ఎందుకు? ఏమిటి?ఎలా?
పోటీలకి ముందు చల్లని నీళ్లు తాగకూడదా?
ప్రశ్న: ఉపన్యాసకులు, క్విజ్‌, పాటల పోటీల్లో పాల్గొనేవారు పోటీకి ముందు చల్లని నీరు తాగరాదు అంటారు ఎందుకు?
- పి.విశ్వేశ్వర్రావు, విజయనగరం

జవాబు: దాహంగా ఉన్నవారి ఆలోచనా సరళి సక్రమంగా ఉండనట్లే, కొన్నిసార్లు నీరు తాగడం వల్ల కూడా ఆలోచనా విధానం మందగిస్తుంది. ముఖ్యంగా అతి చల్లని నీరు తాగినప్పుడు.
శాస్త్రజ్ఞుల పరిశోధనల ద్వారా తెలిసిన విషయమేమంటే, దాహంగా ఉన్న వ్యక్తులు ఉపన్యాసం చేసే ముందు అతి చల్లగా లేని మామూలు నీరు ఒక గుక్కెడు తాగితే, వారి మెదడు ఉత్తేజం చెందడంతో బాగా ఉపన్యసించగలుగుతారు. దాహంగా ఉండి కూడా నీరు తాగనివారికన్నా వారి మెదడు 10 శాతం చురుగ్గా పనిచేస్తుంది. అదే దాహం వేయకపోయినా ఉపన్యాసానికి, పాట పాడడానికి, క్విజ్‌లాంటి పోటీల్లో జవాబులు చెప్పడానికి ముందు అతి చల్లని నీరు తాగినవారి ఆలోచనా సామర్థ్యం 15 శాతం తగ్గిపోతుంది.

శాస్త్రజ్ఞుల పరిశీలనల ప్రకారం ఒక వ్యక్తి తాగే నీటి ఉష్ణోగ్రతపై ఆ వ్యక్తి ఏకాగ్రత, ఆలోచనా విధానం ఆధారపడి ఉంటాయి. అతి చల్లని నీరు తాగినపుడు ఆ నీరు శరీరంలో సరిగా ఇమడడానికి అంటే శరీర ఉష్ణోగ్రతకు సమంగా రావడానికి కొంత వేడెక్కవలసి ఉంటుంది. అందుకు కావలసిన శక్తిని ఆ నీరు దేహం నుంచి తీసుకోవడం వల్ల మెదడుకు అందవలసిన శక్తి తగ్గి అది తన సామర్థ్యాన్ని కొంతమేర కోల్పోతుంది. మెదడు చురుగ్గా పనిచేయకపోవడంతో దాని ప్రభావం చల్లని నీరుతాగిన వ్యక్తి మేధా సంపత్తిని స్వల్పంగా తగ్గిస్తుంది. ఉపన్యాసకుని ఆలోచనలకు, క్విజ్‌ పోటీలో పాల్గొనేవారికి సరైన జవాబులు రావడంలో అంతరాయం కలుగుతుంది. పాటలు పాడేవారికి గొంతు బొంగురుపోతుంది.

- ప్రొ॥ ఈ.వి.సుబ్బారావు,
హైదరాబాద్‌

 
  • alaya300-50.gif
  • cinema-300-50.gif
  • sthirasthi_300-50.gif