close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆశలన్నీ న్యాయ వ్యవస్థపైనే..

అమరావతిలో నిరసనలు

ఈనాడు,అమరావతి, న్యూస్‌టుడే, తుళ్లూరు గ్రామీణం: ప్రభుత్వం ఎన్ని అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నా తాము శాంతియుతంగా వాటిని ఎదుర్కొంటామని రాజధాని గ్రామాల రైతులు, రైతు కూలీలు స్పష్టం చేశారు. జగన్‌ సర్కారు తీసుకునే అప్రజాస్వామిక నిర్ణయాలను కోర్టులు అడ్డుకుంటున్నాయని.. న్యాయస్థానాలే మాకు దేవాలయాలు, అక్కడే తమకు న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.  ఒకవైపు కార్యనిర్వాహక రాజధానిని విశాఖకు తరలిస్తూ.. మరోవైపు అమరావతిలో నిర్మాణాలను పూర్తి చేయమని సీఆర్‌డీఏపై సమీక్షలో ముఖ్యమంత్రి అనడం మోసం చేయడం కాదా? అని ప్రశ్నించారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు గురువారం నాటికి 240వ రోజుకు చేరుకున్నాయి. మందడం శిబిరంలో మహిళలు న్యాయదేవతల వేషంలో దృశ్య ప్రదర్శన ఇచ్చారు. దొండపాడులో మరణించిన   నాగేంద్రమ్మకు తుళ్లూరు దీక్షా శిబిరంలో నివాళులర్పించి, మౌనం పాటించారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలపై అసభ్య పోస్టులు పెట్టి ఉద్యమాన్ని, మహిళలను కించపరిచే వారిపై పోలీసులు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. భూములను త్యాగం చేసిన తమను.. కుక్కలతో పోల్చడం దుర్మార్గమన్నారు. వెలగపూడిలో ప్రకాశం జిల్లా పర్చూరు మండలం నాగులపాలెంకు చెందిన రైతులు రూ.1.25 లక్షలను ఐకాసకు విరాళంగా అందజేశారు. పలు రాజధాని గ్రామాలలో  రైతులు, మహిళలు, చిన్నారులు నిరసనలలో పాల్గొన్నారు.
కేంద్రం ప్రచురించిన పుస్తకంలో రాజధాని అమరావతే అని స్పష్టీకరణ
ఈనాడు, దిల్లీ: ఏపీ రాజధాని అమరావతి అని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రచురించిన 2020 వార్షిక పుస్తకంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఏటా మారే భారత రూపురేఖలను వివరిస్తూ ముద్రించే ఈ పుస్తకంలో ప్రతి రాష్ట్రానికి సంబంధించిన సమస్త వివరాలను పొందుపరుస్తుంటారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 4.9 కోట్ల జనాభా, 1,60,205 చ.కి.మీ. వైశాల్యమున్న ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అమరావతి అని వివరించారు. సర్వేయర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా గతేడాది తొలుత రూపొందించిన ఇయర్‌బుక్‌ పొలిటికల్‌ మ్యాప్‌లో అమరావతి లేని ఆంధ్రప్రదేశ్‌ చిత్రాన్ని ముద్రించినప్పటికీ వివరణలో మాత్రం రాష్ట్ర రాజధాని అమరావతి అని రెండు చోట్ల పేర్కొన్నారు.


ఆగిన మహిళా రైతు గుండె

రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసన దీక్షల్లో పాల్గొని ఉద్యమిస్తున్న ఓ మహిళా రైతు గుండె ఆగింది. గురువారం తెల్లవారుజామున తుళ్లూరు మండలం దొండపాడు గ్రామంలో వరగాని నాగేంద్రం(61) గుండెపోటుకు గురై మృతిచెందారు. రాజధాని కోసం ఆమె 95 సెంట్ల భూమిని ఇచ్చారు. మూడు రాజధానుల నిర్ణయం, ఏపీసీఆర్డీఏ బిల్లు రద్దు వంటి అంశాలు పలు రోజులుగా నాగేంద్రం మనసును కుంగదీశాయి. ఆమె భౌతికకాయంపై ఆకుపచ్చని శాలువా కప్పి రాజధాని అమరావతి పరిరక్షణ ఐక్యకార్యాచరణ సమితి సభ్యులు నివాళి అర్పించారు. మహిళా రైతు త్యాగం వృథా కానీయం అని..జై అమరావతి అంటూ నినదించారు. ఆమె మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.