సాధనా సరళి
close

అంతర్యామి

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సాధనా సరళి

విజయమైనా ఉన్నపాటున ఊడిపడదు. ఆశించినంత మాత్రాన అందుబాటులోకి రాదు. ఒక సంకల్పం, ఒక నిర్ణయం, ఒక నిబద్ధత, ఒక నిష్ఠ... ఇన్నీ కావాలి. ఇవన్నీ కావాలి. అది పక్క ఊరికి వెళ్ళిరావడం కావచ్చు. పరమపదం చేరడం కావచ్చు. ఆ ఆశ లేదా ఆ కార్యం తాలూకు ప్రాధాన్యాన్ని బట్టి దానికి మనం సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది. సన్నద్ధం కావాల్సి ఉంటుంది. నిజానికి జీవితం అంటే ఇంతే. దేన్నయినా ఆశించడం (అది ఆశ కావచ్చు. అవసరం కావచ్చు), దాని కోసం ప్రయత్నం చేస్తూ ముందుకు పోవడం, అది నెరవేరాక మరోదాని కోసం... ఆ తరవాత ఇంకోదాని కోసం...  ఈ కార్యక్రమ సరళిలో మన దృష్టిలో, మన జీవన విధానంలో, నియమావళిలో చివరగా ఉన్నది, మనం చివరగా ఉంచేది పరమపద సోపాన అధిరోహణం. మనం పుట్టింది మొదలు ఈ మెట్లు ఎక్కే పనితప్ప మరోటి లేదా అని దాదాపు అందరూ మీమాంస పడుతూ ఉంటారు. విసుగు చెందుతూ ఉంటారు. నిజమే... అత్యద్భుతమైన ఈ రంగుల ప్రపంచంలో ఆకర్షణలమయమైన ఈ సామాజిక జీవనంలో షడ్రుచుల ఊరింపులో, వాటి అందుబాటులో ఈ కట్టుబాట్లు, ప్రతిబంధకాలు... మోక్షం పేరున ఈ నిబంధనలను, బంధనాలను విధించిన ‘చాలా’ పెద్ద రాక్షసానందం (అలా అనిపిస్తుంది) సగటు మానవుడికి నరకప్రాయమే. మంచి పసరిక ఉన్న పొలంలో వదిలి మూతికి చిక్కం కట్టిన పశువులా మనిషి తల్లడిల్లిపోడా? విచ్చలవిడిగా పోరాడుతున్న ఎలుకలున్న గదిలో బోనులో బంధించిన పిల్లిలా తన్నుకులాడడా? కానీ మనిషి పశువు కాదు. జంతువు కాదు. మనసున్న మనిషి. ఆత్మను ధరించిన అభినవ ఋషి. పరమపద సోపాన అధిరోహణార్థమే అణు వణువూ రూపొంది ఈ భూమి మీదకు వచ్చిన (ఒకవిధంగా కోరివచ్చిన) సిద్ధ సాధకుడు. పథికుడికి గమ్యం చేరేవరకూ దారిని అధిగమించే క్రమంలో ఎన్నో వ్యవస్థలు, అవస్థలు, అవరోధాలు తప్పవు. నిజానికి మెట్టు మెట్టు కట్టుకుంటూ పోనిదే పై అంతస్తు చేరలేము. మనంగా పెట్టుకున్న ప్రణాళిక ఇది. మన అవసరార్థమే, మన పథారోహణకే మన గమ్యసాధనకే చేస్తున్న ప్రయాణమిది. ప్రయత్నం ఇది. నిజమే... గమ్యం ఘనమైనదైనా, పథం క్లిష్టమైనదైనా- కాంతా కనకాలు సహా, కండరాలు సహా కరిగిస్తూ బరువు తగ్గించుకుంటూ, మనసును మాలిన్యాలను నిర్మూలించుకుంటూ, తేలికపడుతూ, ‘నేను’ ‘నాది’ని ఆత్మభావంతో లయం చేస్తూ, చివరికాభావాన్ని కూడా శూన్యం చేస్తూ...
ఎంత ప్రయత్నం! ఎంత నిష్ఠ, ఎంత నిబద్ధత ఉండాలి? ఇదంతా ఊరకే రాదు. ఉన్నపాటున రాదు. సహజంగానే మనకెదురయ్యే సాధనా సరళి. సరంజామా. జీవన ప్రయాణమే ఆ ప్రయత్నాల సరళి. కాఫీకి, కాచే గిన్నెకు సంబంధం లేదు. పొయ్యికీ పొయ్యి వెలిగించే సాధనానికీ కాఫీతో పోలికే ఉండదు. ఆ ప్రయత్నంలో వాడే పరికరాలు, సరకులు వైవిధ్యంగా ఉంటాయి. కానీ రుచికరమైన కాఫీ తయారవుతుంది. పరమార్థమూ అంతే. పరమాత్మ సన్నిధి అంతే. వైవిధ్యమున్నా, వ్యతిరేకమనిపించినా జీవితంలో ఎదురయ్యే ప్రతి అవరోధమూ చేసే చేయవలసిన ప్రతి పనికీ దైవ సన్ముఖానికి సోపానమే.  జీవిత గమ్యానికి, జీవన గమనానికి తగ్గుతూ తరుగుతూ వచ్చే అడుగులే. కాకపోతే వాటిలో ఉపయుక్తమైనవేవో గ్రహించాలి. అంతే. కానివేవో తిరస్కరించాలి. అంతే. జీవితమే ఒక సాధనా సరళి.

- చక్కిలం విజయలక్ష్మి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు