మరణ వాంగ్మూలం విశ్వసనీయమో.. కాదో పరిశీలించాలి

దాని ఆధారంగా దోష నిర్ధారణ చేయొచ్చు: సుప్రీం కోర్టు

దిల్లీ: మరణ వాంగ్మూలాన్ని దోష నిర్ధారణకు ఏకైక ప్రాతిపదికగా తీసుకోవచ్చునని సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే ఆ వాంగ్మూలం వాస్తవమేనా, విశ్వసనీయమేనా అనే సంగతిని కోర్టు నిశితంగా పరిశీలించాలని స్పష్టం చేసింది. వరకట్న వేధింపులతో భార్య మృతికి కారణమయ్యారన్న అభియోగాల నుంచి ఓ వ్యక్తికి విముక్తి కల్పిస్తూ.. జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘మరణ వాంగ్మూలం వాస్తవమేనా, విశ్వసనీయమేనా అనేది కోర్టు పరిశీలించాలి. చనిపోయే ముందు వాంగ్మూలం ఇచ్చే వ్యక్తి శారీరక, మానసిక ఆరోగ్యం బాగున్నప్పుడే దాన్ని నమోదుచేశారో లేదో చూడాలి. ఇతరుల ఒత్తిడి వల్ల ఏమైనా అలా వాంగ్మూలం ఇచ్చారా అనే విషయాన్ని గమనించాలి. మరణ వాంగ్మూలం విశ్వసనీయమైనదై ఉంటే.. మరే సాక్ష్యాధారమూ అక్కర్లేదు. దాన్ని ఏకైక ప్రాతిపదికగా తీసుకొని దోష నిర్ధారణ చేయొచ్చు. ఒకవేళ ఏదైనా కేసులో మరణ వాంగ్మూలాలు ఒకటి కంటే ఎక్కువగా ఉండి, వాటి మధ్య వైరుద్ధ్యాలు ఉంటే.. మేజిస్ట్రేట్‌ వంటి ఉన్నతాధికారి నమోదు చేసిన వాంగ్మూలంపై ఆధారపడొచ్చు’’ అని ధర్మాసనం పేర్కొంది. తాజా కేసులో- తాను పొరపాటున విషం తాగానని భార్య తొలి వాంగ్మూలంలో పేర్కొందని.. భర్త, అత్తమామలే విషమిచ్చారని రెండో వాంగ్మూలంలో తెలిపిందని సుప్రీం కోర్టు గుర్తుచేసింది. బంధువుల ఒత్తిడి వల్లే ద్వితీయ వాంగ్మూలంలో ఆమె మాట మార్చి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని