‘మంథన్‌’ అజయ్‌ గాంధీ కన్నుమూత

ప్రధానాంశాలు

‘మంథన్‌’ అజయ్‌ గాంధీ కన్నుమూత

సొంత ఖర్చుతో సంవాద చర్చలు

జనచేతన కలిగించే ప్రయత్నం

16 ఏళ్లుగా ప్రముఖులతో కార్యక్రమాలు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: విభిన్న అంశాలు.. విలువైన చర్చలు.. బోలెడంత విజ్ఞానం.. అక్కడ ఓ అరగంట కూర్చుంటే చాలు ఏదో సంతృప్తి.. ఎంతో సంతోషం.. అదే ‘మంథన్‌’ వేదిక. దేశానికి సంవాద చర్చలను.. హైదరాబాద్‌ నగరవాసులకు సాహితీ పండగలను పరిచయం చేసిన ‘మంథన్‌’ సంస్థ వ్యవస్థాపకులు, ప్రముఖ ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ అజయ్‌ గాంధీ(65) కన్నుమూశారు. కొంతకాలంగా బ్రెయిన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన గురువారం ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. దేశ స్వాతంత్య్రానంతరం ఆయన కుటుంబం గుజరాత్‌ నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడింది. బంజారాహిల్స్‌లో భార్య నీతా, కుమార్తె మానసి, కుమారుడు పార్థ్‌తో కలిసి నివసిస్తున్నారు. ‘వింగ్స్‌’ అకౌంటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ రూపకర్తగా, సీఏగా దాదాపు 40 ఏళ్లుగా సేవలందిస్తున్న ఆయన 16 ఏళ్ల క్రితం ‘మంథన్‌’ చర్చా వేదికను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు, సాహితీవేత్తలు సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం ఫిలింనగర్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.

దేశంలో పాలకులకు, ప్రజలకు మధ్య దూరం కొనసాగుతోందని, చర్చల ద్వారానే అనేక కీలక విషయాలు జనాల్లోకి వెళ్తాయనే ఆలోచనతో తన సహోద్యోగి విక్రమ్‌తో కలిసి 2005లో బంజారాహిల్స్‌లో ‘మంథన్‌’ సంస్థను స్థాపించారు. అర్థవంతమైన చర్చలు జరగాలనే ఉద్దేశంతో పదహారేళ్లుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి సాహితీ, రాజకీయ, సినీ ప్రముఖులతో భిన్న పార్శ్వాలకు చెందిన అంశాలపై చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఆదివారం సాయంత్రం జరిగే ఈ చర్చల్లో దేశం నలుమూలల నుంచి ఔత్సాహికులు పాల్గొనేవారు. ఇప్పటివరకూ హైదరాబాద్‌ కేంద్రంగా 398 చర్చా కార్యక్రమాలు నిర్వహించారాయన.

భావజాలాలేవైనా.. అదే విధానం!

చర్చావేదికలంటే చాలాచోట్ల గొడవలకు దారి తీస్తుంటాయి. విభిన్న పార్టీల నేతలు, మంత్రులు, రచయితలు, భిన్న భావజాలాల ప్రముఖులు మంథన్‌లో పాల్గొన్నా ఎప్పుడూ ఏ చిన్న మాటా తూలకపోవడం విశేషం. జనచేతనం కలిగించే ప్రతి అంశాన్నీ చర్చకు తీసుకురావడం.. వాటిపై సుదీర్ఘ అనుభవం ఉన్నవారిని ఉపన్యాసకులుగా ఎంచుకోవడం ఆయన ప్రత్యేకత. ప్రతి కార్యక్రమంలో ఉస్మానియా బిస్కెట్‌, ఇరానీ టీతో నగర సంస్కృతి, సంప్రదాయాల్ని ప్రముఖులకు పరిచయం చేసేవారాయన.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని