కాబోయే అమ్మలూ.. కాస్త భద్రం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాబోయే అమ్మలూ.. కాస్త భద్రం

 కొవిడ్‌తో పెరుగుతున్న ఇబ్బందులు
 వైద్య సంప్రదింపులకూ పదేపదే రావద్దని సూచన
 ముందు జాగ్రత్తలతో ఇబ్బంది ఉండదంటున్న వైద్యులు

కుటుంబాలకు కుటుంబాలనే చిన్నాభిన్నం చేస్తున్న కరోనా మహమ్మారి కాబోయే అమ్మలపైనా కనికరం చూపడం లేదు. తొలి దశలో గర్భిణులు వైరస్‌ బారిన పడినా.. తీవ్రత ఇంతగా కన్పించలేదు. చాలా అరుదుగా మరణాలు సంభవించాయి. ప్రస్తుత దశలో వందల సంఖ్యలో గర్భిణులు మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. కడుపులోని తన ప్రతిరూపాన్ని ఊహించుకుంటూ ఎన్నో కలలుగంటున్న కాబోయే తల్లులకు ఇది పరీక్షా సమయమే. ఈ తరుణంలో నెల తప్పిన నాటి నుంచి కాన్పు వరకూ గర్భిణులు పాటించాల్సిన జాగ్రత్తలేంటి? కుటుంబసభ్యుల సహకారం ఎలా ఉండాలి? వ్యాధి నిరోధక శక్తిని తట్టుకునేలా ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి? నెలవారీ పరీక్షలకు వెళ్లినప్పుడు పాటించాల్సిన పద్ధతులేంటి? అనే
అంశాలపై వైద్యనిపుణుల సూచనలతో.. ప్రత్యేక కథనం..  

కరోనా మహమ్మారి కాబోయే అమ్మలనూ వదలడం లేదు. గతేడాదితో పోల్చితే.. ఈ రెండో దశలో కరోనా ప్రభావం గర్భిణులపై కాస్త ఎక్కువగానే ఉంటోంది. ముందు నుంచీ జాగ్రత్తగా లేని కొందరు ప్రసవ సమయంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సందర్భాలు ఉంటున్నాయి. గర్భిణులు ప్రతినెలా పరీక్షల కోసం ఆసుపత్రులకు వెళ్లే క్రమంలో వైరస్‌ బారిన పడుతున్నారు. ఇందుకు కుటుంబ సభ్యుల అవగాహనలేమి కూడా కొంత కారణమవుతోంది. విజయవాడ జీజీహెచ్‌తో పాటు విశాఖ, తిరుపతి, నెల్లూరు, గుంటూరు, కర్నూలు తదితర నగరాల్లోని పెద్ద ఆసుపత్రుల్లో వందల సంఖ్యలోనే పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. గర్భిణుల్లో కొందరికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం కూడా సమస్యగా పరిణమిస్తోంది. ఈ పరిస్థితుల్లో మొదటి నెలనుంచే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నెలవారీ పరీక్షల నిర్వహణపై వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించి ఆరోగ్య సిబ్బందికి పంపించింది. ప్రసవ సమయంలోనూ కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయాలని, ఫలితాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఏడాదిలో ఇదీ తేడా?

* విజయవాడ రాష్ట్ర కొవిడ్‌ ఆసుపత్రిలో గతేడాది కరోనా తొలిదశలో 250 మంది గర్భిణులు చికిత్స పొందారు. కేవలం ఒకటి రెండు మరణాలు తప్ప పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో 80 మంది కొవిడ్‌తో చేరగా ఇందులో అధిక శాతం ఏ ఇబ్బందీ లేకుండానే కోలుకున్నారు. కానీ 8 మంది చనిపోయారు. మే నెలలోనూ 130 మంది కరోనా పాజిటివ్‌ గర్భిణులు చేరగా.. 32 మందికి సుఖప్రసవాలు జరిగాయి. 8 మంది మృత్యువాత పడ్డారు.
* కర్నూలు జిల్లాలో గతేడాది 120 మంది గర్భిణులు కొవిడ్‌ బారినపడగా.. ఈ రెండో దశలో ఏప్రిల్‌ నుంచి మే మొదటి వారానికే ఈ సంఖ్య 70కి చేరింది.
* విశాఖ కేజీహెచ్‌లో ఏప్రిల్‌లో సుమారు 70 మంది కొవిడ్‌ గర్భిణులకు కాన్పులు చేశారు. ఏడుగురు మృత్యువాత పడ్డారు.
* కాకినాడ జీజీహెచ్‌, తిరుపతి ప్రసూతి ఆసుపత్రుల్లోనూ అధిక శాతం గర్భిణులు కోలుకుంటున్నా.. కొద్ది మరణాలు మాత్రం నమోదవుతున్నాయి.


ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

* ప్రపంచ ఆరోగ్య సంస్థ 2014 మార్గదర్శకాల ప్రకారం గర్భం దాల్చిన నాటి నుంచి తొలి మూడు నెలల్లో ఒకసారి, ఏడో నెలలోపు రెండుసార్లు, ఏడో నెల దాటాక కనీసం ఐదుసార్లు వైద్యులను సంప్రదించాలి. అయితే, కరోనా నేపథ్యంలో పరీక్షల పేరుతో ఎక్కువసార్లు ఆసుపత్రికి వెళ్లకుండా ముందే వైద్యులతో మాట్లాడి విజిట్‌లను కుదించుకోవాలి. 2-3 వారాలకు ఒకసారి, మూడోనెలలో మరోసారి, నాలుగైదు నెలల్లో, తర్వాత 8వ నెలలో వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.
* చిన్నచిన్న అనుమానాలకు ఆసుపత్రికి వెళ్లకుండా టెలీమెడిసిన్‌ సౌకర్యాన్ని పొందాలి.
* ఇంట్లో ఒకరికి వైరస్‌ సోకినట్లు తెలిస్తే గర్భిణి అప్రమత్తంగా ఉండాలి. అన్ని సౌకర్యాలు కలిగిన ఆసుపత్రులకు చేరువగా ఉండాలి. ఆయాసం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
* గర్భిణులు ఇంట్లోనూ ప్రత్యేక గదిలో ఉండటం శ్రేయస్కరం. మిగతా కుటుంబ సభ్యులతోనూ భౌతిక ఎడం పాటించాలి. వాడే వస్తువులన్నీ ప్రత్యేకంగా పెట్టుకోవాలి.
* గ్రామాల్లో ఉన్న గర్భిణులు స్థానిక ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలను నిరంతరం సంప్రదిస్తూ ఉండాలి.

అది ఏ రకమైన ఆయాసం?

ఎక్కువ మంది గర్భిణులు శరీరంలో ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గిన తర్వాతే ఆస్పత్రికి వస్తుండటం ప్రమాదకరంగా పరిణమిస్తోంది. సాధారణంగా గర్భిణుల్లో ఆరు నెలల తర్వాత ఆయాసం, అలసట ఎక్కువగా కన్పిస్తుంటాయి. మామూలు స్థితిలో గట్టిగా ఊపిరి పీల్చి వదిలినప్పుడు పొట్ట, ఛాతీ మధ్యలో ఉన్న భాగం (డయాఫ్రమ్‌) పైకి కిందికి కదులుతుంది. నెలలు నిండేకొద్దీ కడుపులోని శిశువు పెరిగి గర్భసంచి విస్తరిస్తుంది. పొట్ట, ఛాతీ మధ్య కదలిక కష్టమై ఆయాసం, అలసట వస్తుంటాయి. కరోనా దృష్ట్యా ప్రస్తుత తరుణంలో గర్భిణుల్లో ఆయాసం కన్పించినప్పుడు అది ఏ తరహా.. అన్నది నిర్ధారించుకోవాలి. కరోనా రోగుల్లో ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోవడం, మరికొందరిలో గుండె, ఊపిరితిత్తుల్లో సమస్యల వల్ల ఆయాసం వస్తుంది. కొందరిలో తొలి నుంచే రక్తహీనత సమస్య వేధిస్తుంటుంది. గర్భిణులు కొందరికి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇవి కూడా ఆయాసం, నీరసానికి కారణమే. ఇలాంటి సమస్యలు ఉత్పన్నమైతే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

ఊపిరితిత్తులపై వైరస్‌ దాడి
- డాక్టర్‌ అరుణ వాసిరెడ్డి, పల్మనాలజిస్ట్‌, విజయవాడ జీజీహెచ్‌

* రెండో దశలో కొవిడ్‌ ప్రభావం గర్భిణులపై తీవ్రంగా ఉంది. పాజిటివ్‌ అని తేలిన కొద్దిరోజులకే రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి పడిపోయి మరణాలు సంభవిస్తున్నాయి.
* వైరస్‌ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే ఊపిరితిత్తులపై దాడి చేస్తుండటంతో బాధితులు శ్వాస పీల్చుకోవడంలో సమస్యలొస్తున్నాయి. ఆసుపత్రికి వచ్చిన వెంటనే ఆక్సిజన్‌ ఇవ్వాల్సి వస్తోంది.
* రేడియేషన్‌ బారిన పడతారని వీరికి సీటీ స్కాన్‌, ఎక్స్‌రే తీయడం లేదు. లక్షణాలు, వ్యాధి  తీవ్రతను బట్టి స్టెరాయిడ్స్‌, ఇతర మందులు వాడుతున్నాం. పలువురికి రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను ఇస్తున్నాం. ప్లాస్మాథెరపీ ఇవ్వాల్సి వస్తోంది.
* తల్లీబిడ్డ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చికిత్స చేస్తున్నాం. శిశువులపై ప్రస్తుతానికి కొవిడ్‌ ప్రభావం తక్కువగానే ఉంది. క్షేత్రస్థాయిలో ఆరోగ్య సిబ్బంది రోగులను పర్యవేక్షిస్తుండాలి.

సురక్షిత ప్రసవాలే..
- డాక్టర్‌ సౌజన్య, గైనిక్‌ విభాగాధిపతి, విజయవాడ జీజీహెచ్‌

కొవిడ్‌ సోకినప్పటికీ సురక్షితంగానే ప్రసవాలు జరుగుతున్నాయి. వైద్యులు, ఇతర సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి, తగిన జాగ్రత్తలతో ప్రసవాలు చేస్తున్నారు. ఆందోళన చెందనక్కర్లేదు. గర్భిణులు కొవిడ్‌ బారిన పడకుండా కుటుంబసభ్యులే కంటికి రెప్పలా చూసుకోవాలి.

ఈ రెండో దశలో మరీ జాగ్రత్త!
-డాక్టర్‌ పార్థసారథిరెడ్డి, తిరుపతి ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రి

రెండో దశ కరోనా గర్భిణులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మరణాలూ సంభవిస్తున్నాయి. కుటుంబసభ్యుల్లో ఎవరికైనా కొవిడ్‌ వస్తే గర్భిణులకూ సోకుతుంది. సీమంతం వేడుకలు, నెలావారీ చెకప్‌లు, స్కానింగ్‌ కేంద్రాలకు వెళ్లినపుడు వైరస్‌ సోకుతోంది. వ్యాప్తి తీవ్రత దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలి.


  ప్రతి నెలా కీలకమే..
-డాక్టర్‌ మహాలక్ష్మి, గైనకాలజీ విభాగాధిపతి, గాంధీ ఆసుపత్రి, హైదరాబాద్‌

* గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు ప్రతినెలా కీలకమే. శరీరంలో ఏదైనా మార్పు లేదా లక్షణాలు కన్పిస్తే వైద్యులకు చెప్పాలి
* తొలి 3 నెలలు ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు వేసుకోవాలి. టీటీ ఇంజక్షన్‌ తీసుకోవాలి. నాలుగో నెల నుంచి ఫోలిక్‌ యాసిడ్‌తోపాటు ఐరన్‌ కూడా తప్పనిసరి. డెలివరీ తర్వాత 6 నెలల వరకూ వాడాలి.
* ఆహారంలో గుడ్డు, పాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చికెన్‌, చేపలు ఉండేలా చూసుకోవాలి. మంచి ఆహారం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
* జ్వరం, దగ్గు, ఆయాసం, చేతులు, కాళ్ల వాపు, గుండె దడ, కడుపులో శిశువు కదలిక లేకపోవడం లాంటి లక్షణాలు గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
*ఇంట్లోనే డిజిటల్‌ థర్మామీటర్‌, బీపీ ఆపరేటర్‌, పల్స్‌ ఆక్సిమీటర్‌ అందుబాటులో పెట్టుకోవాలి. కరోనా సోకి వైద్యుల సూచనలతో హోం ఐసొలేషన్‌లో ఉన్నవారు జ్వరం, బీపీ, పల్స్‌, ఆక్సిజన్‌ స్థాయులు పరీక్షించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఆక్సిజన్‌ 94-95 శాతానికి తగ్గితే వెంటనే ఆసుపత్రిలో చేరాలి.

  ప్రత్యేక ప్రణాళిక అవసరం
- డాక్టర్‌ సవితాదేవి, ప్రముఖ గైనకాలజిస్టు, హైదరాబాద్‌

* కొవిడ్‌ సోకిన వారి ఇళ్లలో గర్భిణులు ఉంటే ముందే ప్రణాళిక అవసరం. అత్యవసరమైతే ఎక్కడ చేరాలి? కొవిడ్‌ సోకితే ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడ చికిత్స అందిస్తున్నారు? తదితర వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలి. అన్ని ప్రసూతి ఆసుపత్రులు కొవిడ్‌ సోకిన గర్భిణులకు చికిత్స అందించడం లేదు. హైరిస్క్‌ సేవలు అందించే కేంద్రాల్లోనే ప్రసవం చేస్తున్నారు. వారిని సంప్రదించవచ్చు.
* కొవిడ్‌ సోకిన గర్భిణుల్లో జ్వరం 100 డిగ్రీల కంటే ఎక్కువ ఉన్నా.. తీవ్ర ఆయాసం,  ఆక్సిజన్‌ 94 శాతం కంటే తగ్గినా నిర్లక్ష్యం చేయకుండా ఆసుపత్రిలో చేరాలి. సీఆర్‌పీ, డీ డైమర్‌, సీబీపీ, ఈఎస్‌ఆర్‌ లాంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది.
* గర్భిణులు పెళ్లిళ్లు, సీమంతాలు, పుట్టిన రోజులు, బంధువుల ఇళ్లకు వెళ్లడం పూర్తిగా తగ్గించుకోవాలి.
* సొంత వైద్యం పనికిరాదు. వైరల్‌ మందులను వైద్యుల సూచనలతోనే తీసుకోవాలి. జ్వరం వస్తే పారాసిటమాల్‌ లాంటివి ప్రతి 6-8 గంటలకు తీసుకోవచ్చు.

- ఈనాడు, అమరావతి, హైదరాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని