గుంటూరు జిల్లా జైలుకు రఘురామకృష్ణరాజు తరలింపు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గుంటూరు జిల్లా జైలుకు రఘురామకృష్ణరాజు తరలింపు

  మెడికల్‌ బోర్డు ఆధ్వర్యంలో గాయాల పరిశీలన

ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే- గుంటూరు (లీగల్‌): నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ పోలీసులు ఆదివారం సాయంత్రం గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. జైలులో 3468 ఖైదీ నంబరు కేటాయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు గుంటూరు జీజీహెచ్‌లో వైద్యుల బృందం (మెడికల్‌ బోర్డు) ఆయన శరీరానికి అయిన గాయాలను పరిశీలించి, నివేదికను జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌కు సమర్పించింది. ఆయన దాన్ని సీల్డు కవర్‌లో గుంటూరు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి గోపీచంద్‌కు అందజేశారు. దాన్ని ఆయన సాయంత్రం హైకోర్టుకు చేర్చారు. అనుచిత వ్యాఖ్యలతో ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చుతున్నారనే అభియోగాలపై ఏపీ సీఐడీ పోలీసులు ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్టు చేసి శనివారం గుంటూరు 6వ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి కె.అరుణ ఈ నెల 28 వరకు రిమాండ్‌ విధించారు. విచారణలో పోలీసులు తనను కొట్టారని, గాయాలను ఎంపీ.. న్యాయమూర్తికి చూపించారు. ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించి, నివేదిక ఇవ్వాలని జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టుతో పాటు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఆదేశించడంతో సీఐడీ పోలీసులు శనివారం రాత్రి ఎంపీని గుంటూరు న్యాయస్థానం నుంచి నేరుగా జీజీహెచ్‌కు తరలించారు. శనివారం రాత్రి 10 గంటల తర్వాత అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌, ఎక్స్‌రే తదితర పరీక్షలు నిర్వహించారు. జనరల్‌ మెడిసిన్‌, ఆర్థో, న్యూరాలజీ, కార్డియాలజీ, జనరల్‌ సర్జన్‌ విభాగాల వైద్యులు ఆయన గాయాలను పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలోని నాట్కో భవనంలో ఎంపీకి బస కల్పించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన మెడికల్‌ బోర్డులోని వైద్యులు ఆదివారం ఉదయం 10 గంటలకు ఎంపీ గాయాలను వేర్వేరుగా పరిశీలించారు. అనంతరం వారంతా కలిపి నివేదికను సిద్ధం చేసి ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు అందజేశారు. సీఐడీ పోలీసులు ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఎంపీని ఆసుపత్రి నుంచి జిల్లా జైలుకు తరలించారు.
నివేదికలో జాప్యం
మెడికల్‌ బోర్డు నివేదికను ఉదయం 10.30 గంటలకల్లా జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందజేయాలని, 12 గంటలకల్లా దాన్ని తమ వద్దకు చేర్చాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ఆదివారం సాయంత్రానికి నివేదిక జిల్లా కోర్టు న్యాయమూర్తికి అందింది. ఆయన వెంటనే దాన్ని హైకోర్టుకు పంపారు. వైద్యపరీక్షలు చేయడాన్ని చిత్రీకరించిన వీడియో, శనివారం సీఐడీ మెజిస్ట్రేట్‌ ముందు రఘురామకృష్ణరాజు ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా హైకోర్టుకు అందజేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని