close

ప్రధానాంశాలు

ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులొద్దు

వేయడానికి వీల్లేదన్న హైకోర్టు
రంగులేస్తుంటే మీరేం చేస్తున్నారు?
రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రశ్న
2 వారాల్లో తొలగించాలని ఆదేశం

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీల రంగులను వేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్న తరుణంలో పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు వేస్తుంటే మీరేం చేస్తున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని నిలదీసింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం మీ పనే కదా, అందుకే కదా మీరున్నదని వ్యాఖ్యానించింది. రెండు వారాల్లో రంగులను తొలగించాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై ఏ చర్యలు తీసుకున్నారో వివరణ ఇస్తూ ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఎన్నికల కమిషనర్‌, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడు గ్రామ పంచాయతీ కార్యాలయానికి అధికార వైకాపా జెండా రంగులేయడాన్ని నిలువరించాలని అభ్యర్థిస్తూ రైతు ముప్పా వెంకటేశ్వరరావు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం జరిగిన విచారణలో పిటిషనరు తరఫున న్యాయవాది పాణిని సోమయాజి వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఆదేశాల మేరకు పంచాయతీ కార్యాలయానికి వైకాపా జెండా రంగులు వేయడంపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వినతి సమర్పించానన్నారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రానందున ప్రస్తుతం ఈ వ్యవహారం తమ పరిధిలోకి రాదని వారు రాతపూర్వకంగా బదులిచ్చారన్నారు. దీంతో.. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎన్నికల సంఘం ఏవిధంగా అలాంటి సమాధానం చెబుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వ భవనాలకు ఏ పార్టీ రంగులూ వేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. రెండు వారాల్లో రంగులను మార్చేయాలని ఆదేశించింది. ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది ఎవరని ఆరా తీసింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయని కోర్టుకు తెలిపారు. తీవ్రంగా స్పందించిన ధర్మాసనం.. ఎన్నికలు వాయిదా పడినా పార్టీ రంగులు ఉండటానికి వీల్లేదంది. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడం ప్రభుత్వ పని కాదని తేల్చి చెప్పింది. మధ్యాహ్నం కొనసాగిన విచారణలో ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది కొంత సమయం కావాలని కోర్టును కోరారు. అందుకు నిరాకరించిన ధర్మాసనం.. పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు వేస్తుంటే మీరేం చేస్తున్నారని ప్రశ్నించింది. ఈ విషయంలో ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. రాష్ట్రస్థాయి వ్యవహారం కాబట్టి వైఖరి తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి కౌంటర్‌ వేయాలని తెలిపింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.