
ఈనాడు ప్రత్యేకం
ఆడ శిశువులను స్వాగతిస్తున్న కుటుంబాలు
దేశంలో గణనీయంగా పెరిగిన స్త్రీ, పురుష నిష్పత్తి
ఆసుపత్రుల కాన్పుల్లోనూ వృద్ధి
చిన్నారులు, మహిళలను వెంటాడుతున్న రక్తహీనత
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 రెండో దశ నివేదిక వెల్లడి
ఈనాడు, దిల్లీ: ‘మాకు మగ పిల్లలే కావాలి’ అనే దంపతుల వైఖరిలో క్రమంగా మార్పు కనిపిస్తోంది. ఆడ పిల్లలు పుట్టినా అపురూపమే కంటికి రెప్పలా కాపాడుకుంటామనే ధోరణి పెరుగుతోంది. తల్లిదండ్రుల్లో వస్తున్న ఈ పరిణతికి అద్దంపడుతోంది కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన 2019-21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 2వ దశ నివేదిక. దీని ప్రకారం దేశంలో స్త్రీ,పురుషుల నిష్పత్తి గణనీయమైన స్థాయిలో మెరుగుపడింది. ప్రతి వెయ్యి మంది పురుషులకు, మహిళల నిష్పత్తి 1,020కి చేరింది. తల్లి గర్భంలోనే ఆడ శిశువుల ప్రాణాలను చిదిమేసే దారుణాలు తగ్గిపోతున్నాయి. అయితే, చిన్నారులు, మహిళలను రక్తహీనత సమస్య వేధిస్తూనే ఉంది. ఈ బాధితుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. బాల్య వివాహాలు తగ్గాయి. కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించే వారి సంఖ్య పెరిగింది. కేంద్ర ప్రభుత్వం గత డిసెంబరులో తెలుగు రాష్ట్రాలతో సహా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డేటా విడుదల చేయగా, బుధవారం ఇదివరకు మిగిలిపోయిన 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డేటాను కలిపి పూర్తిస్థాయి నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 707 జిల్లాల్లో 6.1 లక్షల మంది నుంచి సేకరించిన వివరాలతో రూపొందిన ఈ నివేదికను నీతి ఆయోగ్ సభ్యుడు వీకేపాల్, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్‌లు విడుదల చేశారు. తాజాగా జత చేసిన 14 రాష్ట్రాల సమాచారంతో కలిపి ఇప్పుడు జాతీయ పరిస్థితులను ఎన్ఎఫ్హెచ్ఎస్-4తో పోల్చారు.
* జాతీయ కుటుంబ సర్వే-4 ప్రకారం ప్రతి వెయ్యిమంది పురుషులకు మహిళలు (లింగ నిష్పత్తి) 991 ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 29మేర పెరిగింది. ప్రస్తుతం ఇది పట్టణ ప్రాంతాల్లో 985కే పరిమితం కాగా, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 1,037కి చేరింది.
* తాజా సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో జరిగే కాన్పులు 78.9% నుంచి 88.6%కి చేరాయి. సిజేరియన్ కాన్పులు 17.2% నుంచి 21.5%కి చేరాయి. ఈ సమస్య గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే (17.6%), పట్టణ ప్రాంతాల్లో (32.3%) అత్యధికంగా ఉంది. సిజేరియన్ కాన్పుల్లో 47.4% ప్రైవేటు, 14.3% ప్రభుత్వ ఆసుపత్రుల్లో చోటుచేసుకున్నాయి. పుదుచ్చేరిలో 100%, తమిళనాడులో 90%కిపైగా ఆసుపత్రుల్లో కాన్పులు జరుగుతున్నాయి.
* గత సర్వేతో పోలిస్తే ఇప్పటికి మహిళల సంతాన సాఫల్య నిష్పత్తి 2.2 నుంచి 2కి తగ్గింది.
* కుటుంబ నియంత్రణ 54% నుంచి 67%కి చేరింది.
* నిరోధ్ వాడకం ద్వారా ఎయిడ్స్‌ని నియంత్రించవచ్చనే అవగాహన 68.4% మహిళల్లో, పురుషుల్లో 82%మేర ఉంది.
* గర్భస్థ దశలో వైద్య ఆరోగ్య తనిఖీలు చేయించుకొనే మహిళల సంఖ్య 58.6% నుంచి 70%కి చేరింది.
* బాల్య (మహిళలకు 18 ఏళ్లలోపు) వివాహాలు 2015-16లో 26.8శాతంగా ఉండగా 2019-21కి 23.3 శాతానికి తగ్గుముఖం పట్టాయి.
* 12-23 వయసులోపు వారికి రోగనిరోధక టీకా అందించే కార్యక్రమం 62% నుంచి 76%కి చేరింది.
* చిన్నారుల్లో పౌష్టికాహార లోప సమస్య కొంతమేర తగ్గింది. వయసుకు తగిన ఎత్తు పెరగకపోవడమనే సమస్య 38% నుంచి 36%కి, వయసుకు తగిన బరువు లేకపోవడమనే సమస్య 36% నుంచి 32%కి తగ్గిపోయింది.
* చిన్నారుల్లో రక్తహీనత సమస్య మాత్రం ఆందోళనకరంగానే ఉంది. 6-59 నెలల మధ్య వయసున్న చిన్నారుల్లో ఈ సమస్య 58.6% నుంచి 67.1%కి, 15-49ఏళ్ల వయసున్న సాధారణ మహిళల్లో 53.2% నుంచి 57.2%కి, గర్భిణీల్లో 50.4% నుంచి 52.2%కి పెరిగింది. మొత్తంగా చూస్తే 15-49 ఏళ్ల వయసున్న మహిళల్లో 59.1%మంది, పురుషుల్లో 31.1% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. గతంలో ఇది 54.1%, 29.2%కే పరిమితమైంది.
* 6 నెలల్లోపు పిల్లలకు స్తన్యం ఇచ్చే తల్లుల సంఖ్య 55% నుంచి 64%కి పెరిగింది.
* కుటుంబ నిర్ణయాల్లో మహిళల భాగస్వామ్యం 84% నుంచి 88.7%కి చేరింది. పట్టణ మహిళల భాగస్వామ్యం 91%, గ్రామాల్లో 87.7%మేర ఉంది.
* సొంత భూమి, ఇళ్లు ఉన్న మహిళల సంఖ్య 38.4% నుంచి 43.%కి చేరింది. ఈ విషయంలో పట్టణ ప్రాంత (38.3%) మహిళల కంటే గ్రామీణ మహిళలే (45.7%) మెరుగైన స్థితిలో ఉన్నారు.
* బ్యాంకు ఖాతాలు నిర్వహించే మహిళల సంఖ్య ఈ రెండు సర్వేల మధ్యకాలంలో 53% నుంచి 79%కి చేరింది.
* మొబైల్ ఫోన్లున్న మహిళల సంఖ్య 45.9% నుంచి 54%కి చేరింది.
* రుతు క్రమం సమయంలో ఆరోగ్యకరమైన పద్ధతులు పాటించే వారి సంఖ్య 57.6% నుంచి 77.3%కి చేరింది.
* 18-49 ఏళ్ల వివాహిత మహిళల్లో భర్తల నుంచి ఏదో ఒకసారి హింసను ఎదుర్కొన్న వారి సంఖ్య 31.2% నుంచి 29.3%కి తగ్గింది.
* 18-29 ఏళ్లలోపు వయసున్న మహిళలపై లైంగికదాడులు చోటుచేసుకున్న ఘటనలు ఇదివరకు లాగానే 1.5%కి పరిమితయ్యాయి. ఈ సమస్య గ్రామీణ ప్రాంతాల్లో (1.6%) అధికంగా ఉంది.
* 15 ఏళ్ల పైబడిన మహిళల్లో 8.9% మంది, పురుషుల్లో 38% మందికి పొగాకు అలవాటుంది. మద్యం అలవాటు మహిళల్లో 1.3%, పురుషుల్లో 18.8%కి ఉంది.
* 1.9% మంది మహిళలు మాత్రమే సర్వైకల్ కేన్సర్ స్క్రీనింగ్ చేయించుకున్నారు. రొమ్ము కేన్సర్ స్క్రీనింగ్ 0.9%, ఓరల్ కేన్సర్ స్క్రీనింగ్ 0.9% మాత్రమే చేయించుకున్నారు.
సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో పురోగతి
దేశంలో సామాజిక ఆర్థిక పరిస్థితులు కొంతమేర మెరుగుపడ్డాయి. విద్యుత్తు, తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యం మెరుగుపడింది.
వివరం
2019-21 2015-16(శాతాల్లో)
ప్రభుత్వ సంస్థల వద్ద 5 ఏళ్లలోపు పిల్లల జననాల నమోదు 89.1 79.7
విద్యుత్తు సౌకర్యం ఉన్న కుటుంబాలు 96.8 88.0
మెరుగైన తాగునీటి సౌకర్యం ఉన్న కుటుంబాలు 95.9 94.4
మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యం ఉన్న కుటుంబాలు 70.2 48.5
మెరుగైన వంట ఇంధనం ఉన్న కుటుంబాలు 58.6 43.8
ఆరోగ్యబీమా ఉన్న కుటుంబాలు 41.0 28.7
15-19 ఏళ్ల మధ్యలో గర్భం దాల్చినవారు 6.8 7.9