పాలతో స్నానం... ఈ అందాల భామల సౌందర్య రహస్యం ! - the natural beauty secrets of persian women in telugu
close
Published : 03/09/2021 20:05 IST

పాలతో స్నానం... ఈ అందాల భామల సౌందర్య రహస్యం !

వారి అందానికి పరవశించని హృదయం ఉండదు. ఆ ముగ్ధమనోహర మోముకు ఫిదా అవని మనసుండదు. గోధుమ రంగు మేనిఛాయతో.. నీలి కళ్లతో.. ఒత్తైన జాలువారే కురులతో.. అందానికి పర్యాయపదంలా మెరిసిపోతున్న ‘పర్షియా’ భామల ‘సొగసు చూడతరమా!’ అనడంలో సందేహం లేదు. మరి, అంతటి అపురూప లావణ్యం వారికెలా సొంతమైంది అనుకుంటున్నారా? అందుకు తాము పాటించే సహజసిద్ధమైన సౌందర్య పద్ధతులే కారణం అంటున్నారీ సుందరీమణులు. వీరు వాడే న్యాచురల్‌ రెమెడీస్‌ వినడానికి, పాటించడానికి ఎంత సింపుల్‌గా అనిపిస్తాయో.. అంతే ఎక్కువ ఫలితాల్ని అందిస్తాయి కూడా! మరి చక్కటి సహజసిద్ధమైన ఉత్పత్తులతో చూపుతిప్పుకోలేని అందాన్ని తమ సొంతం చేసుకున్న పర్షియా ముద్దుగుమ్మల సౌందర్యం వెనకున్న ఆ రహస్యాల గురించి మీకోసం..

పాలతో స్నానం !

అందమంటే.. చందమామ లాంటి ముఖసౌందర్యం ఉంటే సరిపోదు. తల నుండి పాదాల వరకు చర్మం కాంతులీనినప్పుడే దానికి సంపూర్ణత్వం వస్తుంది. కానీ రాన్రానూ పెరిగిపోతున్న కాలుష్యం మన చర్మాన్ని కాంతివిహీనంగా మారుస్తోంది. దుమ్ము, ధూళి వల్ల చర్మం సహజ తేమను కోల్పోయి నిర్జీవంగా తయారవుతుంది. మరి, ఈ సమస్య పరిష్కారానికి పర్షియా భామలు పాటించే సౌందర్య పద్ధతి. ‘మిల్క్‌ బాత్‌’. వారు స్నానం చేసే నీటిలో కొన్ని పాలను కలుపుకొని కాసేపటి తర్వాత ఆ నీటితో స్నానం చేస్తారు. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మేని ఛాయ రెట్టింపవుతుందంటున్నారు పర్షియన్‌ ముద్దుగుమ్మలు. అంతేకాదు.. అప్పుడప్పుడూ బాత్‌టబ్‌లో గోరువెచ్చని నీటిని నింపి.. ఆలివ్, కొబ్బరి లేదా బాదం.. వీటిలో ఏదో ఒక రకం నూనెను కొన్ని చుక్కల చొప్పున ఆ నీటిలో వేసి బాగా కలుపుకొని స్నానం చేస్తారు. ఈ పద్ధతి ద్వారా చర్మం సహజ తేమను కోల్పోకుండా జాగ్రత్తపడతారు. అలాగే తమ చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించుకోవడానికి వారు స్నానం చేసే నీటిలో సముద్రపు ఉప్పును కలుపుకొంటారు. ఇది చర్మానికి స్క్రబ్‌లా పనిచేసి చర్మానికి మృదుత్వాన్ని అందిస్తుంది. ఇలా ప్రత్యేక స్నానంతో నఖశిఖపర్యంతం ఎంతో అందంగా మెరిసిపోతారు పర్షియన్‌ భామలు.

మేని మెరుపు కోసం ‘కాఫీ స్క్రబ్‌’..

మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాతావరణ మార్పులు, కాలుష్యం వల్ల మన చర్మం నిగారింపును కోల్పోవడం సహజం. అలాంటప్పుడు చర్మాన్ని తిరిగి పునరుత్తేజితం చేయాలంటే అందుకోసం కాఫీ స్క్రబ్‌ చక్కటి పరిష్కారం అంటున్నారు పర్షియా మగువలు. కాఫీ పొడి, తేనె సమపాళ్లలో తీసుకొని తయారు చేసిన మిశ్రమాన్ని ముఖానికి, వీపుకి ప్యాక్‌లా వేసుకోవాలి. ఆపై నెమ్మదిగా, మృదువుగా మసాజ్‌ చేసుకోవాలి. అలా చేయడం వల్ల చర్మంపై పేరుకున్న మురికి తొలగిపోయి శుభ్రపడుతుంది. తద్వారా నిగారింపు కూడా మన సొంతమవుతుంది. తేనె చర్మానికి సహజ తేమను అందిస్తుంది. అలాగే చర్మంపై ఏర్పడిన మచ్చలను తొలగించడానికి తేనె, నిమ్మరసం, పంచదారలను మిశ్రమంలా కలుపుకొని చర్మంపై సున్నితంగా స్ర్కబ్‌ చేసుకుంటే మచ్చలేని చందమామ లాంటి మోముతో పాటు.. కాంతివంతమైన మేని సొగసును పొందవచ్చని చెబుతున్నారీ పర్షియన్‌ ముద్దుగుమ్మలు.

తేమను నిలిపి ఉంచే కలబంద!

శరీర ఆరోగ్యానికి, మేని మెరుపుకి, చర్మం తేమను సంతరించుకోవడానికి.. ఇలా అన్నింటికీ కలబంద చేసే మేలు అంతా ఇంతా కాదు. అయితే చర్మం తేమను కోల్పోతుందని చాలామంది ఏవేవో మాయిశ్చరైజింగ్‌ క్రీమ్స్‌ అంటూ వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు. అలాంటి అనవసర ఖర్చు కంటే కలబంద ఎన్నో రెట్లు మేలు చేస్తుందంటున్నారు పర్షియన్‌ అతివలు. కలబంద గుజ్జుతో చర్మాన్ని మసాజ్‌ చేసుకుంటే చాలంటున్నారు. ఇలా తరచూ చేయడం వల్ల చర్మం పొడిబారకుండా జాగ్రత్తపడడంతో పాటు మోముపై ఉండే మచ్చలు, మొటిమలు కూడా తగ్గుముఖం పడతాయి. అంతేకాదు.. వయసు పైబడిన ఛాయలను తగ్గించడంలో కూడా ఈ కలబంద ఎంతో సమర్థంగా పనిచేస్తుంది. ముడతలు తగ్గి నవయవ్వనంగా కనిపిస్తారు. చర్మానికి తేమనందించడానికి కలబందకు బదులుగా అప్పుడప్పుడూ తేనెను కూడా ఉపయోగిస్తుంటారు పర్షియా భామలు. తేనెను ముఖానికి పూతలా వేసుకుని.. కాసేపాగి శుభ్రం చేసుకుంటే చక్కటి ఫలితం మీ సొంతమవుతుంది. అయితే ఈ చిట్కా ఒకట్రెండు సార్లు కాదు.. క్రమం తప్పకుండా పాటిస్తేనే మీరనుకున్న ఫలితాన్ని పొందుతారు.

సెఫీడ్యాబ్‌తో నలుగు పెట్టుకుంటారు!

మనదేశంలో ఇప్పటికీ కొందరు స్నానానికి ముందు సున్నిపిండి, నూనెలతో నలుగు పెట్టుకుని స్నానం చేస్తుంటారు. అది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు.. మేని మెరుపును కాపాడుతుందని చెప్తారు. అలాగే పర్షియా దేశ అతివలు కూడా స్నానమాచరించడానికి ముందు వారి దేశ సంప్రదాయం ప్రకారం ‘వైట్‌ వాటర్‌’ లేదా ‘సెఫీడ్యాబ్‌’ అని పిలిచే చాక్‌పీస్‌లాంటి పదార్థాన్ని వాడతారు. ‘కిసే’ అనే గరుకైన వస్ర్తంపై రుద్దడం ద్వారా అది పొడిగా రాలుతుంది. దాన్ని వారు స్నానానికి ముందు నలుగుగా వాడతారు. ఇలా నలుగు పెట్టుకొని ఆపై మసాజ్‌ చేసుకొని స్నానం చేయడం పర్షియన్‌ ముద్దుగుమ్మల నిత్యకృత్యం. ఇలా చేయడం వల్ల పొడి చర్మానికి ఇది స్క్రబ్‌లా పనిచేస్తుందని, తద్వారా పట్టులాంటి మృదువైన చర్మం సొంతం చేసుకోవచ్చనేది వారి నమ్మకం. ఇలా వారంలో కనీసం ఒక్కసారైనా ఈ చిట్కాను పాటిస్తారా దేశపు మగువలు. చర్మ సౌందర్యం ద్విగుణీకృతమవడానికి, చర్మానికి సాంత్వన లభించడానికి ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది.

మేని కాంతికి ‘కుంకుమ పువ్వు’..

కుంకుమ పువ్వు.. ఆహారానికి అద్భుతమైన రుచిని అందించడంతో పాటు.. పాలనురుగు లాంటి మేనిఛాయను అందించగల ప్రకృతి ప్రసాదించిన పదార్థమిది. మరి పర్షియన్‌ భామలు కూడా తమ మేని ఛాయను రెట్టింపు చేసుకోవడానికి ఈ పదార్థాన్నే వాడుతున్నారు. పావు కప్పు పెరుగుకు, అర టేబుల్‌స్పూన్‌ కుంకుమ పువ్వు, టేబుల్‌ స్పూన్‌ తేనెను కలిపి మిశ్రమంలా తయారుచేయాలి. ఇప్పుడు దీన్ని చర్మంపై పూతలా అప్లై చేసి ఆరనిచ్చి.. ఆపై చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. పెరుగు, తేనె చర్మంలో తేమను నిలిపి ఉంచడంతో పాటు.. మచ్చలను కూడా తొలగిస్తాయి. ఇక కుంకుమ పువ్వు మేని ఛాయను పెంచి మిల్కీ బ్యూటీగా కనిపించేలా చేస్తుంది.

వీటితో పాటు అటు చర్మ సౌందర్యాన్ని, ఇటు కేశ సంపదను కాపాడుకోవడానికి తాజా పండ్లు, కాయగూరలు తీసుకోవడం.. ఎక్కువ మొత్తంలో నీళ్లు, పండ్ల రసాలు తమ ఆహారంలో భాగం చేసుకోవడం పర్షియన్‌ ముద్దుగుమ్మల సౌందర్య రహస్యం.

చూశారుగా.. సహజంగా లభించే సౌందర్య ఉత్పత్తులతో ‘పర్షియా’ మగువలు తమ అందానికి ఎలా మెరుపులద్దుతున్నారో..! మరి మీరూ వీటిని పాటించి అందానికి పర్యాయపదంలా మారిపోండి.. ఏమంటారు??మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని