అస్సాంలో అటవీ శాఖ కార్యాలయానికి నిప్పు

మేఘాలయ నుంచి కత్తులు, రాడ్లతో వచ్చి విధ్వంసం

గువాహటి, షిల్లాంగ్‌: అస్సాం-మేఘాలయ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. మేఘాలయ వైపు నుంచి గుంపుగా వచ్చిన కొందరు.. అస్సాంలోని పశ్చిమ కార్బీ ఆంగ్లోంగ్‌ జిల్లా ఖెరోనీ రేంజ్‌లో అటవీ శాఖ బీట్‌ కార్యాలయం వద్ద మంగళవారం రాత్రి విధ్వంసం సృష్టించారు. లోపలికి ప్రవేశించి ఫర్నీచర్‌, దస్తావేజులను ధ్వంసం చేశారు. కార్యాలయానికి నిప్పుపెట్టారు. బయట నిలిపి ఉంచిన ద్విచక్రవాహనాలనూ తగలబెట్టారు. అక్కడికి వచ్చిన ఆందోళనకారుల చేతుల్లో రాడ్లు, పెద్ద కత్తులు, కర్రలు ఉన్నాయని ఓ అధికారి తెలిపారు. అయితే వారి దాడిలో ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేశారు. పోలీసులు, ఇతర భద్రతా దళాలు అక్కడికి చేరుకునేలోపే వారంతా వెళ్లిపోయారని చెప్పారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఖాసీ విద్యార్థి సంఘం (కేఎస్‌యూ) ప్రకటించింది. అస్సాంలోని ముక్రోహ్‌ గ్రామం వద్ద ఓ ప్రభుత్వ వాహనానికి ఆందోళనకారులు నిప్పంటించారు. మరోవైపు మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోనూ ఓ వాహనాన్ని తగలబెట్టారు. అస్సాం-మేఘాలయ సరిహద్దుల్లో మంగళవారం చెలరేగిన హింసలో ఐదుగురు మేఘాలయవాసులు, అస్సాం అటవీ శాఖకు చెందిన ఓ గార్డు మృత్యువాతపడటం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని కోరేందుకు మేఘాలయ మంత్రుల బృందం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో గురువారం సమావేశం కానుంది. మంగళవారం నాటి హింస నేపథ్యంలో రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో బుధవారం గంభీర వాతావరణం కనిపించింది.

సరిహద్దు వివాదంతో సంబంధం లేదు: హిమంత

మేఘాలయతో తమ రాష్ట్ర సరిహద్దుల్లో ప్రస్తుతం ప్రశాంత పరిస్థితులే నెలకొన్నాయని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు. దిల్లీలో ఆయన బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ.. మంగళవారం చెలరేగిన హింసకు సరిహద్దు వివాదంతో ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు. మేఘాలయ సీఎంతో తాను సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. సరిహద్దుల్లో తాజా హింసపై దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించాలని తమ కేబినెట్‌ నిర్ణయించినట్లు హిమంత తెలిపారు. పౌరులతో ఘర్షణాత్మక వాతావరణం తలెత్తినప్పుడు నిగ్రహం పాటించాల్సిందిగా పోలీసులు, అటవీ సిబ్బందికి ఆయన సూచించారు. మరోవైపు- ఈశాన్య భారత్‌లో పరిస్థితులను చక్కదిద్దడంలో భాజపా నేతృత్వంలోని ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌ఈడీఏ) విఫలమైందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.


మరిన్ని