Mon, February 15, 2016

Type in English and Give Space to Convert to Telugu

'భారత్‌లో తయారీకి బ్రహ్మరథం''ఐపీఎస్‌లను పెంచండి''పాకిస్థాన్‌కు అధునాతన ఎఫ్‌-16 యుద్ధవిమానాలు''ఖేడ్‌లో 81.72 శాతం పోలింగ్‌''దిండి మొదటి దశ పనులకు త్వరలో టెండర్లు''మెదక్‌ నిమ్జ్‌లో చైనా పెట్టుబడులు..''చెలకల్లో.. అవినీతి మొలకలు!''మార్చి 10 నుంచి శాసనసభ సమావేశాలు''మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు''కళతో సామాజిక సందేశం'
సిరి తెచ్చిన సిత్రాలెన్నో..
కొత్త వృత్తిగా భూ దళారీ
అద్దెకు నగదు లెక్కింపు యంత్రాలు
‘రాజధాని గ్రామాల’ తాజా ముఖచిత్రం
ఈనాడు - గుంటూరు
వంట పాత్రలు అద్దెకు ఇవ్వడం ఎక్కడైనా సర్వసాధారణం. డబ్బులు లెక్క పెట్టే యంత్రాలను బాడుగకు ఇవ్వడం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ప్రత్యేకం. ఒక్క తుళ్లూరులోనే నగదు లెక్కింపు యంత్రాలను అద్దెకు ఇచ్చే మూడు దుకాణాలు ప్రారంభమయ్యాయి. రూ.కోటి మొత్తాన్ని లెక్కించడానికి రూ.వెయ్యి అద్దెగా వసూలు చేస్తున్నారు. రూ.కోట్లను చేతితో లెక్కించడానికి బాగా జాప్యం జరుగుతుండడం, నకిలీ నోట్లు ఉంటాయేమోనన్న అనుమానం ఉండడంతో ఈ యంత్రాలను వినియోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణం ప్రకటనతో ఈ ప్రాంతంలో చోటు చేసుకుంటున్న మార్పులకు ఇదొక ఉదాహరణ. తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని ‘రాజధాని గ్రామా’ల్లో ఖాళీ స్థలం దొరికితే చాలు.. కొందామని ఎగబడే వారు అధికమవడంతో ఇక్కడ పరిస్థితులు ఒకేసారి మారిపోయాయి. ఇదొక్కటేనా.. శీతల పానీయాల దుకాణాలు స్థిరాస్తి వ్యాపారం కార్యాలయాలుగా మారాయి. బీమా సంస్థల ప్రతినిధులు (ఏజెంట్లు), ఆటో-కారు డ్రైవర్లు, ఆర్‌ఎంపీ డాక్టర్లు, అపరాలు-పత్తి వ్యాపారులు, టీ కొట్ల యజమానులు, విజయవాడ, గుంటూరు నగరాల్లోని దుకాణాల్లో పనిచేసేందుకు వెళ్లే రోజువారీ కార్మికులు..ఒకరేమిటి, వివిధ వృత్తుల వారు భూమి కొనుగోలు, అమ్మకాల్లో మధ్యవర్తులుగా మారిపోయారు. పాత పరిచయాలు ఉన్న ఇతర ప్రాంతాల వారు వీరిని సంప్రదించి చకచకా పనులు చక్కబెట్టుకుంటున్నారు. మధ్యవర్తులు ఒక శాతాన్ని తమ వాటా (కమీషన్‌)గా తీసుకుంటున్నారు. ఇటీవల ఒక ఆటో డ్రైవరు ఒక్క రోజులోనే రూ.5 లక్షలు సంపాదించడం ఇక్కడి జరుగుతున్న భూ వ్యాపారానికి ఉదాహరణగా నిలుస్తుంది.

పొలాల్లో రైతులు, కూలీల బదులు స్థిరాస్తి వ్యాపారులు, దళారులు కనిపిస్తున్నారు. ట్రాక్టర్లు, ఎడ్ల బళ్ల స్థానంలో కార్లు తిరుగుతున్నాయి. ఉదయాన్నే స్థిరాస్తి వ్యాపారులు గుంపులు గుంపులుగా గ్రామాలకు వచ్చి చర్చలు సాగిస్తున్నారు. రహదారుల పక్కనే కార్లు ఆపి అక్కడికక్కడే బేరాలు చేస్తున్నారు.

అమ్మకాలకు వెనుకంజ: పది రోజుల కిందటి వరకు భూసమీకరణ చేసే గ్రామాల్లో ఎకరా రూ.70లక్షల నుంచి రూ.90లక్షల మధ్య బేరాలు జరిగాయి. తాజాగా రూ.కోటి ఇస్తామన్నా రైతులు భూములు విక్రయించడానికి ఇష్టపడటం లేదు. భూసమీకరణ తరువాత అభివృద్ధి చేసిన స్థలాలు విక్రయిస్తే ఎక్కువ మొత్తం వస్తుందన్న ప్రచారం నేపథ్యంలో ఎవరూ ముందుకు రావడం లేదు. డబ్బులు అవసరం ఉన్న కొద్ది మంది మాత్రమే విక్రయించారు.

ఇక్కడ అమ్మి..పల్నాడులో కొని..: ఇక్కడ భూములు విక్రయించిన రైతులు కొందరు పల్నాడులో నాగార్జున సాగర్‌ కాలువ కింద పొలాలు కొనుగోలు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇందుకో ఉదాహరణ.. తుళ్లూరుకు చెందిన సన్నకారు రైతు మోహన్‌రావుకు రాయపూడి గ్రామ పరిధిలోని కొండ్రాజుపాలెంలో 1.25 ఎకరాల భూమి ఉంది. కుటుంబ అవసరాల కోసం నాలుగేళ్ల కిందట పక్కనే ఉన్న పొలం యజమానికి రూ.7 లక్షలకు కొనుగోలు చేయాలని ప్రాధేయపడ్డా ఫలితం లేకపోయింది. భూమి అమ్మలేక విసిగిపోయి కూలీ పనులకు వెళుతూ కుటుంబం నెట్టుకొచ్చాడు. నెల రోజుల కిందట రాజధానికి భూ సమీకరణ ప్రకటన వచ్చిన వెంటనే బేరం రావడంతో ఎకరా రూ.80 లక్షల చొప్పున మొత్తం భూమిని రూ.కోటికి విక్రయించారు. ఇక్కడ వచ్చిన సొమ్ముతో అచ్చంపేట మండలంలో ఎకరా రూ.29 లక్షల చొప్పున మూడు ఎకరాలు కొనుగోలు చేశాడు. మిగిలిన రూ.10 లక్షలతో ఇంటిని బాగు చేసుకోవడంతో పాటు పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తానని చెబుతున్నాడు. ఆ పొలాన్ని కౌలుకు ఇచ్చినా ఏడాదికి రూ.60 వేలు వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఇదేవిధంగా పలువురు రైతులు ఇక్కడ ఎకరా, రెండెకరాలు భూములు విక్రయించి పల్నాడులో ఎకరా రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు.

సరికొత్త కలహాలు...
రాజధాని ప్రాంతంలో భూముల ధరలు అనూహ్యంగా పెరిగిపోతుండడం కొత్త వివాదాలకు తావిస్తున్నాయి. ఇవి హింసాత్మక సంఘటనలుగా మారుతాయేమోనన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. భూ సమీకరణపై స్పష్టత రావడంతో చాలా మంది రైతులు భూములు అమ్మడానికి ఇష్టపడడం లేదు. అయితే గతంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు భూములు విక్రయించాలని కొన్ని చోట్ల రైతులపై ఒత్తిడి తేవడంతో పాటు, బెదిరింపులకు కూడా దిగుతుండడంతో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. మరికొన్ని చోట్ల తాము తీసుకున్న బయానాలను రైతులు తిరిగి ఇచ్చి వేస్తూ, తాము భూములు అమ్మబోమని చెబుతుండడం కూడా తగాదాలకు కారణమవుతోంది. ఉభయ పక్షాలూ పోలీసులను ఆశ్రయిస్తుండడం నిత్యకృత్యంగా మారింది.

మచ్చుకు కొన్ని... : తుళ్లూరులో నెల కిందట ఎకరా రూ.80 లక్షల చొప్పున ఓ రైతు తనకు ఉన్న 1.25 ఎకరాల భూమిని రూ.కోటికి విక్రయించారు. కొనుగోలు చేసిన వ్యాపారి తొలుత రూ.10 లక్షలు ముందస్తుగా ఇచ్చి నెల వ్యవధిలో రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటానని అనధికారికంగా ఒప్పందం చేసుకున్నారు. ఒక శాతం రుసుం చెల్లించి అధికారిక ఒప్పందం (అగ్రిమెంటు) చేసుకోలేదు. నెలరోజుల గడువు దాటినా ఆయన రాకపోవడం, మరో వ్యాపారి రూ.1.50 కోట్లు చెల్లించడానికి ముందుకు రావడంతో ఆ రైతు విక్రయించాడు. తనకు న్యాయం చేయాలని మొదటి వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇది తమ పరిధిలోకి రాదంటూ వారు తిరస్కరించారు. 
* రాయపూడికి చెందిన ఓ రైతు తన కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఎకరా భూమిని రూ.70 లక్షలకు బేరం పెట్టాడు. ఇది తెలిసిన కుటుంబ సభ్యులు వద్దని పట్టుపట్టగా, తనకు విక్రయించాల్సిందేనని కొనుగోలుదారుడు తీవ్రంగా ఒత్తిడి తెచ్చాడు. చివరకు ఆ రైతు కుమార్తె ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో ఈ లావాదేవీ ప్రస్తుతానికి నిలచిపోయింది. 
* ఉద్దండ్రాయునిపాలెంలో ఓ రైతు 15 రోజుల కిందట తన భూమిని రూ.కోటికి అమ్ముతానని చెప్పగా ఓ కొనుగోలుదారుడు అంత ఇవ్వలేనంటూ వెనుదిరిగాడు. ఇటీవల మళ్లీ వెళ్లి ఆ ధర ఇస్తానని చెప్పగా, తాను భూమి అమ్మబోవడం లేదని ఆ రైతు స్పష్టం చేశాడు. దీంతో ఆ కొనుగోలుదారుడు ఇద్దరు, ముగ్గుర్ని తీసుకొని వెళ్లి బెదిరింపు ధోరణిలో మాట్లాడినట్టు సమాచారం.
* లింగాయపాలెంలో ఓ రైతు తనకు ఉన్న అర ఎకరం భూమిని అమ్మకానికి పెట్టగా ఒకాయన వచ్చి రూ.40 లక్షలు ఇస్తానని, నెల తరువాత వచ్చి దస్తావేజులు రాయించుకుందామని చెప్పాడు. నెల దాటినా రాకపోగా, ఇప్పుడు పాత ధరకే అమ్మాలంటూ ఒత్తిడి తెస్తున్నాడు. అదనంగా రూ.10 లక్షలు ఇవ్వాలని ఆ రైతు కోరుతుంటే, ఇచ్చేది లేదంటూ అతన్ని వేధిస్తున్నట్టు తెలిసింది. ఈ విషయమై కూడా పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇది న్యాయస్థానంలో తేలాల్సిన సమస్య అంటూ నమోదు చేయడానికి తిరస్కరించారు. తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో నిత్యం జరుగుతున్న ఇలాంటి వివాదాలు తమకు నిద్రపట్టనీయకుండా చేస్తున్నాయని అధికారులు చెబుతుండడం గమనార్హం. బెదిరించినట్టు ఆధారాలు ఉంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

వలచి...గెలిచి..

ప్రేమికుల రోజూ.. అదే సూర్యుడు. అవే ఇరుసంధ్యలు. అదే గాలి. అవే దిక్కులు. ఎప్పట్లాగే ఇరవై నాలుగ్గంటలు!! మరేమిటీ ప్రత్యేకం? ఏముంది? ప్రేమే!!...

సీసీఎల్‌-6 విజేత తెలుగు వారియర్స్‌

సెలెబ్రిటీ క్రికెట్‌ లీగ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ తెలుగు వారియర్స్‌ ఫైనల్లో అదిరిపోయే ప్రదర్శనతో కర్ణాటక బుల్డోజర్స్‌ను మట్టికరిపించి రెండోసారి విజేతగా నిలిచింది. ఉప్పల్‌లో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 208 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన అఖిల్‌...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net