సూక్ష్మపోషకాలకూ మోక్షం లేదాయె..

 జింకు సల్ఫేట్‌పై రాయితీ నిలిపివేసిన వ్యవసాయశాఖ

  రైతులే సొంతంగా కొనుక్కోవాలని సూచన

ఈనాడు, హైదరాబాద్‌: విచ్చలవిడిగా రసాయన ఎరువుల వాడకాన్ని నియంత్రించాలని, భూమిలో ఏయే పోషకాలు ఎంత లోపించాయో గుర్తించి వాటినే వాడాలనే సూచనలు క్షేత్రస్థాయిలో అమలు కావడంలేదు. ప్రస్తుత వానాకాలం(ఖరీఫ్‌) పంటల సాగు సీజన్‌ గతనెలతో ముగిసినా జింకు సల్ఫేట్‌పై రాష్ట్ర వ్యవసాయశాఖ రాయితీ నిధులు విడుదల చేయలేదు. దీంతో ఈ ఎరువును రైతులకు పంపిణీ చేయలేదు. కొత్త యాసంగి(రబీ) సీజన్‌లో జింకును అధికంగా వినియోగిస్తారు. పంటల సాగుకు సాధారణ పోషకాల కింద నత్రజని(యూరియా), భాస్వరం(ఫాస్ఫేట్‌), పొటాష్‌లను ప్రస్తుత వానాకాలంలో 20 లక్షల టన్నులకు పైగా చల్లుతున్నట్లు అంచనా. వీటికి రూ.వెయ్యి కోట్లకు పైగా కేంద్రం రాయితీ ఇస్తోంది. జింకు సల్ఫేట్‌కు రాయితీ నిధుల్లేవని పక్కన పెట్టేశారు. జూన్‌, జులైలలో పంటల సాగు ప్రారంభించగానే తొలి 45 రోజుల్లో జింకులోపం అధికంగా ఉన్న పొలాల్లో పైర్లు ఎదగడం లేదని, అందుకు జింకుసల్ఫేట్‌ను చల్లాలని రాయితీపై విక్రయాలు లేనందున బహిరంగ మార్కెట్‌లో సొంతంగా కొనుక్కోవాలని రైతులకు సూచనలిచ్చారు. కానీ ఎక్కువమంది కొనలేదు. దీన్ని కొనేందుకు గతంలో రాష్ట్ర సహకార మార్కెటింగ్‌ సమాఖ్య(మార్క్‌ఫెడ్‌)ను వ్యవసాయశాఖ నోడల్‌ ఏజెన్సీగా నియమించేది. ఈ ఏడాది ‘రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ’(ఆగ్రోస్‌)కు ఆ బాధ్యతలు అప్పగిస్తామంది. తీరా కొనేందుకు ప్రైవేటు కంపెనీల నుంచి టెండర్ల ఆహ్వానానికి ఆగ్రోస్‌కు వ్యవసాయశాఖ అనుమతివ్వలేదు. రాయితీ ఇవ్వాలంటే రూ.10 కోట్లయినా ప్రభుత్వం విడుదల చేయాలి. ఈ నిధులు రానందునే టెండర్లు పిలవలేదని ఆగ్రోస్‌ వర్గాలు ‘ఈనాడు’కు తెలిపాయి.

వరసగా ఒకే పంట వేస్తే జింకులోపం
-డాక్టర్‌ జగదీశ్వర్‌, పరిశోధన సంచాలకుడు, ఆచార్య జయశంకర్‌ వర్సిటీ

వరసగా రెండు సీజన్లలో ఒకే పంట సాగుచేస్తే జింకులోపం తలెత్తుతున్నట్లు వర్సిటీ శాస్త్రవేత్తల పరిశీలనలో గుర్తించాం. గతేడాది అరకోటి ఎకరాల్లో వరి సాగు చేశారు. వానాకాలంలో అదే పంటను 65 లక్షల ఎకరాల్లో మళ్లీ వేశారు. ఇలా ఒకే పంట సాగుచేసేవారు తప్పనిసరిగా రెండు సీజన్లకోసారి జింకుసల్ఫేట్‌ను ఎకరానికి 20 కిలోల చొప్పున చల్లాలని రైతులకు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు