close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ప్రతిభకు పద్మాల మాల!

అద్భుతమైన గానామృతంతో ఒకరు... అచ్చెరువొందే వ్యాపార మెలకువలతో మరొకరు... మనసుని కదిలించే సేవతో ఇంకొకరు...  కళ, సేవ, వ్యాపారం... రంగమేదైనా తమదైన ముద్రతో లక్షలాది మందికి చేరువయ్యారు. శెభాష్‌ అనిపించుకున్నారు.. ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్న వీరికి తాజాగా ప్రకటించిన పద్మపురస్కారాలు మరింత నిండుదనాన్ని, గౌరవాన్ని తీసుకొచ్చాయి.


తేనెలూరే... ఆ గానానికి

ఇరవైకి పైగా భాషల్లో పాతికవేలకు పైగా పాటలు పాడారామె. ఆమె గానామృతానికి ముగ్ధులుకాని భారతీయుల్లేరు. అందుకే ఉత్తర భారతాన ‘పియ బసంతి’ అయ్యారు. ఆమె పుట్టిపెరిగిన కేరళలో ‘వానంబాడి’ అయ్యారు. తమిళప్రజల హృదయాల్లో ‘చిన్న కుయిల్‌’గా నిలిచిపోయారు. కన్నడిగుల మనసుల్లో కోకిలగా, తెలుగువారికి ‘సంగీత సరస్వతి’గా మారారు.... 

తీయని ఆమె కంఠస్వరం వింటే గంధర్వులు దిగిరావాల్సిందే. తేనెలూరుతూ సాగే ఆ గానానికి ఎవరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే. కేరళలోని త్రివేండ్రంలో సంగీత కళాకారుల కుటుంబంలో పుట్టారు చిత్ర. చిన్న వయసులోనే సంగీత ప్రపంచంలో అడుగుపెట్టారు. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ సహా ఇరవై భాషల్లో తన గానామృతాన్ని పంచారు. ఆరు జాతీయ, ఎనిమిది ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను అందుకున్నారు. 2005లో పద్మశ్రీ అవార్డును తీసుకున్నారు. ఏఆర్‌ రెహ్మాన్‌, ఇళయరాజా, కేవీ మహదేవన్‌ వంటి ఎందరో సంగీత దిగ్గజాలతో కలిసి చిత్ర పనిచేశారు. అంతర్జాతీయస్థాయిలో రూపొందించిన ‘జీవితంలో ప్రతి ఒక్కరూ వినాల్సిన వెయ్యిపాటలు’ పట్టికలో ఈమె పాట చోటు దక్కించుకుంది.

‘42 ఏళ్ల నా సంగీత ప్రయాణానికి దక్కిన పురస్కారం ‘పద్మభూషణ్‌’. ఎదురుచూడని ఆనందమిది. భగవంతుడికీ, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నా. మన దేశానికి, ప్రజలకు తలవంచి నమస్కరిస్తున్నా. జైౖహింద్‌’ అంటూ టిట్టర్‌లో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు చిత్ర.


అనాథలకు అమ్మ!

తొమ్మిదినెలల నిండు గర్భిణి. భర్త నిర్ధాక్షణ్యంగా ఇంట్లోంచి గెంటేస్తే ఎవరూ లేని అనాథ అయ్యింది. పశువుల కొట్టంలో పురుడు పోసుకుంది. తన బొడ్డుతాడుని తానే రాయితో తెంచుకుని పసిబిడ్డతో బిచ్చమెత్తుకుంటూ ఊరూరు తిరిగింది. 40 ఏళ్లు గిర్రున తిరిగేసరికి తన బిడ్డకే కాదు వెయ్యిమంది అనాథలకు అమ్మైంది సింధుతాయి. సింధు తల్లికి ఆమె పుట్టుకే ఇష్టం లేక  చిందీ అని పిలిచేది. చినిగిన బట్టముక్క అని దానర్థం. కూతుర్ని చదివించడం ఇష్టం లేదు ఆ తల్లికి. అందుకే ఆకులపై అక్షరాలు నేర్చుకుంది సింధు. పన్నెండేళ్లకే పెళ్లైంది. ఇరవైఏళ్లు వచ్చేనాటికి ముగ్గురు పిల్లలకు తల్లైంది. ఆమెలోని ఆత్మవిశ్వాసం అత్తింటివాళ్లకు నచ్చలేదు. ఒక రోజు గర్భిణిగా ఉన్న సింధుని భర్త ఇంట్లోంచి గెంటేస్తే పశువులకొట్టంలోనే పురుడుపోసుకుంది. శ్మశానవాటికలో తలదాచుకుని, శవాలకు పెట్టే పిండాలనే ఆహారంగా తీసుకుంది. అంత కష్టంలోనూ ఆమెకు దేవుడిచ్చిన వరం శ్రావ్యమైన గొంతు. పాటలుపాడుతూ తన కూతురిని పోషించుకుంటూ... అనాథలను  అక్కున చేర్చుకుంది. వెయ్యిమంది పిల్లలకు తల్లైంది.


ఎందరికో ఆసరా!

డు  దశాబ్దాలుగా సమాజ సేవకే జీవితాన్ని అంకితం చేశారు సేవాసమాజ్‌ వ్యవస్థాపకురాలు శాంతిదేవి. ఒడిశాలోని బాలేశ్వర్‌లో 1934లో జన్మించారామె. కుటుంబంలో అందరూ సమాజసేవకు అంకితమవడంతో తానూ ఆ మార్గాన్నే ఎంచుకున్నారు. ఆపై సామాజిక సేవా కార్యకర్త రతన్‌దాస్‌ను వివాహం చేసుకున్నారు. కొరాపుట్‌ జిల్లాలోని సంకల్‌పదర్‌ గ్రామంలో కుష్టు రోగులకు సపర్యలు చేస్తూ తన సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారీమె. బాలికలకు విద్యను అందించాలనే ఆలోచనతో రాయగడ జిల్లాలోని పద్మాపురం సమీపంలో అనాథ బాలికలకు సేవా సమాజ్‌ ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఏడుగురు విద్యార్థులతో మొదలైన ఈ సేవాసమాజ్‌లో ప్రస్తుతం 350 మంది అనాథ బాలికలు చదువుకుంటున్నారు. ఇక్కడ చదువుతోబాటు వృత్తినైపుణ్యాలు నేర్పిస్తారు. వారికి పెళ్లిళ్లు చేస్తారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌,  ఛత్తీస్‌గఢ్‌ వంటి చోట్లా తన సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆచార్య వినోభాబావేతో కలిసి భూదాన్‌ ఉద్యమంలోనూ పాల్గొన్నారు.


వ్యాపార దక్షత

మిసెస్‌ బెక్టార్‌ సంస్థ ఈ మధ్య స్టాక్‌ మార్కెట్‌లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇరవైవేల పెట్టుబడితో ఇంట్లోనే మొదలుపెట్టిన ఐస్‌క్రీమ్‌ల వ్యాపారం...బిస్కెట్లు, బన్నుల తయారీతో ఆహారరంగంలో తనదైన ముద్ర వేశారు. వెయ్యికోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఈ ఘనతంతా ఆ సంస్థ అధినేత్రి రజనీ బెక్టార్‌కే దక్కుతుంది. ఆ ప్రత్యేకతే ఆమెకు ఇప్పుడు పద్మశ్రీ తెచ్చిపెట్టింది. లాహోర్‌లో పుట్టిపెరిగారీమె. దేశవిభజన తర్వాత ఆమె కుటుంబం దిల్లీలో స్థిరపడింది. పదిహేడేళ్లకే  పెళ్లయ్యింది. భర్త ప్రోత్సాహంతో డిగ్రీ పూర్తిచేసిన రజనీకి...పిల్లలు కాస్త పెద్దయ్యాక ఖాళీ దొరికింది. దాంతో సరదాగా వంటకాల తయారీలో శిక్షణ తీసుకున్నారు. ఆ అనుభవంతోనే కుకీలు, ఐస్‌క్రీములు తయారు చేసి కుటుంబ సభ్యులు, స్నేహితులకు వాటి రుచి చూపించేవారట. అంతా చాలా బాగున్నాయని ప్రోత్సహించడంతో 1978లో అవెన్‌, ఐస్‌క్రీమ్‌ తయారీ యంత్రం కొనుగోలు చేసి ఆర్డర్లు తీసుకోవడం మొదలుపెట్టారు. కొన్నాళ్లకే ఆ ఉత్పత్తులు ఉత్తర భారత విపణిలో ప్రత్యేకత చాటాయి. అదే సమయంలో దేశీయ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన మెక్‌డొనాల్డ్స్‌, తర్వాత క్యాడ్‌బరీ, ఐటీసీ, సన్‌ఫీస్ట్‌ వంటి సంస్థలకు భాగస్వామిగా మారడంతో దీని దశ మారింది. 2006 నాటికి వంద కోట్ల ఆదాయాన్ని, ప్రస్తుతం వేల కోట్ల రూపాయల టర్నోవర్‌నీ  ఈ సంస్థ అందుకుంటోంది.


మూఢాచారంపై పోరాటం

నదేశంలో మూఢనమ్మకాలు, దురాచారాలు ఇప్పటికీ చాలాచోట్ల వేళ్లూనుకుపోయాయి.  అలాంటి వాటిల్లో మహిళల్ని మంత్రగత్తెలనే నెపం వేసి వేధించడం కూడా ఒకటి. దానిపై ఓ  పెద్ద పోరాటమే చేశారు బైరుబాలా రబా. దానికి గుర్తింపుగానే పద్మశ్రీ వరించింది. అసోం, గోల్‌పారా జిల్లాలోని తాకూరియా అనే గిరిజన గ్రామం ఆమెది. తన కొడుకుకి అనారోగ్యం వస్తే... నీ బిడ్డని మంత్రగత్తె పీడిస్తోందని ఇరుగుపొరుగు చెప్పారు. ఇక అప్పటి నుంచి క్షణ క్షణం భయంతో బతికేది రబా. కానీ అలాంటి నష్టమేదీ జరగలేదు. అప్పుడే మొదటిసారి అదంతా మోసమని గ్రహించింది. మంత్రగత్తెల పేరుతో జరుగుతోన్న అన్యాయాలను ఎదుర్కోవడానికి స్థానిక మహిళల్ని బృందంగా చేసుకుని ప్రజల్లో అవగాహన తేవడం మొదలుపెట్టింది.. ఈ క్రమంలో ఎన్నో దాడులు, మరెన్నో అవమానాలు ఎదుర్కొంది. అయినా సరే! ధైర్యంగా నిలబడింది. ఆమె పోరాటంతో మంత్రగత్తెలపై జరుగుతోన్న దాడుల్ని నిషేధించేందుకు ప్రభుత్వం ఓ కఠిన చట్టాన్ని తెచ్చింది.


మృదంగ మహారాణికి పద్మశ్రీ

తన పదో ఏట.. నాన్నతో పాటు వేదికపై మృదంగం లయబద్ధంగా వాయిస్తుంటే.. సభికులు తన్మయత్వం చెందారు.. ఘటికురాలే అనుకున్నారు..! ఆమె మరెవరో కాదు. దేశంలోనే తొలి మృదంగ విద్వాంసురాలిగా పేరు ప్రఖ్యాతులు సాధించిన మృదంగ మహారాణి దండమూడి సుమతీ రామ్మోహనరావు.

న పట్టుదల.. నాన్న ఇచ్చిన ప్రోత్సాహంతో కేవలం పురుషులకే పరిమితమైన మృదంగంపై ఓ అమ్మాయి చేతులు లయబద్ధంగా విన్యాసాలు చేశాయి. ఆ మృదంగ నాదాలు దేశవిదేశాల్లో మారుమోగి... ఎంతోమంది సంగీత విద్వాంసులను మెప్పించాయి. కీర్తి ప్రతిష్టలూ తెచ్చిపెట్టాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నిడుమోలు రాఘవయ్య, వెంకటరత్నమ్మలకు 1950లో సుమతి జన్మించారు. మొత్తం 14 మంది సంతానం. తండ్రి రాఘవయ్య గుర్తింపు పొందిన మృదంగ విద్వాంసుడు. తండ్రిని చూస్తూ ఆసక్తి పెంచుకున్నారు సుమతి. ఇది గమనించి ఆమెకు వాద్యంలో మెలకువలు నేర్పారు. అలా నైపుణ్యం సాధించిన సుమతి 10వ ఏటనే తొలి ప్రదర్శన ఇచ్చారు. మృదంగంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. ఆ తర్వాత ఆమె దండమూడి రామ్మోహన్‌రావు దగ్గర శిష్యురాలిగా చేరారు. ఇద్దరూ కలిసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చేవారు. తర్వాత ఆయన్నే సుమతి వివాహం చేసుకున్నారు. విజయవాడలోని ఘంటశాల సంగీత కళాశాలలో విద్యార్థినిగా ఉన్న ఆమె అదే కళాశాలలో అధ్యాపకురాలుగా, ప్రిన్సిపల్‌గా పనిచేశారు. మద్రాస్‌ సంగీత అకాడమీ నుంచి మూడు సార్లు  ఉత్తమ మృదంగ కళాకారిణిగా అవార్డులు అందుకున్నారు. 2009లో కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని దక్కించుకున్నారు. ‘ఆడపిల్లలపై ఆంక్షలు ఉన్న రోజుల్లోనే తాను ధైర్యంగా ఈ రంగంలోకి అడుగు పెట్టానని... నచ్చిన రంగంలో రాణించేందుకు సాధన ముఖ్యం’ అని చెబుతున్నారు సుమతి.


మరిన్ని