Corona: గబ్బిలాల్లో కొత్తరకం కరోనా వైరస్‌లు
close

ప్రధానాంశాలు

Corona: గబ్బిలాల్లో కొత్తరకం కరోనా వైరస్‌లు

గుర్తించిన చైనా శాస్త్రవేత్తలు

వాషింగ్టన్‌: గబ్బిలాల్లో కరోనా వైరస్‌లకు సంబంధించిన ఒక కొత్త బ్యాచ్‌ను చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటిలో ఒక రకానికి కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2తో జన్యుపరంగా అత్యంత ఎక్కువ సారూప్యత ఉందని తేల్చారు. నైరుతి చైనాలో వీటిని గుర్తించారు. గబ్బిలాల్లో ఇంకా గుర్తించని కరోనా వైరస్‌లు, వాటిలో మనుషులకు వ్యాపించే అవకాశం ఉన్న రకాలపై ఒక అంచనాకు రావడానికి తమ పరిశోధన ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
చైనాలోని షాండాంగ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. 2019 మే నుంచి గత ఏడాది నవంబరు వరకూ అడవుల్లో ఉండే గబ్బిలాల నుంచి నమూనాలను సేకరించారు. వీటి విసర్జితాలు, నోటి నుంచి సేకరించిన శ్వాబ్‌ నమూనాలను పరీక్షించారు. ఈ క్రమంలో భిన్న గబ్బిలాల జాతుల నుంచి 24 కరోనా వైరస్‌ జన్యుక్రమాలను సేకరించినట్లు తెలిపారు. వీటిలో సార్స్‌-కోవ్‌-2 తరహా కరోనా వైరస్‌లు నాలుగు ఉన్నాయన్నారు. ఒకదానికి మాత్రం కొవిడ్‌ వైరస్‌తో చాలా దగ్గరి పోలికలు పేర్కొన్నారు. స్పైక్‌ ప్రొటీన్‌లోని జన్యుపరమైన వైరుధ్యాలు మినహా మిగతా అంశాలన్నీ ఒకేలా ఉన్నాయని చెప్పారు. గత ఏడాది జూన్‌లో థాయ్‌లాండ్‌లోనూ సార్స్‌-కోవ్‌-2 తరహా వైరస్‌ను గుర్తించారు. దీన్నిబట్టి కొవిడ్‌ కారక వైరస్‌ను పోలిన వైరస్‌లు గబ్బిలాల్లో విస్తృతంగా వ్యాపిస్తున్నాయని తేల్చారు. కొన్నిచోట్ల వాటి తీవ్రత చాలా ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కొవిడ్‌ కారక వైరస్‌ మూలాలు ఇప్పటికీ అంతుచిక్కకుండా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజా పరిశోధన వివరాలకు ప్రాధాన్యం ఏర్పడింది.



Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని