Harish Rao: దేశవ్యాప్తంగా 157 మంజూరు చేసినా తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదు: మంత్రి హరీశ్‌

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది మెడికల్‌ కాలేజీల్లో అడ్మిషన్‌లు ప్రారంభించనున్నట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. దీని ద్వారా తెలంగాణలో 1200 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా అందుబాటులోకి రానున్ననట్లు వెల్లడించారు. బి కేటగిరి సీట్లలో 85% స్థానికులకు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 

‘‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే మెడికల్‌ కాలేజీలు వస్తాయని ఉద్యమ సమయంలో మాట్లాడుకున్న కల ఇప్పుడు నిజమవుతోంది. సమైక్య రాష్ట్రంలో వరంగల్, నిజామాబాద్,ఆదిలాబాద్‌లలో మూడు మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. భవిష్యత్తులో ప్రతి జిల్లాలోనూ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తాం.

ఈ ఒక్క ఏడాదే 8 కాలేజీలు కొత్తగా ఏర్పాటు చేశాం.  తెలంగాణ ఏర్పడేనాటికి 850 మెడికల్‌ సీట్లు మాత్రమే ఉండేవి. గత ఎనిమిదేళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 2052 సీట్లు పెరిగాయి. మన విద్యార్థులు రష్యా, ఉక్రెయిన్‌, చైనాకు ఎందుకు వెళ్లాల్సి వస్తోంది? సీట్లు పెరిగితే మన విద్యార్థులు విదేశాలకు వెళ్లే అవసరముండదు. రాష్ట్రానికి కేంద్రం వైద్య కళాశాలలు మంజూరు చేయట్లేదు. దేశవ్యాప్తంగా 157 మంజూరు చేసినా తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదు’’ అని హరీశ్‌ ఆరోపించారు.


మరిన్ని