ఈ గ్యారంటీలపై కేంద్రం విచారణ చేపట్టాలి

ప్రధానాంశాలు

ఈ గ్యారంటీలపై కేంద్రం విచారణ చేపట్టాలి

 మంత్రి బుగ్గన చెప్పింది సరికాదు: ఐవైఆర్‌ కృష్ణారావు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకులు భవిష్యత్తు ఆదాయాలను తాకట్టు పెట్టుకుని రూ.20 వేల కోట్లు ఎలా రుణంగా ఇస్తాయని, ఈ విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వుబ్యాంకు కలుగజేసుకుని విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్‌.కృష్ణారావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్‌లో తన అభిప్రాయాన్ని పోస్టు చేశారు. రాష్ట్రం ఎప్పుడైతే బకాయిలు చెల్లించలేదో అప్పుడు ప్రభుత్వ గ్యారంటీలు పరిగణనలోకి వస్తాయని, అంతవరకు గ్యారంటీ ఇచ్చినట్లు కాదని రాష్ట్ర ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్‌ రెడ్డి చెప్పడం సరికాదని ఐవైఆర్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం గ్యారంటీ సమర్పించిన రోజు నుంచే అది పరిగణనలోకి వస్తుందని  స్పష్టం చేశారు. ‘‘అసలు ప్రభుత్వం భవిష్యత్తు ఆదాయాన్ని ఈ రోజు ఎలా తాకట్టు పెట్టగలదు? ఏ ఏడాదికి ఆ ఏడాది శాసనసభ ఇందుకు అనుమతించాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వ రంగ బ్యాంకులు బాధ్యతారహితంగా ప్రైవేటు కంపెనీలకు అప్పులు పెట్టి నిరర్థక ఆస్తులను సృష్టించాయి. ఇప్పుడు వాటి దృష్టి ప్రభుత్వం వైపు మళ్లినట్లుంది. మరికొన్ని బాధ్యతలేని రాష్ట్రాలు ఈ విధానాన్ని అనుసరించవచ్చు. దీన్ని సరిదిద్దేందుకు ప్రధాని తక్షణమే చర్యలు తీసుకోవాలి’’ అని ఐవైఆర్‌ అభిప్రాయపడ్డారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని