Karnataka: మంత్రి ఆడియో లీక్‌ కలకలం.. సీఎం బొమ్మైకి కొత్త తలనొప్పి!

బెంగళూరు: కర్ణాటక(Karnataka)లో నాయకత్వ మార్పు జరిగే అవకాశం ఉందంటూ గత కొంతకాలంగా పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తోన్న వేళ సీఎం బసవరాజ్‌ బొమ్మై (Basavaraj Bommai)కి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. తాజాగా న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి చేసిన వ్యాఖ్యల ఆడియో క్లిప్‌ వైరల్‌గా మారడం ముఖ్యమంత్రికి తలనొప్పి వ్యవహారంగా మారింది. ‘‘మేం ప్రభుత్వాన్ని నడపడం లేదు.. అలా మేనేజ్‌ చేస్తున్నామంతే..’’ అని మంత్రి అన్నట్టుగా ఆడియో క్లిప్‌లో ఉంది.  ఈ వ్యాఖ్యల పట్ల కొందరు మంత్రుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మంత్రి మధుస్వామి చేసిన వ్యాఖ్యలు తన ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామంగా మారడంతో సీఎం బసవరాజ్‌ బొమ్మై దిద్దుబాటు చర్యలకు ప్రయత్నిస్తున్నారు. మంత్రి వేరే సందర్భంలో అలా మాట్లాడారని.. మధుస్వామి మాటలతో కలత చెంది బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తపరిచిన మిగతా మంత్రులతో తాను మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానన్నారు. మధుస్వామితో తాను మాట్లాడతాననీ.. ఆయన మాట్లాడిన సందర్భమే వేరు గనక వాటిని తప్పుడు అర్థంలో తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం అంతా బాగానే ఉందని.. ఎలాంటి ఇబ్బందుల్లేవని విలేకర్లతో బొమ్మై వ్యాఖ్యానించారు. 

కర్ణాటకలో ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు.. బసవరాజ్‌ బొమ్మై రాష్ట్రంపై పట్టు కోల్పోయారన్న విమర్శలకు తావిచ్చాయి. దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన భాజపా యువనేత దారుణ హత్యతో సీఎం ఇరకాటంలో పడ్డారు. హత్య, తదనంతర పరిణామాల నేపథ్యంలో భాజపా అధిష్ఠానం ఆయన పట్ల గుర్రుగా ఉన్నట్టుగా వార్తలు కూడా వచ్చాయి. పార్టీ నేతలనే కాపాడుకోలేకపోతున్నారని.. దీనికి తోడు మరికొన్ని విషయాల్లోనూ ఆయన పట్ల భాజపా అధిష్ఠానం అసంతృప్తిగా ఉన్నట్టు సొంత పార్టీ వర్గాలే పేర్కొనడంతో సీఎం మార్పుపై గుసగుసలు వినబడిన సంగతి తెలిసిందే. అయితే, కొద్దిరోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆకస్మిక కర్ణాటక పర్యటనతో ఈ ఊహాగానాలు మరింతగా ఎక్కువయ్యాయి. అయితే, దీనిపై  మాజీ సీఎం యడియూరప్ప స్పందిస్తూ సీఎం బొమ్మై పదవికి వచ్చిన ప్రమాదమేమీ లేదని క్లారిటీ ఇచ్చిన కొద్ది రోజులకే మంత్రి మధుస్వామి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడం గమనార్హం.

రాజీనామా చేయాల్సిందే..

న్యాయశాఖ మంత్రి చేసిన వ్యాఖ్యల పట్ల సొంత పార్టీ మంత్రుల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన రాజీనామా చేయాలని కొందరు మంత్రులు పట్టుబడుతున్నారు. న్యాయశాఖ మంత్రి ఆడియో క్లిప్‌ లీక్‌ వ్యవహారంపై మంత్రి ఎస్‌టీ సోమశేఖర్‌, ఉద్యానశాఖ మంత్రి ముణిరత్న తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వాన్ని మేనేజ్‌ చేస్తున్నామని మంత్రి మధుస్వామి భావిస్తే తక్షణమే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వంలో ఆయన కూడా భాగమేనని.. ప్రతి కేబినెట్‌ సమావేశంలో తీసుకొనే నిర్ణయాల్లోనూ ఆయనకు భాగస్వామ్యం ఉంటుందన్నారు. మంత్రి స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమంటూ మండిపడ్డారు.

ఆడియో క్లిప్‌లో మంత్రి ఏమన్నారు?

చెన్నపట్నానికి చెందిన భాస్కర్‌ అనే సామాజిక కార్యకర్తతో మంత్రి శనివారం ఫోన్‌లో సంభాషించారు. పలు రైతు సమస్యలకు సంబంధించి సహకార బ్యాంకుపై ఆయన చేసిన ఫిర్యాదులకు ప్రతిస్పందనగా మంత్రి మాట్లాడుతూ..  ‘‘మేం ఇక్కడ ప్రభుత్వాన్ని నడపడం లేదు.. మేనేజింగ్‌ చేస్తున్నామంతే. వచ్చే ఏడెనిమిది నెలల వరకు నెట్టుకుపోవాలి’’ అన్నట్టుగా ఆడియో రికార్డింగ్‌లో ఉంది.  అలాగే, రైతు సమస్యల పట్ల సహకార శాఖ మంత్రి ఎస్‌.టి.సోమశేఖర్‌ చర్యలు తీసుకోకపోవడంపై నిస్సహాయతను వ్యక్తంచేయడం కూడా ఈ ఆడియోలో వినబడింది. ‘‘నాకు ఈ సమస్యలన్నీ తెలుసు. మంత్రి సోమశేఖర్‌ దృష్టికి వీటిని తీసుకెళ్లాను. అయినా.. ఆయన చర్యలు తీసుకోవడంలేదు. ఏం చేయాలి’’ అని మధుస్వామి అన్నట్టుగా ఆడియో క్లిప్‌లో రికార్డయింది.


మరిన్ని

ap-districts
ts-districts