స్థానిక సంస్థలకు రూ.379 కోట్లు

త్వరలో పంచాయతీల ఖాతాలకు జమ
ప్రత్యేక ఖాతాలు తెరిచాక రావడం ఇదే తొలిసారి
ఇకపై సర్పంచులు నేరుగా పనులు చేయించుకోవచ్చు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.379 కోట్లు వచ్చాయి. ఇందులో నుంచి జిల్లా, మండల పరిషత్‌లకు చెరో 15% చొప్పున, మిగిలిన 70% నిధులను జనాభా ఆధారంగా గ్రామ పంచాయతీలకు కేటాయించారు. కేంద్రం నుంచి 2021-22 సంవత్సరానికి రెండో విడతలో వచ్చిన ఈ నిధులు వారం, పది రోజుల్లో పంచాయతీల బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయని అధికారులు తెలిపారు. ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి పంచాయతీల పేరిట ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిచాక నిధులు జమ కావడం ఇదే మొదటిసారి అవుతుంది. గతంలో 14, 15 ఆర్థిక సంఘాల నిధుల్లో నుంచి రెండు విడతల్లో దాదాపు రూ.1,245 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు బకాయిల కింద డిస్కంలకు సర్దుబాటు చేసిన విషయం తెలిసిందే. సర్పంచులకు తెలియకుండానే పంచాయతీల నిధులను మళ్లించడంతో పెద్దఎత్తున ఆందోళన వ్యక్తమైంది. దీనిపై కేంద్ర ప్రభుత్వమూ ఆరా తీసింది. తర్వాత కేంద్రం ఆదేశాలతో ఆర్థిక సంఘం నిధుల కోసం గ్రామ పంచాయతీల పేరిట అధికారులు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలను తెరిచారు. వాటిని పబ్లిక్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (పీఎఫ్‌ఎంఎస్‌)కి ఇటీవలే అనుసంధానించారు. ఇకపై ఆర్థిక సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఖాతాలోని నిధులను గ్రామాల్లోని వివిధ అవసరాల కోసం సర్పంచులు ఖర్చు చేయొచ్చు. పూర్తయిన పనులకు సర్పంచులే నేరుగా బిల్లులు చెల్లించవచ్చు. ఇంతకుముందు పంచాయతీ ఖాతాలు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్‌)కి అనుసంధానించి ఉండేవి. దాంతో గ్రామాల్లో ఆర్థిక సంఘం నిధులతో పూర్తి చేసిన పనులకు బిల్లులు ఇవ్వడానికి ఎదురు చూడాల్సి వచ్చేది. ఇకపై ఆ సమస్య ఉండబోదు.


మరిన్ని

ap-districts
ts-districts