close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ మంత్రివి అనుచిత వ్యాఖ్యలు

సుప్రీంకోర్టు తీర్పును, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు
ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ స్పష్టీకరణ

ఈనాడు, అమరావతి: ఎన్నిల కమిషన్‌ను, కమిషనరును వ్యక్తిగతంగా ఎవరూ నిందించకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశించినా.. బుధవారం సాయంత్రం ఒక మంత్రి తనపై విమర్శలు చేయడం బాధాకరం, అనుచితమని రాష్ట్ర ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ‘పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనరుపై నేను ఎవరి ప్రాపకం కోసమో చర్య తీసుకున్నానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు తీర్పునకు, రాజ్యాంగ స్ఫూర్తికి, ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధం. సుప్రీంకోర్టు తీర్పు, చేసిన వ్యాఖ్యలు.. ‘లా ఆఫ్‌ ద ల్యాండ్‌’. వాటికి నేనైనా, వ్యవస్థలో నాకంటే ఉన్నతులైనా కట్టుబడి ఉండాల్సిందే. దానికి విరుద్ధంగా ప్రవర్తించడం సుప్రీంకోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసినట్టేనని భావించాల్సి వస్తుంది. అవసరమైతే అదే విషయాన్ని మళ్లీ న్యాయస్థానం ముందు ఉంచాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది. రాగద్వేషాలకు అతీతంగా, చట్టపరంగా, రాజ్యాంగబద్ధంగా ఏం చేయాలన్న దానిపై సరైన సమయంలో దృఢమైన నిర్ణయాలు తీసుకుంటా’ అని రమేశ్‌ కుమార్‌ బుధవారం సాయంత్రం విలేకర్ల సమావేశంలో స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు కొందరు తాత్కాలిక ఆవేశంతో తనపై పరుషమైన వ్యాఖ్యలు చేశారని, వాటిని మనసులో పెట్టుకుని కక్ష సాధింపునకు పాల్పడబోనని ఆయన తెలిపారు. ఉద్యోగ సంఘాలతో మొదటి నుంచీ సన్నిహితంగా మెలిగిన అధికారుల్లో తానూ ఒకడినని తెలిపారు.
ఉదయమే గవర్నరు దృష్టికి తీసుకెళ్లా..
సాయంత్రానికి మళ్లీ విమర్శలు

‘ఎన్నికలపై చర్చించేందుకు గవర్నరు రమ్మంటే ఉదయం వెళ్లి కలిశా. సమస్యలేంటో చెబితే ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి మధ్య వారధిగా ఉండి పరిష్కరిస్తానని ఆయన చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌లతో నాకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా చక్కటి సంబంధాలున్నాయని, ఏ పనైనా సమన్వయంతో నిర్వర్తించుకోగలమని ఆయనకు చెప్పా. వారు సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా తగు నిర్ణయాలు తీసుకున్నారని, అధికారులతో నాకు ఎలాంటి సమస్యా లేదని వివరించా. ఉద్యోగ సంఘాల వారు ఎన్నికల్లో పాల్గొంటామనడాన్ని స్వాగతించానని చెప్పా. ప్రభుత్వంలోని పెద్దలు ఇకనుంచైనా సుప్రీం తీర్పునకు అనుగుణంగా లక్ష్మణ రేఖను దాటకుండా, సంయమనం పాటించేలా చూడాలని కోరా. వాళ్లు కూడా రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేసి పదవుల్లోకి వచ్చినవారే కాబట్టి... ఆ స్ఫూర్తికి కట్టుబడి, ఎన్నికల కమిషన్‌ ప్రతిష్ఠను దెబ్బతీసే వ్యాఖ్యలు చేయకుండా చూడాలని విజ్ఞప్తి చేశాను. సీఎస్‌ను పిలిచి మాట్లాడతానని, మంత్రులందరికీ తన మాటగా చెప్పాల్సిందిగా సూచిస్తానని గవర్నరు నాకు హామీ ఇచ్చారు. ఆయన సీఎస్‌కు ఆ విషయం చెప్పారు కూడా. కానీ సాయంత్రానికి మళ్లీ పరిస్థితి మారిపోయింది. నేను ఎవరి ప్రాపకం కోసమో ఇద్దరు అధికారులపై చర్య తీసుకున్నానని ఒక మంత్రి మాట్లాడారు’’ అని ఆయన పేర్కొన్నారు.
ఓటు హక్కు కోల్పోయిన
వారి తరఫున స్పందించా

‘‘నేను ఇద్దరు అధికారులపై చర్య తీసుకోవడం వాస్తవమే. ఓటు హక్కు కోల్పోయిన 3.62 లక్షల మంది యువత తరఫున నేను స్పందించా. అలాగని ఆ అధికారులకు పూర్తిగా హాని కలిగించే చర్యలేమీ తీసుకోలేదు. వారిని సస్పెండ్‌ చేస్తాననలేదు. బదిలీ చేయాలనో, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనో కోరలేదు. కేవలం వారిని అభిశంసించా. వారి పోకడలో మార్పు వచ్చి, మెరుగైన పనితీరు కనబరిస్తే అభిశంసనపై పునరాలోచించే అవకాశమూ ఉంది. ఎన్నికల సంఘం ఎప్పుడూ కక్షసాధింపు ధోరణితో వ్యవహరించదు. ఆ మాటకొస్తే ఈ రోజు ఉదయం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో సమావేశం మొత్తం నడిపించింది పంచాయతీరాజ్‌శాఖ కమిషనరు గిరిజా శంకరే. జిల్లా అధికారులకు సమస్యలేమైనా ఉంటే.. రాష్ట్ర ఎన్నికల అధికారిగా గిరిజా శంకర్‌నే సంప్రదించాలని సూచించా. ఆయన ప్రతిష్ఠను, గౌరవాన్ని పెంచడానికే ప్రయత్నించా. నేనూ అఖిల భారత సర్వీసుల అధికారినే, ఆ వ్యవస్థ లోంచి వచ్చినవాడినే. ఈ రోజు ఎన్నికల కమిషనరుగా ఉన్నా, మూలాల్ని మర్చిపోలేదు. అధికారులకూ గతం గతః అని, ఉన్న తక్కువ సమయంలోనే సమన్వయంతో పనిచేసి ఎన్నికలను సజావుగా, చక్కగా నిర్వహించడమే ప్రధానమని తెలిపా’ అని రమేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

నాకు ఓటు నిరాకరించారు..

ఎవరిపైనా తాను కక్షసాధింపు ధోరణితో వ్యవహరించబోనంటూ... రమేశ్‌ కుమార్‌ తన స్వానుభవాన్ని వివరించారు. ‘నాకు హైదరాబాద్‌లో ఉన్న ఓటును స్వాధీనం చేసి, నా స్వగ్రామం దుగ్గిరాలలో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నా. దుగ్గిరాలలో నాకు ఇల్లు, పొలం, ఇతర ఆస్తిపాస్తులు ఉన్నాయి. నేను ఉద్యోగరీత్యా ఎక్కడ ఉన్నా, సొంత గ్రామానికి తరచూ వెళ్లి వస్తుంటా. ఏ పౌరుడికైనా దేశంలో ఎక్కడో ఒకచోట ఓటు హక్కు కోరుకునే హక్కు ఉంటుంది కదా..! హైదరాబాద్‌లోని నా ఓటును స్వాధీనం చేసిన సర్టిఫికెట్‌ను జత చేస్తూ ఓటు హక్కు కల్పించాలని దుగ్గిరాల తహసీల్దారుకు దరఖాస్తు చేసుకున్నా. ఓటు హక్కు వస్తే పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయాలనీ అనుకున్నా. మీరు సాధారణంగా దుగ్గిరాలలో ఉండటం లేదు కాబట్టి ఓటు హక్కు కల్పించడం లేదంటూ ఇప్పుడు తాఖీదు పంపారు. నేను కొంత నిరాశ పడ్డా. కానీ కక్ష సాధింపుగా వారిపై చర్య తీసుకోవాలని కోరలేదు. వారి విచక్షణాధికారాన్ని వారు ఉపయోగించారు. నా దరఖాస్తును పునఃపరిశీలించాలని కలెక్టరును కోరా. ఆయన కూడా చేయకపోతే... నా హక్కును కాపాడుకునేందుకు కోర్టుకు వెళతా’ అని రమేశ్‌ కుమార్‌ తెలిపారు. ‘‘నేను ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య వారధిగా ఉండేవాడిని. జాయింట్‌ స్టాఫ్‌ కమిటీ సమావేశాన్ని ఒంటి చేత్తో నడిపేవాడిని. ఆ విషయం ఈ తరం నాయకులకు తెలియదు. ఉద్యోగులతో నేను తిరస్కార, వ్యతిరేక ధోరణితో ఎందుకు ఉంటాను? నేనూ ప్రభుత్వోద్యోగినే. కాకపోతే కొంచెం పెద్ద ఉద్యోగినంతే. నాకు ఉద్యోగుల నుంచి పూర్తి సహకారం ఉందని గవర్నరు దృష్టికి తీసుకెళ్లా’ అని వెల్లడించారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు