తిరంగను గౌరవంగా పరిహరించండి

పునర్వినియోగించలేని జెండాలను నిబంధనల ప్రకారం దహనం, ఖననం చేయడం తప్పనిసరి

మువ్వన్నెల జెండా దేశ గౌరవానికి ప్రతీక. ఎందరో అమరువీరుల త్యాగాలతో మనం అనుభవిస్తున్న స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు సూచిక. అందుకే త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించేటప్పుడు, అవనతం చేసేటప్పుడే కాదు.. పునర్వినియోగించలేని పక్షంలో దాన్ని పరిహరించేటప్పుడు కూడా నియమ నిబంధనలను పాటించాలి. జెండా గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించాలి. ప్రధాని మోదీ ఇచ్చిన ‘హర్‌ ఘర్‌ తిరంగా’ పిలుపునకు స్పందించి దేశవ్యాప్తంగా ప్రజలు జాతీయ జెండాలను ఇళ్లపై ఏర్పాటు చేశారు. గతంతో పోలిస్తే ఈసారి విస్తృత స్థాయిలో త్రివర్ణ పతాకాలు కనిపిస్తున్నాయి. వాటిలో మరోసారి వినియోగించలేని కాగితం, ప్లాస్టిక్‌ జెండాలు ఉన్నాయి. అలాంటి వాటితోపాటు పునర్వినియోగించలేని స్థితిలో ఉన్న పాత, చిరిగిపోయిన పతాకాలను జెండా పండుగ ముగిశాక ఎలా పరిహరించాలనే విషయంపై అవగాహన అవసరం. అలాంటివాటిని దహనం లేదా ఖననం చేయాలని చట్టంలోని జాతీయ జెండా నియమ నిబంధనలు పేర్కొంటున్నాయి.

దహనం చేసే విధానం

దహనం చేయడానికి శుభ్రమైన, గౌరవప్రదమైన స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి. పరిహరించాల్సిన జెండాను నిబంధనల మేరకు మడవాలి. నేలపై పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. మంటను మండించాక జెండాను మంటల మధ్యలో జాగ్రత్తగా ఉంచాలి. జెండాను మడవకుండా కాల్చడం, మంటల్లోకి విసిరివేయడం, పతాకాన్ని చేతిలో పట్టుకొని దానికి నిప్పు పెట్టడం చేయకూడదు. జెండా దహనమయ్యేటప్పుడు సావధానంగా నిలబడి మౌనం పాటించాలి. పూర్తిగా దహనం అయ్యేలా చూడాలి. ఆ తర్వాత మంటలను ఆర్పివేయాలి. సాధ్యమైనంతవరకూ ఇతరులెవరికీ కనిపించకుండా జెండాను దహనం చేయాలి.

ఖననం ఎలా చేయాలంటే..

పరిహరించాల్సిన జెండాను నిబంధనల మేరకు మడవడంతోపాటు ఎక్కడా నేలపై పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. దాన్ని సులువుగా మట్టిలో కలిసిపోయే పెట్టెలో ఉంచాలి. సావధానంగా నిలబడి కాసేపు మౌనం పాటించాలి. ఆ తర్వాత కత్తెరతో జెండాను క్రమపద్ధతిలో కత్తిరించాలి. అనంతరం పెట్టెను గౌరవప్రదంగా నేలలో పాతిపెట్టాలి. ఖననం చేసే సమయంలోనూ ఇతరులెవరికీ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

- ఈనాడు ప్రత్యేక విభాగం


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని