపరీతమైన మద్యపానం, హైపటైటీస్‌-బీ వైరస్‌తో కూడా కాలేయం దెబ్బతింటుంది. ఇలాంటి వారు ఔషధాలతో కొంతకాలం నెట్టుకొచ్చినా కాలేయ మార్పిడితోనే పూర్తి ఉపశమనం లభిస్తుంది. వీరు తొలుత జీవన్‌దాన్‌ ట్రస్టులో పేరు నమోదు చేసుకోవాలి. లేదా దగ్గరి కుటుంబ సభ్యులు ముందుకొస్తే వారి నుంచి కాలేయం కొంతభాగం సేకరించి అమర్చుతారు. దానం చేసిన వారిలో కొన్నిరోజుల తర్వాత అది యథాస్థితికి చేరుతుంది.


ఎందుకు ఆగాయంటే..

* ఆసుపత్రిలోని పాత భవనంలో ప్రత్యేక ఆపరేషన్‌ థియేటర్‌, ఐసీయూ ఉండేవి.కూలే దశకు చేరడంతో వాటిని తొలగించారు. మరోచోట ఏర్పాటు చేయలేదు. గాంధీ ఆసుపత్రిని ఇటీవలి వరకు పూర్తిగా కొవిడ్‌ సేవలకు కేటాయించడంతో అక్కడా శస్త్రచికిత్సలు చేయడం లేదు.

* కాలేయ మార్పిడి తర్వాత రోగులకు ఇమ్యూనో సప్రస్‌ మందులు ఇస్తారు. వీటితో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఈ సమయంలో ప్రత్యేక ఐసీయూ, వార్డులు అవసరం. లేదంటే ఇన్ఫెక్షన్‌ సోకి రోగి ప్రాణాలకే ముప్పు.

* ప్రైవేట్‌లో ఈ చికిత్సలకు రూ.25-30 లక్షల ఖర్చు అవుతుంది. ఉస్మానియాలో చేయించుకుంటే ప్రభుత్వమే సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద రూ.10 లక్షలు మంజూరు చేస్తుంది. మిగతా వైద్య సేవలు ఉచితం.

* శస్త్రచికిత్స తర్వాత కూడా రోగులు జీవితాంతం మందులు వాడాలి. వీటికి నెలకు రూ.10-15 వేల వరకు ఖర్చవుతుంది. ఆరోగ్యశ్రీ కింద ఉస్మానియాలో మందులూ ఉచితం. కానీ శస్త్రచికిత్సలు నిలిచిపోవడంతో పేదలు లబోదిబోమంటున్నారు.


- ఈనాడు, హైదరాబాద్‌

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని