
ప్రధానాంశాలు
నేడు పుదుచ్చేరిలో తీరం దాటనున్న తుపాను
తమిళనాడులో అతి భారీ వర్షాలు
120-145 కిలోమీటర్ల వేగంతో గాలులు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలపైనా ప్రభావం
ఈనాడు డిజిటల్, చెన్నై, ఈనాడు, విశాఖపట్నం, దిల్లీ: నివర్ అతితీవ్ర తుపానుగా తమిళనాడు, పుదుచ్చేరి మీదకి దూసుకువస్తోంది. సముద్రంలో అనువైన ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ అందుబాటులో ఉండటంతో అంతకంతకూ బలపడుతూ తీరంవైపుగా వస్తోందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. బుధవారం సాయంత్రం కరైకల్, మామళ్లపురం(మహాబలిపురం) మధ్య తీరాన్ని తాకుతుందని, ఆ సమయంలో గాలుల ఉద్ధృతి గంటకు 120-145 కి.మీ.ల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మంగళవారం రాత్రి బులిటెన్‌లో ఈ వివరాలు వెల్లడించారు. తుపాను తీరం దాటే సమయంతోపాటు 26, 27న సైతం తమిళనాడులోని కడలూర్, విళ్లుపురం, కళ్లకురిచ్చి జిల్లాల్లో, పుదుచ్చేరిలో అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో, ఆగ్నేయ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 25, 26, 27 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. దక్షిణ కర్ణాటకపైనా కొంతవరకు ప్రభావం ఉంటుందన్నారు. అయితే... గతంలో వచ్చిన గజ కంటే నివర్ ప్రభావం కాస్త తక్కువగానే ఉంటుందని చెన్నై వాతావరణ శాఖ డైరెక్టర్ బాలచంద్రన్ ప్రకటించారు.
ముఖ్యమంత్రులకు ప్రధాని భరోసా
ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యమంత్రులు పళనిస్వామి (తమిళనాడు), నారాయణస్వామి(పుదుచ్చేరి)తో ఫోన్లో మాట్లాడారు. అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. తమిళనాడు వ్యాప్తంగా అత్యవసర విభాగాల ఉద్యోగులకు మినహా మిగిలిన వారికి బుధవారం ప్రభుత్వ సెలవుగా ప్రకటించారు. పుదుచ్చేరిలోనూ మంగళవారం నుంచి మూడు రోజులపాటు 144 సెక్షన్ విధించారు. చెన్నైలో సబర్బన్ సహా దక్షిణ జిల్లాలకు వెళ్లే రైళ్లను నిలిపివేశారు. ఏడు జిల్లాల్లో ఇప్పటికే ప్రజా రవాణాను నిలిపివేశారు.
నివర్ నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అధ్యక్షతన జాతీయ విపత్తు నిర్వహణ సంఘం (ఎన్సీఎంసీ) మంగళవారం సాయంత్రం సమావేశమైంది. ఆన్లైన్ ద్వారా సాగిన సమావేశంలో ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, మంత్రులు హాజరయ్యారు. గౌబా మాట్లాడుతూ... ఎటువంటి ప్రాణనష్టం లేకుండా, సాధ్యమైనంత తక్కువగా ఆస్తినష్టం ఉండేటట్లు చూసుకోవడం మన లక్ష్యం కావాలన్నారు. తమిళనాడు, పుద్చుచేరి, ఆంధ్రప్రదేశ్‌లకు ఇప్పటికే 30 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపామని, మరో 20 బృందాలను సిద్ధంగా ఉంచామన్నారు.
దక్షిణ కోస్తాంధ్ర: 25న: విస్తారవర్షాలు, కొన్నిచోట్ల భారీ, అతిభారీ, అత్యంత భారీవర్షాలు (నెల్లూరు జిల్లాకు ప్రమాద హెచ్చరిక)
26న: విస్తారవర్షాలు, కొన్నిచోట్ల భారీ, అతిభారీ, అత్యంత భారీవర్షాలు (+ప్రమాద హెచ్చరికలు) 27న: విస్తారవర్షాలు
రాయలసీమ: 25న: విస్తార వర్షాలు, కొన్నిచోట్ల భారీ, అతిభారీ, అత్యంత భారీవర్షాలు (చిత్తూరు జిల్లాకు ప్రమాద హెచ్చరిక)
26న: విస్తారవర్షాలు, కొన్నిచోట్ల భారీ, అతిభారీ, అత్యంత భారీవర్షాలు (+తీవ్రప్రమాద హెచ్చరిక) 27న: విస్తారవర్షాలు
ప్రధానాంశాలు
దేవతార్చన

- భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త మృతి
- అఖిలప్రియకు చంద్రబాబు ఫోన్
- నిహారిక పెళ్లి: మా మధ్య మాటలు తగ్గాయ్
- భారత్‌తో పోల్చాలంటే భయమేస్తోంది: ఛాపెల్
- అట్టుడుకుతున్న రష్యా!
- టిక్‌టాక్ స్టార్ ఆత్మహత్య
- పంత్ వచ్చి టీమ్ ప్లాన్ మొత్తాన్ని మార్చేశాడు
- వేదికపై కళ్లు తిరిగిపడిపోయిన డైరెక్టర్
- మేం గెలవడానికి కారణం టిమ్‌పైనే..
- నిజమైన స్నేహానికి అర్థం భారత్: అమెరికా