close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
కోవాతో ఉపాధి కోటలు

అవకాశంలో సగమిస్తే చాలు.. మహిళలు ఆకాశమంత సాధిస్తారు అనడానికి ఉదాహరణ వీళ్లు.అక్షరం రాకున్నా.. ఆర్థిక స్వావలంబనలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. పశుపోషణకు ప్రత్యేకంగా నిర్మించిన వసతి గృహం బాగోగులు చూసుకుంటూనే.. కుటుంబ పోషణలో సింహభాగం అవుతున్నారు. పొలిమేర దాటని తమ పల్లె పేరును.. స్వచ్ఛమైన కోవాతో ఎల్లలు దాటించారు. కర్నూలు జిల్లా కల్లూర్‌ మండలం తడకనపల్లె గ్రామ మహిళల విజయగాథ చదివేయండిక..

విద్యార్థులకు వసతి గృహాలుంటాయి. అనాథలకు ఉంటాయి. కానీ, తడకనపల్లెలో పశువుల కోసం ఓ వసతి గృహం కట్టారు. మహిళలే దాని నిర్వాహకులు. ఆడవారే అక్కడ పశు పోషకులు. మూగజీవాలను సంరక్షిస్తూ.. పాల ఉత్పత్తులతో స్వయం ప్రతిపత్తి సాధిస్తున్నారు. ఏదైనా సాధించాలన్న పట్టుదలకు ప్రభుత్వ చేయూత తోడవ్వడంతో వారి జీవితాల్లో ఊహించని మార్పు వచ్చింది. ఆ పల్లె పాలకోవాకు కేరాఫ్‌గా మారింది.

అన్నీ గృహానికే..

గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం మూడేళ్ల కిందట ‘పశువుల వసతి గృహం’ నిర్మించింది. పది ఎకరాల భూమిని కేటాయించింది. ఎకరం స్థలంలో నాలుగు షెడ్లు, దాణా కోసం గోదాం, ఇతర వస్తువుల నిల్వకోసం గది నిర్మించి ఇచ్చింది. అంతర్గత దారులు, నీటి సౌకర్యం కల్పించింది. మిగతా తొమ్మిది ఎకరాలు పశుగ్రాసం పెంచుకోవడానికి ఏర్పాట్లు చేసింది. దాణాపై రాయితీ అందజేసింది. ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రచారం చేసింది. ఈ వసతి గృహం ఊరికి దూరంగా ఉండటంతో.. మొదట్లో మహిళలు ఎవరూ ఆసక్తి చూపలేదు. నలుగురంటే నలుగురే మహిళలు ముందుకొచ్చారు. తమిళనాడు నుంచి ముర్రాజాతి గేదెలను తీసుకొచ్చి వసతి గృహం తలుపుతట్టారు. కొన్నాళ్లకు ఇంకొందరు వారి బాటే పట్టారు. ఇంకొన్నాళ్లకు వసతి గృహమంతా పశువులతో నిండిపోయింది. పదుల సంఖ్యలో మహిళలు డ్వాక్రా, స్త్రీనిధి, బ్యాంకు రుణాలు తీసుకొని పశువులు కొనుగోలు చేశారు. వాటిని ఇంటి దగ్గరో, కొట్టంలోనో ఉంచకుండా.. వసతి గృహానికి తరలించారు. దాదాపు 200 గేదెలు, ఆవులు ఇక్కడ హాయిగా ఉంటున్నాయి.

ఎల్లలు దాటి వ్యాపారం..

గ్రామంలో మొదట్లో ఒకరు మాత్రమే కోవా తయారు చేసేవారు. పశువుల వసతి గృహం వచ్చిన తర్వాత.. పాలకోవా అందరి వ్యాపకంగా మారిపోయింది. ఇక్కడి నుంచి దాదాపు వెయ్యి లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. సమీప గ్రామాలు వామ సముద్రం, బైరాపురం, లద్దెపల్లె నుంచి మూడువేల లీటర్ల పాలు సేకరిస్తున్నారు 20 కుటుంబాల మహిళలు. ఈ పాలను కోవా తయారీకి ఉపయోగిస్తున్నారు. దాదాపు వంద లీటర్ల పాలకు నలభై కిలోల కోవా తయారవుతుంది. ఇలా రోజూ దాదాపు 1200 నుంచి 1500 కిలోల కోవా ఉత్పత్తి చేస్తున్నారు. బెల్లం, పంచదారతో రుచికరమైన కోవాను సిద్ధం చేసేవారు. కొన్నాళ్లకు వీరి ప్రయత్నాన్ని తెలుసుకొని నాబార్డ్‌ అండగా ముందుకొచ్చింది. గ్రామానికి చెందిన 30 మంది మహిళలకు పాల ఉత్పత్తులైన.. కలాకండ, పనీర్‌, కోవా, బాదాంపాలు, దూద్‌పేడ ఇలా పలు పదార్థాల తయారీలో శిక్షణనిచ్చింది. తడకనపల్లె పేరు చుట్టుపక్కల జిల్లాల్లోనూ మార్మోగడం మొదలైంది. కర్నూలుతో పాటు హైదరాబాద్‌, గద్వాల్‌కు పాల ఉత్పత్తులు ఎగుమతి చేయడం మొదలుపెట్టారు. విదేశాలకూ పంపించే స్థాయికి చేరుకున్నారు. పలువురు వ్యాపారులు గ్రామానికి వచ్చి కోవా కొనుగోలు చేస్తుంటారు. పెళ్లిళ్లకు ఆర్డర్లు కూడా తీసుకుంటున్నారు. అన్ని ఖర్చులు పోనూ ఒక్కో కుటుంబానికి నెలకు 40వేల రాబడి వస్తోందంటున్నారు మహిళలు. వీరి దీక్షకు కొనసాగింపుగా ఎంఎస్‌ఎంఈ పథకం కింద వసతి గృహం చెంతనే ఓ పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతుండటం విశేషం.

- సురేంద్ర, ఈనాడు డిజిటల్‌ కర్నూలు


కోవానే కుటుంబ పోషణ

మా వసతి గృహంలో వచ్చే పాలు ఎక్కడా విక్రయించం. కోవా తయారీకే ఉపయోగిస్తాం. అదనంగా సేకరించిన పాలనూ అందుకే వినియోగిస్తాం. రోజూ మూడు వేల లీటర్లపైగా పాలతో కోవా చేసే స్థితికి చేరుకున్నార. కోవా తయారీతో పలువురికి ఉపాధి సైతం లభిస్తోంది.

- జుబేదా, వసతి గృహ ఛైర్మన్‌


మరిన్ని