ప్రతి ఎకరా ఈ-క్రాపింగ్‌ జరగాలి

ప్రధానాంశాలు

ప్రతి ఎకరా ఈ-క్రాపింగ్‌ జరగాలి

నమోదు చేసుకున్న కంపెనీల ఉత్పత్తులే సరఫరా
26న రైతు భరోసా రెండో విడత
ఏటా జూన్‌, డిసెంబరులో పింఛన్లు,  రేషన్‌కార్డులు, పట్టాల మంజూరు
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: ‘గ్రామంలోని ప్రతి ఎకరా ఈ-క్రాపింగ్‌ జరగాలి. ఇది ఉంటేనే పంటల బీమా, సున్నా వడ్డీ, పంటల కొనుగోళ్లు, పెట్టుబడి రాయితీ సక్రమంగా అమలవుతాయి. ఎక్కడైనా ధరల విషయంలో రైతులు నిరాశతో ఉంటే... సీఎం యాప్‌ ద్వారా పర్యవేక్షించి, వెంటనే వారిని ఆదుకునే చర్యలు తీసుకోవాలి. విత్తన కార్పొరేషన్‌లో నమోదైన కంపెనీలు మాత్రమే విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు సరఫరా చేయాలి. వీటికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందనే విషయాన్ని మరిచిపోవద్దు. ఈనెల 26న రైతు భరోసా రెండో విడత కార్యక్రమం ఉంటుంది. అర్హులు ఎవరూ మిగిలిపోకుండా, అనర్హులకు ఇది అందకుండా చూడాలి’ అని సీఎం జగన్‌ ఆదేశించారు. గురువారం స్పందన కార్యక్రమంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ...

రైతులు అడిగినవి ఇవ్వాల్సిందే

నవంబరు నుంచి రబీ ఊపందుకోనుంది. 56 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశముంది. ఎరువు, విత్తనం, పురుగుమందుల్లో పలానాది కావాలని రైతు అడిగితే, కచ్చితంగా ఆర్బీకే ద్వారా ఇవ్వాలి. ప్రతి 15 రోజులకు కలెక్టర్లు ఆర్బీకేలపై సమీక్ష నిర్వహించాలి. నెలలో వరుసగా నాలుగు శుక్రవారాలు... ఆర్బీకే స్థాయి, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో సమావేశాలు జరగాలి. ఆర్బీకేలలో బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు ఉండేలా చర్యలు తీసుకోండి. కౌలు రైతులకు సీసీఆర్‌సీ కార్డులిచ్చాం వారికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు వెనకడు వేయాల్సిన పనిలేదు.

తొలి విడత 4,314 డిజిటల్‌ గ్రంథాలయాలు

* గ్రామాల్లో వైఎస్‌ఆర్‌ డిజిటల్‌ లైబ్రరీలతో వర్క్‌ఫ్రం హోం విధానం సాకారమవుతుంది. తొలివిడత 4,314 లైబ్రరీలను నిర్మిస్తున్నాం.

* నరేగాలో మెటీరియల్‌ కాంపొనెంట్‌ వినియోగంపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనంతపురం జిల్లాల కలెక్టర్లు దృష్టిపెట్టాలి. కృష్ణా, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాలు గ్రామ సచివాలయాల నిర్మాణంలో వెనుకబడి ఉన్నాయి.

51 గ్రామాల్లో సర్వే పూర్తయితే జాతికి అంకితం

* జగనన్న శాశ్వత భూహక్కు పథకం పైలెట్‌ ప్రాజెక్ట్‌గా 51 గ్రామాల్లో సర్వే పూర్తికాగానే జాతికి అంకితం చేస్తాం. 2023 జూన్‌కి రాష్ట్రమంతా సర్వే ముగుస్తుంది.

* డిసెంబరు 21 ప్రారంభమయ్యే జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంతో 47.4 లక్షల మందికి పట్టాలు అందుతాయి. వారి ఇంటి స్థలంపై అన్నిరకాల హక్కులు వస్తాయి.

పనిచేయని వాలంటీర్లను తొలగించి, కొత్తవారిని నియమించండి

* రాష్ట్రంలోని 80% సచివాలయ ఉద్యోగులు మంచి పనితీరు కనబరుస్తున్నారు. మిగిలిన 20% మెరుగుపడాలి. వాలంటీర్లకు కౌన్సెలింగ్‌ చేసి అప్‌గ్రేడ్‌ అయ్యేలా చూడాలి. అయినాసరే సేవలలో ప్రమాణాలను అందుకోకుంటే తొలగించి, కొత్తవారిని నియమించండి.

* ఏటా జూన్‌, డిసెంబరులో పింఛన్లు, రేషన్‌ కార్డులు, పట్టాల మంజూరు ఉంటుంది. నవంబరులో విద్యా దీవెనకు సంబంధించి పరిశీలనప్రక్రియ పూర్తిచేయాలి.

* ఈనెల 29, 30 తేదీల్లో సిటిజన్‌ అవుట్‌రీచ్‌ కార్యక్రమం చేపట్టండి. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు బృందాలుగా ఏర్పడి ప్రతి కుటుంబాన్ని కలవాలి.

* నెలలో నాలుగు బుధవారాలు వరుసగా.. గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో, మండల/యూఎల్‌బీ స్థాయిలో, కలెక్టర్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో, విభాగ కార్యదర్శి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో సమావేశం కావాలి. అప్పుడే ప్రతి సచివాలయ వాస్తవ పరిస్థితి ఏమిటో తెలుస్తుంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని