పాలమూరు-రంగారెడ్డి పనులను నిలిపేయండి

ప్రధానాంశాలు

పాలమూరు-రంగారెడ్డి పనులను నిలిపేయండి

తాగునీటి పేరుతో సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం
రెండు రాష్ట్రాల్లోనూ పర్యావరణంపై ప్రభావం
జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు ఏపీ వినతి

ఈనాడు, హైదరాబాద్‌: ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను నిలిపివేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ)ని ఆంధ్రప్రదేశ్‌ కోరింది. కృష్ణా జల వివాద ట్రైబ్యునల్‌-1, 2లో దీనికి కేటాయింపు లేదని, పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూలులో కూడా లేదని తెలిపింది. దీనివల్ల రెండు రాష్ట్రాల్లోనూ పర్యావరణంపై ప్రభావం ఉంటుందంటూ ఎన్జీటీ ఎదుట రెండు అఫిడవిట్లను మంగళవారం దాఖలు చేసింది. ‘పర్యావరణ చట్టాలను ఉల్లంఘించి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం ఈ ప్రాజెక్టు కట్టే హక్కు లేదు.

ఏ ట్రైబ్యునల్‌ నుంచీ కేటాయింపుల్లేవు. కృష్ణా ట్రైబ్యునల్‌-1 చేసిన  811 టీఎంసీలలో తెలంగాణ 299, ఆంధ్రప్రదేశ్‌ 512 టీఎంసీలు వినియోగించుకొనేలా ఏర్పాటు జరిగింది. పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూలు ప్రకారం తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుగంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగొండ మినహా మిగిలిన ఏ ప్రాజెక్టు అయినా కొత్తదే. శ్రీశైలం నుంచి 90 టీఎంసీల నీటిని తీసుకొని ఆయకట్టుకు సరఫరా చేసేందుకు 2015 జూన్‌ 10న తెలంగాణ జీవో 105 జారీచేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రెండుసార్లు రూపొందించిన నివేదికల్లో ఒక దాంట్లో సాగునీటికి 84.85, తాగుకు 5.15 టీఎంసీలు, ఇంకొక దాంట్లో సాగునీటికి 83.9, తాగుకు 6.1 టీఎంసీలుగా నివేదించారు. మిషన్‌ భగీరథ కింద తాగునీటికి 23.4 టీఎంసీలు తీసుకుంటున్నారు. తాగునీటి ప్రాజెక్టు పేరుతో సాగునీటి ప్రాజెక్టుగా నిర్మాణం చేపట్టారు. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేసేందుకే ఇలా చేశారు. తెలంగాణ సాంకేతిక సలహా కమిటీ నివేదికలోనూ, కృష్ణా ట్రైబ్యునల్‌-2 ఎదుట తెలంగాణ సాక్షిగా ఉన్న పళనిస్వామి సమర్పించిన అఫిడవిట్‌లోనూ పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుగానే ఉంది. ట్రైబ్యునల్‌-2 చేసిన కేటాయింపులు, షెడ్యూలు-11వ ప్రాజెక్టులను పరిగణలోకి తీసుకొని నీటి లభ్యతను తేల్చాల్చి ఉంది. ఇవేమీ జరగకుండా ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్లడం తగదు. ట్రైబ్యునల్‌ జోక్యం చేసుకొని నిలిపివేయాలి’ అని అఫిడవిట్లలో ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని