ఉగ్ర కుట్ర భగ్నం

హైదరాబాద్‌లో ముగ్గురి అరెస్టు.. పాకిస్థాన్‌ గ్రనేడ్‌ల స్వాధీనం

పండగ వేళ వరుస పేలుళ్లకు వ్యూహరచన

నిందితులకు ఐఎస్‌ఐ, లష్కరే తోయిబాలతో లింకు

పోలీసుల అప్రమత్తతతో  తప్పిన పెనుముప్పు

ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలో ఉగ్రకుట్ర బయటపడింది. వరుస పేలుళ్లతో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు పన్నిన పన్నాగం పోలీసుల అప్రమత్తతతో భగ్నమైంది. మహానగరానికి పెనుముప్పు తప్పింది. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ, లష్కరే తోయిబాల ఆదేశాలతో వరుస దాడులతో బీభత్సం సృష్టించేందుకు మూసారంబాగ్‌కు చెందిన అబ్దుల్‌ జాహెద్‌ అలియాస్‌ మోటు (39) ప్రయత్నిస్తున్నాడనే సమాచారంతో నగర సిట్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదివారం ఉదయమే మూసారంబాగ్‌, చంపాపేట, మలక్‌పేట ప్రాంతాల్లోని పలు నివాసాల్లో సోదాలు నిర్వహించారు. అబ్దుల్‌ జాహెద్‌, అక్బర్‌బాగ్‌కు చెందిన మహ్మద్‌ సమీయుద్దీన్‌ అలియాస్‌ అబ్దుల్‌ సమి (39), మాజ్‌ హసన్‌ ఫరూక్‌ అలియాస్‌ మాజ్‌(29)లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించటంతో ఉగ్రకోణం వెలుగు చూసింది. దీంతో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. జాహెద్‌ నుంచి 2 హ్యాండ్‌ గ్రనేడ్‌లు, రూ.3,91,800 నగదు, 2 సెల్‌ఫోన్లు, సమీయుద్దీన్‌ నుంచి ఒక హ్యాండ్‌ గ్రనేడ్‌, రూ.1.50 లక్షల నగదు, సెల్‌ఫోన్‌, ద్విచక్రవాహనం, మాజ్‌ హసన్‌ నుంచి ఒక గ్రనేడ్‌, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్రనేడ్‌లు పాకిస్థాన్‌ నుంచి సరఫరా అయినట్లు గుర్తించారు.

ఆనాటి ఆత్మాహుతిదాడిలో ప్రమేయం
హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా ఉగ్రదాడుల్లో జాహెద్‌ నిందితుడు. 2005లో బేగంపేటలోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంపై జరిగిన ఆత్మాహుతిదాడిలో ప్రమేయం ఉందన్న అభియోగం ఎదుర్కొన్నాడు. విచారణ ఖైదీగా 12 ఏళ్లు జైలులో ఉన్నాడు. పోలీసులు సరైన ఆధారాలు చూపలేకపోవడంతో 2017లో ఈ కేసును కోర్టు కొట్టివేసింది. 2002లో దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయం వద్ద, ముంబయిలోని ఘట్‌కోపర్‌లలో దాడుల్లోనూ జాహెద్‌ బృందం పాత్ర ఉంది. 2004లో సికింద్రాబాద్‌ గణేశ్‌ దేవాలయంలో పేలుళ్లకు కూడా కుట్రపన్నినట్టు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. బేగంపేట దాడిలో కీలకంగా వ్యవహరించిన హైదరాబాద్‌కు చెందిన ఫర్హతుల్లా ఘోరి అలియాస్‌ ఎఫ్‌జీ, సిద్దిఖీ బిన్‌ ఉస్మాన్‌ అలియాస్‌ రఫీక్‌ అలియాస్‌ అబు హమ్జాలా, అబ్దుల్‌ మజీద్‌ అలియాస్‌ చోటు పాకిస్థాన్‌కు పారిపోయారు. ఆ ముగ్గురితో జాహెద్‌ ఇప్పటికీ సంబంధాలు కొనసాగిస్తున్నాడు. యువతను ఉగ్రవాదులుగా మార్చుతున్నాడు. అందుకు ఆర్థిక సహాయం పాకిస్థాన్‌ నుంచి అందినట్టు అతడు పోలీసుల విచారణలో వెల్లడించాడు. సిట్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ నరేందర్‌రావు ఫిర్యాదు మేరకు సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఊరేగింపులు.. రద్దీ ప్రాంతాలే లక్ష్యం
ప్రధాన నిందితుడు అబ్దుల్‌ జాహెద్‌కు పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ, లష్కరే తోయిబాలతో సంబంధాలున్నాయి. నగరంలో బాంబుపేలుళ్లతో అలజడి సృష్టించాలని ఐఎస్‌ఐ ఆదేశించడంతో నిందితులు ముగ్గురూ ఆ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్‌, భాజపా సమావేశాలు, ఊరేగింపులు, దసరా పండగ, భక్తులు గుమిగూడే ప్రాంతాలు గుర్తించి రెక్కీ చేసినట్టు తెలుస్తోంది. పథకం అమలుకు యువకులను సమకూర్చుకునే పనిలో జాహెద్‌ నిమగ్నమయ్యాడు. పాత నేరస్థులు, సామాజిక మాధ్యమాలు, నిద్రాణబృందాల (స్లీపర్‌సెల్స్‌)పై నిఘా ఉంచిన పోలీసులు ఉగ్రవాదుల కుట్రను పసిగట్టారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని