మొటిమలను తగ్గించే చింతపండు..! - beauty face packs with tamarind in telugu
close
Published : 16/07/2021 19:52 IST

మొటిమలను తగ్గించే చింతపండు..!

వంటకాలకు పుల్లపుల్లటి రుచిని అందించే చింతపండు.. సౌందర్య పోషణలోనూ ఉపయోగపడుతుందన్న విషయం చాలామందికి తెలిసుండదు. కానీ మొటిమలు, మచ్చలు.. వంటి చర్మ సమస్యల్ని తగ్గించడం దగ్గర్నుంచి ముఖ కాంతిని పెంచే దాకా.. ఇలా అణువణువూ అందాన్ని ఇనుమడింపజేసే శక్తి దీని సొంతం అంటున్నారు సౌందర్య నిపుణులు. ఈ క్రమంలో చింతపండుతో ఇంట్లోనే తయారుచేసుకొనే కొన్ని ఫేస్‌ప్యాక్స్‌ ఏంటో తెలుసుకుందాం రండి..

మొటిమలకు..

నిమ్మకాయంత పరిమాణంలో చింతపండును తీసుకొని దాన్ని పావుకప్పు వేడినీటిలో వేసి కాసేపు నాననివ్వాలి. ఆపై దీన్నుంచి పిప్పిని వేరుచేయాలి. ఇందులోంచి టేబుల్ స్పూన్ పరిమాణంలో గుజ్జును తీసుకోవాలి. దీనికి ఒక చెంచా ముల్తానీ మట్టి, కొద్దిగా రోజ్‌వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి, మెడకు మాస్క్‌లా వేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒకేసారి ఎక్కువ మొత్తంలో చేసుకొని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు. ఈ ఫేస్‌ప్యాక్ తరచుగా వేసుకుంటూ ఉంటే మొటిమల సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. అంతేకాకుండా చర్మం కొత్త మెరుపును కూడా సంతరించుకుంటుంది.

ప్రకాశవంతమైన చర్మం కోసం..

కొద్దిగా చింతపండును తీసుకొని సరిపడినన్ని నీళ్లు పోసి కాసేపు వేడిచేయాలి. చల్లారిన తర్వాత చింతపండు నుంచి గుజ్జును వేరుచేయాలి. టేబుల్‌స్పూన్ గుజ్జును తీసుకొని దానికి అరచెంచా పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకొని ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ మీ చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది.

బ్లీచ్‌లాగానూ..

కొద్దిగా చింతపండును తీసుకొని పావుగంట పాటు వేడినీటిలో నానబెట్టాలి. తర్వాత చింతపండును మెత్తగా పిసికి పిప్పిని వేరుచేయాలి. ఈ చింతపండు రసంలో అరటిపండు గుజ్జు, శెనగపిండిని జతచేసి పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిని చర్మానికి పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఈ మిశ్రమం బ్లీచింగ్ ఏజెంట్‌లా పనిచేసి చర్మాన్ని శుభ్రం చేస్తుంది.

స్క్రబ్‌గా..

చింతపండు గుజ్జును కొద్దిమొత్తంలో తీసుకొని దానికి టేబుల్‌స్పూన్ నిమ్మరసం, అరచెంచా బేకింగ్ సోడా, చెంచా పంచదార కలపాలి. ఈ మిశ్రమంతో శరీరాన్ని మృదువుగా మర్దన చేసుకొని పదిహేను నిమిషాల తర్వాత వేడినీటితో స్నానం చేయాలి. ఈ మిశ్రమం జిడ్డు చర్మం కలిగిన వారికి, మొటిమల సమస్యతో బాధపడే వారికి మంచి ఔషధంలా పనిచేస్తుంది.

టోనర్‌గా..

రెండు చెంచాల చింతపండు రసాన్ని తీసుకొని.. దీనికి రెండు చెంచాల టీ డికాషన్‌ను కలపాలి. క్లెన్సింగ్ పూర్తయిన తర్వాత ఈ మిశ్రమంలో దూదిని ముంచి ముఖానికి రాసుకోవాలి. కాసేపటి తర్వాత చల్లటి నీటితో మరోసారి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఇవండీ చింతపండుతో వేసుకోదగిన కొన్ని ప్యాక్స్, తయారుచేసుకోదగిన ఇతర సౌందర్య ఉత్పత్తులు.. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే చింతపండును చర్మానికి నేరుగా రాసుకోకూడదు. దీనిని ఇతర పదార్థాలతో కలిపి మాత్రమే వాడాలి. అంతేకాదు.. చింతపండును ఉపయోగించడం వల్ల కొంతమందిలో అలర్జీ వంటి దుష్ప్రభావాలు కూడా రావచ్చు. కాబట్టి ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసి తర్వాత ఉపయోగించడం మంచిది.

మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని