
జాతీయ- అంతర్జాతీయ
పెద్దఎత్తున క్యూ కట్టిన ప్రయాణికులు
తక్షణం రద్దీ నియంత్రణకు కేంద్రం ఆదేశం
దిల్లీ: కొవిడ్-19 పరీక్షల నిర్వహణకు అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో గత రెండు రోజుల నుంచి దిల్లీ విమానాశ్రయం కిటకిటలాడుతోంది. ఇందుకు సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. పరీక్షల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పన్నులు చెల్లించాం. విమానాశ్రయ రుసుము కట్టాం. అయినా గంట విమాన ప్రయాణానికి క్యూలోనే మూడు గంటలు నిలబడాల్సిన పరిస్థితి’’ అని ట్విటర్లో ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఒమిక్రాన్‌ను కట్టడి చేసేందుకు విదేశాల నుంచి ముఖ్యంగా ఆ వేరియంట్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కేంద్రం కరోనా పరీక్షలు తప్పనిసరి చేసింది. దీంతో 6 నుంచి 8 గంటల్లో ఫలితం వచ్చే ఆరీ-్టపీసీఆర్ పరీక్షకు రూ.500, తక్కువ సమయంలో ఫలితాన్ని నిర్ధారించే ర్యాపిడ్ పరీక్షకు రూ.3,500గా ధరలను విమానాశ్రయ అధికారులు నిర్ణయించారు. దీంతో చాలా మంది ప్రయాణికులు ర్యాపిడ్ పరీక్షలకే మొగ్గుచూపారు. అయితే అందుకు తగినంత సిబ్బందిని నియమించకపోవడంతో తీవ్ర రద్దీ ఏర్పడింది. దీంతో సోమవారం కేంద్ర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఉన్నతస్థాయి అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్ ప్రతినిధులు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు, కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్న సంస్థ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. తక్షణమే రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.