కౌన్సెలింగ్‌, ఇంగ్లిష్‌ విభాగాలకు మీ సందేహాలు పంపాల్సిన చిరునామా:

చదువు డెస్క్‌,
ఈనాడు కార్పొరేట్‌ ఆఫీసు, రామోజీ ఫిల్మ్‌ సిటీ
అనాజ్‌పూర్‌ గ్రామం,
హయత్‌నగర్‌ మండలం
రంగారెడ్డి జిల్లా.
తెలంగాణ. 501512
edc@eenadu.net

సివిల్స్‌ ‘సర్వే’ అంశాలు ఇవీ!
సివిల్స్‌ విధానంలో సమగ్ర మార్పుల కోసం బస్వాన్‌ కమిటీ ప్రజాభిప్రాయాలను సేకరిస్తోంది. ఈ పరీక్ష అత్యుత్తమంగా రూపొందటంలో ఇదో సాధనంగా ఉపకరిస్తుందని భావించవచ్చు. సర్వే అంశాలనూ, పరీక్షపద్ధతిలో రాగల పరిణామాలనూ పరిశీలిద్దాం!
సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష విధానం, సిలబస్‌, అర్హతలను సమగ్రంగా పరీక్షించేందుకు ప్రభుత్వం ఆగస్టు 2015లో నిపుణుల కమిటీని నియమించింది. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి బి.ఎస్‌. బస్వాన్‌ అధ్యక్షతన మరో ఆరుగురు సభ్యులతో ఈ కమిటీ రూపొందింది.

ఈ కమిటీ ప్రజాభిప్రాయ సేకరణను ఆరంభించింది. ఈ సర్వేను యూపీఎస్‌సీ గానీ, కేంద్రప్రభుత్వం గానీ నిర్వహించటం లేదని గ్రహించాలి. గతంలో ఏ ఇతర కమిటీలూ ఈ తరహాలో అభిప్రాయాలను సేకరించలేదు. కానీ విద్యావేత్తల, అధికారుల, రాజ్యాంగ అధినేతలను అవి సంప్రదించాయి.

ఈనెల 21 వరకూ...
ఈ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనటం వల్ల ప్రయోజనమే ఉంటుంది. పరీక్ష తీరుపై పరిజ్ఞానం ఉండి, దీంతో ఎంతోకొంత సంబంధమున్నవారు దీనిలో పాల్గొనవచ్చు.

www.upsc.gov.in సైట్లో ప్రశ్నావళి లింకును చూడవచ్చు. ఈ లింకు ఫిబ్రవరి 21 వరకూ పనిచేస్తుంది.

ప్రశ్నావళిని తెరిచాక ఒకటో పేజీ నుంచి ఆరంభించాలి. అన్ని ప్రశ్నలనూ ఒకసారి చూసి, జవాబులు ఇద్దామనుకోకూడదు. అలా చేస్తే... You have already participated in the survey' అనే సందేశం వస్తుంది. మళ్ళీ పాల్గొనడం వీలుకాదు. ఒక ఈ-మెయిల్‌ ఐడీ నుంచి ఒకరే పాల్గొనేలా అభిప్రాయ సేకరణ ప్రశ్నావళిని రూపొందించారు.

కమిటీ చేసే సిఫార్సులు సివిల్స్‌ భాగస్వాముల దృక్పథానికి తగినట్టు ఉన్నాయా అని అవగాహనకు రావటానికి ఈ సర్వే ఉపకరిస్తుంది. అలా జరిగితే ఫిబ్రవరి చివరికల్లా కమిటీ నివేదికను బహిరంగపరుస్తారు. లేకపోతే మరింత వ్యవధిని కూడా అడగవచ్చు.

ఎలాంటి సిఫార్సులు చేసే అవకాశముంది?
కమిటీ కింది సిఫార్సులు చేయవచ్చని ఆశిస్తున్నారు.
* గరిష్ఠ వయసు పరిమితిని 30 ఏళ్ళకు తగ్గించటం, ప్రయత్నాల సంఖ్యను 4కు తగ్గించటం (అభ్యర్థులకు తగిన వ్యవధినిచ్చి).
* ప్రిలిమినరీని ఆన్‌లైన్లో నిర్వహించే వాతావరణం సృష్టించటం. ఒకసారి అర్హత పొందితే రెండు సంవత్సరాలకు చెల్లుబాటయ్యేలా/ రెండు ప్రయత్నాలకు వర్తించేలా చేయటం (రెండిట్లో ఏది ముందైతే అది).
* సీశాట్‌లోని రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ను తొలగించి, జనరల్‌స్టడీస్‌లో మరికొన్ని ప్రశ్నలను జోడించటం.
* మెయిన్‌లో ఇంగ్లిష్‌ అర్హత పేపర్లను కొనసాగించటం. ఈ పేపర్లో ఎస్సే, ప్రెస్సీ రైటింగ్‌కు ప్రాధాన్యం. మోడర్న్‌ ఇండియన్‌ లాంగ్వేజ్‌ని నిలిపివేయటం.
* జనరల్‌ ఎస్సే పేపర్‌ను మరింతగా కేస్‌స్టడీ ఆధారితం చేయటం.
* ఒక్కో సర్వీసుకు ఒక్కోరకమైన ప్రమాణాలు నిర్వచించటం. ఉదాహరణకు ఐఏఎస్‌ ఆశించే అభ్యర్థి గవర్నెన్స్‌, అడ్మినిస్ట్రేటివ్‌ పాలసీ, ప్రణాళికల గురించి అదనపు పేపర్‌ రాయాల్సివుంటుంది. ఐపీఎస్‌ ఆశించేవారు అప్లికేషన్‌ ఆఫ్‌ లా (బేసిక్‌ కాన్సెప్ట్స్‌ ఆఫ్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌, ఇండియన్‌ పీనల్‌ కోడ్‌...) పేపర్‌ను రాయాల్సివస్తుంది.
* అభ్యర్థి అంతర్గత నైపుణ్యాలు పరీక్షించేలా, కోచింగ్‌ పాత్ర పరిమితమయ్యేలా ప్రశ్నలను రూపొందించటం.
* ఆప్షనల్‌ హేతుబద్ధీకరణ. అంటే దీని వెయిటేజిని తగ్గించటం.
* ఎంపిక నిష్పక్షపాతంగా ఉండటానికి ఇంటర్వ్యూ బోర్డుల సంఖ్యను పెంచటం. లేదా ఇంటర్వ్యూ సభ్యుల సంఖ్యను పెంచటం. సైకలాజికల్‌ పద్ధతుల సాయంతో అభ్యర్థి నిజాయతీనీ, అంకితభావాన్నీ పరీక్షించటం.

ఈ కమిటీ సిఫార్సులపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది ప్రభుత్వ విచక్షణ. ఏ ప్రధాన మార్పు అయినా తగినంత వ్యవధి, సమాచారం లేకుండా అమలు కాదు. 2016 సివిల్స్‌ అభ్యర్థులు మార్పుల ఒత్తిడి ఏమీ లేకుండా తమ సన్నద్ధతను యథావిధిగా కొనసాగించవచ్చు.


బస్వాన్‌ కమిటీ అభిప్రాయసేకరణ ఈ అంశాల్లో...
1) సివిల్‌ ఆశావహులకు ఇంగ్లిష్‌లో ప్రాథమిక పరిజ్ఞానం అవసరమా? ఏ దశలో (ప్రిలిమ్స్‌, మెయిన్‌... లేదా రెంటిలో) దీన్ని పరీక్షించాలి?
2) డిగ్రీ చదివిన సబ్జెక్టుల్లో పరిజ్ఞానాన్ని పరీక్షించటం వల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా?
3) భారతీయ సంస్కృతి, సామాజిక వ్యవస్థ, సంప్రదాయాలపై అభ్యర్థి పరిజ్ఞానాన్ని పరీక్షించాలా?
4) దైనందిన వ్యవహారాలతో సంబంధమున్న సబ్జెక్టుల్లో అభ్యర్థిని పరీక్షించాలా?
5) ప్రస్తుత సివిల్స్‌ పరీక్షావిధానం పట్టణ అభ్యర్థులకు అనుకూలించేలా ఉందా?
6) ప్రయత్నాల సంఖ్య, గరిష్ఠ వయసు పరిమితి విషయాల్లో నియంత్రణ ఉండాలా? ఇప్పటి పరిమితులను సడలించాలా?
7) ఒక సర్వీసుకు ఎంపికై, నియమితుడైన అభ్యర్థిని మళ్ళీ పరీక్ష రాసేందుకు అనుమతించాలా?
8) 2011లో ప్రవేశపెట్టిన సీశాట్‌... ప్రిలిమినరీ తీరును మెరుగుపరిచిందా?
9) ప్రిలిమినరీలో ఆప్షనల్‌ను తొలగించటం... అందరికీ సమాన అవకాశాలను కల్పించేలా చేసిందా?
10) మెయిన్‌ పరీక్షలో ఆప్షనల్‌ సబ్జెక్టును కొనసాగించాలా?

  • Railway Recuritment Board
  • Kovida