close

తాజా వార్తలు

నాణ్యమైన వైద్యం కోసమే బస్తీ దవాఖానాలు

రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్

హైదరాబాద్: పేదల ప్రాథమిక ఆరోగ్యానికి బస్తీ దవాఖానాలు అండగా నిలుస్తాయని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని బస్తీ దవాఖానాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. వీటి ఏర్పాటుపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని.. నాణ్యమైన ప్రాథమిక వైద్యం కోసమే బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో ఇవాళ కొత్తగా 45 బస్తీ దవాఖానాలను మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ సుల్తాన్‌నగర్‌, యాదగిరి నగర్‌లో బస్తీ దవాఖానాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 123 బస్తీ దవాఖానాలు ప్రతిరోజూ 10 వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నాయి. నూతనంగా ప్రారంభించిన 45 బస్తీ దవాఖానాలతో అదనంగా 4 వేల మందికి నిత్యం వైద్య సేవలు అందనున్నాయి. ఒక్కో బస్తీ దవాఖానాలో ఒక వైద్యుడు, ఒక నర్స్, ఒక సహాయకుడు అందుబాటులో ఉంటారు. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్య సేవలు అందించనున్నారు. బస్తీ దవాఖానాల్లో 57 రకాల వైద్య పరీక్షలను నిర్వహించడమే కాకుండా 150 ర‌కాల మందుల‌ను ఉచితంగా అందించనున్నారు.

కార్పొరేటర్‌కు జరిమానా..

సుల్తాన్ నగర్‌లో బస్తీ దవాఖాన ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ఎర్రగడ్డ కార్పొరేటర్ షాహిన్ బేగంకు రూ. 20 వేల జరిమానా విధించాల్సిందిగా జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. అంతేకాకుండా కార్పొరేటర్ భర్త షరీఫ్ మాస్కు లేకుండా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆయనకు రూ.1000 జరిమానా విధించాలని కేటీఆర్‌ ఆదేశించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు