గంటన్నరపాటు నిలిచిన తితిదే వెబ్‌సైట్‌

ప్రధానాంశాలు

గంటన్నరపాటు నిలిచిన తితిదే వెబ్‌సైట్‌

జియో మార్టు పేరుతో రావడంపై ఆందోళన
రెండు గంటల్లోనే 2.39 లక్షల టికెట్ల నమోదు

ఈనాడు-తిరుపతి, న్యూస్‌టుడే, తిరుమల: తితిదే ప్రత్యేక ప్రవేశ టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్న వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గతంలో తితిదే వెబ్సైట్‌ను టీసీఎస్‌ నిర్వహిస్తూ ఉండేది. ఆ తర్వాత తితిదే వద్ద ఉన్న సర్వర్‌ సామర్థ్యం తక్కువగా ఉందని ప్రభుత్వ డొమెయిన్‌కు మారిపోయారు. తాజాగా శుక్రవారం టికెట్ల విడుదల సమయంలో గందరగోళం నెలకొంది. జియోమార్ట్‌ పేరుతో రావడంపై భక్తులు ఆందోళనకు గురయ్యారు. తితిదే అధికారులు తొమ్మిది గంటలకు టికెట్లను విడుదల చేయగా గంటన్నరపాటు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. 10.30 తర్వాత సమస్యలు కొలిక్కి రావడంతో గంటన్నర వ్యవధిలోనే ఏకంగా 2.39 లక్షల టికెట్లు నమోదయ్యాయి.
మొదట
tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లిన వెంటనే  tirupatibalaji.jiomart.com అని వచ్చింది. చరవాణి నంబరు ఇస్తే ఓటీపీ వస్తుందని అందులో కనిపించింది. చాలా మంది ప్రయత్నించినా గంటన్నరసేపు వెబ్‌సైట్‌ పనిచేయలేదు. మరికొందరికి నగదు చెల్లింపుల వద్ద నిలిచిపోగా, నగదు చెల్లించినట్లు ఇంకొందరికి కనిపించినా టికెట్లు మాత్రం రాలేదని చెబుతున్నారు. ఇలా తితిదే వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. మరోవైపు జియోమార్టు పేరు ఎందుకు వచ్చిందనే అంశంపై భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఎవరైనా తితిదే వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత తితిదే అధికారులు దీనిపై వివరణ ఇచ్చారు. 

సమయాభావంతోనే అలా..
అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడి

తితిదే మొదటిసారిగా క్లౌడ్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రారంభించిన శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం అక్టోబరు నెల కోటా టికెట్ల ఆన్‌లైన్‌ బుకింగ్‌కు భక్తుల నుంచి విశేష స్పందన లభించిందని అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. స్థానిక అన్నమయ్య భవనంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ..
www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో సమయాభావం వల్లనే జియోమార్ట్‌ డొమైన్‌ను వినియోగించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. వచ్చే నెలలో పూర్తిగా తితిదే డొమైన్‌లోనే దర్శన టికెట్లు విడుదల చేస్తామన్నారు. ఒకే సమయంలో ఒక టికెట్‌కు 5.5 లక్షల మంది ఆన్‌లైన్‌లో ప్రయత్నించారని, మొత్తంగా తితిదే వెబ్‌సైట్‌కు కోటికిపైగా హిట్స్‌ వచ్చాయన్నారు. అక్టోబర్‌ నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను రోజుకు 8వేలు చొప్పున 2 లక్షల 40 వేలను గంటన్నరలోనే భక్తులు బుక్‌ చేసినట్లు తెలిపారు. శనివారం ఉదయం 9 గంటలకు రోజుకు 8 వేలు చొప్పున శ్రీవారి సర్వదర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామన్నారు.

వాస్తవాలు తెలుసుకోకుండా తితిదే దర్శన టికెట్ల బుకింగ్‌ వ్యవస్థను జియో సంస్థకు అప్పగించిందని కొన్ని ఛానళ్లు, సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేశారని, ఇలాంటి వార్తలను నమ్మవద్దని అదనపు ఈవో విజ్ఞప్తి చేశారు. దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రత్యేక ఆహ్వానితుల జీవోపై సుప్రీంలో కేవియట్‌
ఈనాడు, దిల్లీ : తితిదే పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వానితుల వ్యవహారంపై కళ్యాణదుర్గం నియోజకవర్గ తెదేపా బాధ్యుడు మాదినేని ఉమామహేశ్వర నాయుడు శుక్రవారం సుప్రీంకోర్టులో కేవియట్‌ దాఖలు చేశారు.

సేవా తత్పరతపై దుష్ప్రచారం బాధాకరం: ఛైర్మన్‌ సుబ్బారెడ్డి
జియోమార్ట్‌ సంస్థ సబ్‌డొమైన్‌తో తితిదే వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల చేయడంపై సామాజిక మాధ్యమాల్లో జరిగింది దుష్ప్రచారమేనని తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఓ ప్రకటనలో ఆక్షేపించారు. జియోసంస్థ సేవాభావంతో దాదాపు రూ.3 కోట్ల విలువైన సాంకేతిక సహకారం, మౌలిక సదుపాయాలు ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని