యువ ఓటర్లను నమోదు చేయించండి

17 సంవత్సరాలు దాటిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు
రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల సంఘం సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: ‘యువ ఓటర్లను నమోదు చేయించడంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు నమోదు చేసుకోవచ్చు. వారితోపాటు ప్రస్తుతానికి 17 సంవత్సరాలు దాటిన వారూ ముందస్తుగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు’ అని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సాగుతున్న నేపథ్యంలో ఇక్కడి తన కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించినట్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఓటర్ల నమోదు ప్రక్రియలో అన్ని రాజకీయ పార్టీలు 18-19 సంవత్సరాల వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఓటర్ల నమోదుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 26, 27 తేదీల్లోనూ, వచ్చే నెల మూడు, నాలుగు తేదీల్లో అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ కేంద్ర స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారు. ఓటరు నమోదు దరఖాస్తులు స్వీకరిస్తారు. వాటిని ఆ తరవాత క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను ఓటర్ల జాబితాలో చేరుస్తాం.

చిరునామా ఆధారంగా తనిఖీ

ఓటర్ల జాబితాలో పేరు ఉందా? లేదా? పరిశీలించేందుకు పేరుతో పాటు చిరునామాకూ అవకాశం కల్పించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల సంఘాన్ని కోరారు. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించే రోజుల్లో విధిగా పోలింగ్‌ కేంద్రం స్థాయి అధికారులు అక్కడ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చిరునామా ఆధారంగా వెబ్‌సైట్‌లో ఓటర్లను గుర్తించేందుకు అవకాశం కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశామని, పోలింగ్‌ కేంద్రం స్థాయి అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు వికాస్‌రాజ్‌ వివరించారు. ఈ సమావేశంలో తెరాస, భాజపా, మజ్లిస్‌, తెదేపా, సీపీఐ, సీపీఎం, వైతెపా ప్రతినిధులు పాల్గొన్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


మరిన్ని