ఈ నిర్లక్ష్యానికి మందేది?

ప్రధానాంశాలు

ఈ నిర్లక్ష్యానికి మందేది?

కోటా అయిపోయిందంటూ ఆసుపత్రులకు మొండిచేయి
మరోవైపు గుంటూరు సీడీఎస్‌లో వృథాగా ఔషధాలు
ఈ-ఔషధి పోర్టల్‌తో సాంకేతిక అవస్థలు

ఈనాడు, అమరావతి: క్యాన్సర్‌ రోగులకు డాక్సోరుబిసిన్‌ 10ఎంజీ, 5ఎంఎల్‌ ఇంజక్షన్లు, పాస్లిటాక్సెల్‌ ఇంజక్షన్‌ 30 ఎంజీ, 5 ఎంఎల్‌ అవసరం ఎక్కువ. వీటిని సరఫరా చేయాలని గుంటూరు సర్వజనాసుపత్రి వైద్యులు అక్కడే ఉన్న కేంద్ర ఔషధ నిధి (సీడీఎస్‌) అధికారులను కోరారు. సీడీఎస్‌లో ఆ మందులు డబ్బాలకొద్దీ ఉన్నప్పటికీ.. ఇప్పటికే మీకు కేటాయించిన కోటా వాడేశారంటూ ఇవ్వడం లేదు. ఇదే సీడీఎస్‌లో వేర్వేరు బ్యాచ్‌ నంబర్లతో సుమారు 2400 ఇంజక్షన్లు ఉన్నాయి. సెప్టెంబరుతో కాలంచెల్లే వీటిని ఆసుపత్రులకు అందించలేదు. ఇప్పటికిప్పుడు ఇచ్చినా.. అవి రోగులు వాడుకునేందుకు గడువు చాలదు. ఈ ఇంజక్షన్లను కొన్నాళ్లుగా రోగులు ప్రైవేటు దుకాణాల్లో కొనుక్కొంటున్నారు. కొన్ని ఔషధాలు సీడీఎస్‌లో ఉన్నప్పటికీ.. జీజీహెచ్‌కు ఇవ్వనందున అధికారులు బయటినుంచి కొని తెప్పించారు. ఆ బిల్లులు రూ.80 లక్షలు పేరుకుపోయాయి. దీంతో వ్యాపారులు కొత్తగా మందులు ఇవ్వడం లేదు.
గుంటూరులోని సీడీఎస్‌లో ప్రస్తుతం ఔషధాలు, ఇంజక్షన్లు, సర్జికల్స్‌ నిల్వలు నిండిపోయాయి. గాలి, వెలుతురు చొరబడనంతగా గదుల నిండా మందుల పెట్టెలను గుట్టలుగా పేర్చారు. ఆసుపత్రులకు కేటాయించిన నిర్దేశిత బడ్జెట్‌ అయిపోతే.. స్థానికంగా ఇండెంట్‌ పెట్టుకోవడానికి వీల్లేకుండా ఈ-ఔషధి ఆన్‌లైన్‌ విధానం ఉంది. దీన్ని ఉన్నతాధికారులు సవరించడం లేదు. వెరసి రెండు మూడు నెలలుగా సాధారణ, క్యాన్సర్‌ రోగులకు మందులు కావాలని ఆసుపత్రి వర్గాలు కోరినా.. సీడీఎస్‌ నుంచి పంపించడం లేదు. నిబంధనల సాకుతో గోదాములోనే మగ్గబెడుతున్నారు. గుంటూరు జీజీహెచ్‌కు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి రోగులు వస్తుంటారని తెలిసినా.. కోటా పెంచలేదు. ఇవే మందులు అనంతపురం, కర్నూలు, కాకినాడ, విశాఖ ఆసుపత్రుల్లోనూ ఉన్నాయి. వాటిని మళ్లించడం లేదు. ప్రమాద బాధితులకు డ్రెస్సింగ్‌ చేయడానికి, కుట్లు వేయడానికి వాడే సుచర్‌ మెటీరియల్‌ లేదు. ఎమర్జెన్సీ, గైనిక్‌ ఓటీల్లో వీటి కొరతపై పీజీ వైద్యులు రెండు, మూడుసార్లు ఉన్నతాధికారులకు చెప్పినా సమస్య పరిష్కారం కాలేదు.

దుమ్ము, ధూళీ పడుతున్నా..

కొవిడ్‌తో కొన్నాళ్ల పాటు జీజీహెచ్‌ సహా పలు ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. సర్జికల్స్‌ సామగ్రి వాడకం తగ్గింది. ఆపరేషన్‌ థియేటర్లలో వాడే తల క్యాప్‌లు, బ్యాండేజ్‌ క్లాత్‌, ఇతర సర్జికల్స్‌ సామగ్రి భారీగా సీడీఎస్‌తో పాటు జీజీహెచ్‌ అనుబంధ వైద్య కళాశాల హాస్టల్‌లో నిల్వ ఉంచారు. సరిపడా స్థలం లేక కుప్పలుగా పడేశారు. సెలైన్‌ బాటిళ్లు నేలపై దుమ్ము, ధూళిలో కలిసిపోయాయి. బ్యాండేజ్‌ క్లాత్‌ను భద్రత లేకుండా వదిలేశారు. కొన్ని పెట్టెలపై ప్యాకింగ్‌ ముద్రలు చెరిగిపోయాయి. బ్లీచింగ్‌ పౌడర్‌ స్టోర్‌ గదుల్లో మగ్గుతోంది. కాలం చెల్లిన మందులూ డబ్బాల కొద్దీ ఉన్నాయి. వాటిని ధ్వంసం చేయడం లేదు. మొత్తంగా అధికారుల పర్యవేక్షణ లేమితో రూ.లక్షల విలువైన ఔషధాలు, సర్జికల్స్‌, నిరుపయోగమయ్యాయి. దీనిపై సీడీఎస్‌ అధికారులను ప్రశ్నించగా.. ‘జీజీహెచ్‌కు ఇండెంట్‌ మేరకు మందులు, సర్జికల్స్‌ పంపుతున్నాం. బడ్జెట్‌ అయిపోతే మేమేం చేయలేం. ఇటీవల మూడో త్రైమాసికం కోటా రావడంతో నిల్వలు పెరిగాయ’ని చెబుతున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని