close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9AM

1. విద్యుదాఘాతంతో ముగ్గురు విద్యార్థులు మృతి

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొప్పవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది.  కోదండరామస్వామి ఆలయ ప్రధాన కూడలి వద్ద ఉన్న వైకాపా జెండా దిమ్మెపై విద్యార్థులు ఆడుకుంటుండగా.. విద్యుత్‌ తీగలకు జెండా రాడ్‌ తగిలింది. దీంతో రాడ్‌ను పట్టుకున్న ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వండి 

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యల అంశంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ స్పందించారు. వాస్తవ నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖను ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి నివేదిక కోరుతూ కేంద్ర హోం శాఖ ఈ నెల 7న లేఖ రాసింది. ఏప్రిల్‌లో విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో పలు సాంకేతిక, మానవ తప్పిదాలు జరిగాయి. ఫలితంగా పలువురు విద్యార్థులు తప్పడం, కొందరికి మార్కులు తగ్గడం వంటివి చోటుచేసుకున్నాయి. ఈ వ్యవహారంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, ఇతర నేతలు జులై 1న రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. కొత్తగా ఆరు విమానాశ్రయాలు! 

తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని విమానాశ్రయాల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. పెరుగుతున్న ప్రయాణ అవసరాల దృష్ట్యా ఆదిలాబాద్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, కొత్తగూడెంలలో విమానాశ్రయాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ పథకం ఉడాన్‌ కింద వీటిని నిర్మించాలని యోచిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. కుటుంబానికో ఆరోగ్య కార్డు

ప్రతి కుటుంబానికి ఆరోగ్య కార్డులను జారీచేయనున్నారు. డిసెంబరు 21 నుంచి ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన వైద్య ఆరోగ్యశాఖ సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చికిత్స వ్యయం రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని, అనుబంధ ఆసుపత్రులకు గ్రేడింగ్‌ ఇవ్వాలని, నవంబరు నుంచి పొరుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలు పొందే అవకాశాన్ని కల్పించాలని, ప్రధాన ఆసుపత్రుల్లో ‘వైఎస్సార్‌ క్యాంటీన్లు’ ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. రేపటి నుంచి గ్రామ వాలంటీర్ల వ్యవస్థ

గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఈ నెల 15 నుంచి ప్రారంభిస్తున్నట్లు ఏపీ సీఎం జగన్‌ పేర్కొన్నారు. 40 రోజుల వ్యవధిలో రికార్డు స్థాయిలో 2.5 లక్షల మందిని నియమించామని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో నియామకాలు సైతం పారదర్శకంగా, వేగంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  గ్రామ సచివాలయాలకు, ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు ఉంటారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. ఆహార పొట్లాలపై గడువు తేదీ 

ప్యాకేజ్డ్‌ నీళ్ల సీసాలు, కూల్‌డ్రింక్స్‌ తదితర వస్తువులపై అతికించే లేబుళ్లు మరింత పెద్దగా కనిపించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయా సీసాలు, ప్యాకెట్లపై 40శాతం పరిమాణం వరకూ లేబుళ్లు ఉండటాన్ని తప్పనిసరి చేయనున్నట్టు కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి రాంవిలాస్‌ పాసవాన్‌ తెలిపారు. వస్తువు పరిమాణం, తయారీ తేదీ, వినియోగార్హత ముగిసే తేదీ (ఎక్స్‌పైరీడేట్‌), గరిష్ఠ చిల్లర ధర అందులో స్పష్టంగా కనిపించేలా చూస్తామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. మాంద్యంలోకి జారుతున్నామా! 

రాబోయే 9 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం మరోసారి బుసకొట్టే ప్రమాదం ఉందని ఆర్థికనిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా-చైనా మధ్య మొదలైన వాణిజ్యయుద్ధం చినికిచినికి గాలివానగా మారి ఉప్పెనలా ప్రపంచదేశాలన్నింటినీ ముంచేయొచ్చని అంటున్నారు. ఈ రెండు దేశాలూ ఇలా సుంకాలు విధించుకుంటూ పోతే అంతర్జాతీయ ఆర్థికవృద్ధి రేటు ఏడేళ్ల కనిష్ఠస్థాయి.. అంటే 2.8 శాతానికి పడిపోవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. శ్రీనగర్‌లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు 

జమ్మూ-కశ్మీర్‌లో పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు శ్రీనగర్‌లో అక్టోబర్‌-12 నుంచి మూడు రోజులపాటు ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించనున్నట్లు అధికార యంత్రాంగం మంగళవారం ప్రకటించింది. జమ్మూ-కశ్మీర్‌లో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, వనరులు, మౌలిక వసతులు వంటివాటిని ఈ సదస్సుకు వచ్చిన పెట్టుబడిదారులకు వివరిస్తామని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి (పరిశ్రమలు) నవీన్‌ చౌధురి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. కార్స్‌24లో ఎంఎస్‌ ధోనీ పెట్టుబడి

టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ మరో వ్యాపారంలో అడుగుపెట్టాడు. గురుగ్రామ్‌ కేంద్రంగా నడిచే కార్స్‌24 సంస్థలో పెట్టుబడి పెట్టాడు. తమ బ్రాండ్‌ విలువను పెంచుకొనేందుకు, దేశవ్యాప్తంగా వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు ఆయనతో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నామని కార్స్‌24 వెల్లడించింది. ఆ సంస్థలో ధోనీ కొంతమేర వాటా సొంతం చేసుకోవడమే కాకుండా ప్రచారకర్తగా వ్యవహరిస్తాడు. ఐతే మహీ పెట్టుబడి విలువెంతో బహిర్గతం చేయలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ప్రపంచ ఛాంప్‌ భారత్‌ 

వికలాంగుల టీ20 వరల్డ్‌ సిరీస్‌లో భారత్‌ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లాండ్‌పై 36 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం భారత బౌలర్లు సమష్టిగా సత్తా చాటడంతో ఇంగ్లాండ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులే చేయగలిగింది. మరోవైపు జోరుమీదున్న టీమ్‌ఇండియా మరో సమరానికి సన్నద్దమైంది. ఆఖరి వన్డేలో నేడు వెస్టిండీస్‌ను ఢీకొంటుంది. సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని కోహ్లీసేన భావిస్తుంటే.. ఒక్క మ్యాచ్‌లోనైనా నెగ్గి పరువు దక్కించుకోవాలని ఆతిథ్య జట్టు ఆరాటపడుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు