close

తెలంగాణ

మంటల్లో మానవత్వం

చేతబడి అనుమానంతో యువకుడిని కొట్టి..
మృతురాలి చితిలోనే పడేసి సజీవ దహనం
రాష్ట్ర రాజధాని శివార్లలో అమానుషం
అనారోగ్యంతో చికిత్స పొందుతూ మహిళ మృతి
యువకుడి క్షుద్రపూజలే కారణమని అనుమానం
అద్రాస్‌పల్లిలో పోలీస్‌ పికెట్‌.. నలుగురి అరెస్ట్‌
ఈనాడు - హైదరాబాద్‌, న్యూస్‌టుడే - శామీర్‌పేట

రాత్రి పది గంటల సమయం. చెరువుగట్టుపై ఓ చితి కాలుతోంది. ఆ సమయంలో అక్కడికి ఓ యువకుడు వచ్చాడు. అంతే అక్కడున్న వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా అతనిపై విరుచుకుపడ్డారు. కర్రలు, రాళ్లతో తీవ్రంగా కొట్టి కాలుతున్న చితిలో పడేశారు. మంటలకు తాళలేక అతడు చితిపై నుంచి లేచి పరుగులు పెట్టాడు. అయినా వారు వదల్లేదు. అతణ్ని పట్టుకుని, లాక్కువచ్చి మళ్లీ చితిలో పడేశారు. నిస్సహాయ స్థితిలో అతడు సజీవదహనమయ్యాడు. ఇది సినిమా కథ కాదు. రాష్ట్ర రాజధాని శివారు అద్రాస్‌పల్లిలో వెలుగు చూసిన రాక్షసత్వం. ఈ ఆధునిక యుగంలోనూ మూఢనమ్మకాల జాడ్యానికి నిలువెత్తు నిదర్శనం ఈ సంఘటన.

ధునిక యుగంలో అమానుషం... నమ్మశక్యంకాని దారుణం... చేతబడి అనుమానంతో ఓ వ్యక్తిని మృతురాలి చితిలోనే పడేసి సజీవ దహనం చేసిన ఉన్మాదం.. కనీవినీ ఎరుగని రాక్షసత్వం.. అక్షరాస్యత లేని మారుమూల, అటవీ ప్రాంతాల్లో కాదు.. రాజధాని శివార్లలోనే ఈ దురాగతం వెలుగుచూసింది. మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట-మూడుచింతలపల్లి మండలం అద్రాస్‌పల్లి గ్రామంలో గ్యార లక్ష్మి(45) అయిదారేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఆమెకు నయం కాలేదు. అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ బోయిని ఆంజనేయులు(24) చేతబడి చేయడమే అందుకు కారణమని కుటుంబసభ్యులు అనుమానంతో ఉన్నారు. ఈ క్రమంలో లక్ష్మి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మరణించింది. స్వగ్రామంలోని చెరువు పక్కన బుధవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.

ఆంజనేయులును చూసి ఆగ్రహం
లక్ష్మి మృతికి క్షుద్రపూజలే కారణమనే అనుమానంతో ఉన్న మృతురాలి బంధువులు.. చేతబడి చేసిన వ్యక్తి రాత్రి సమయంలో చితి వద్దకు వస్తాడనే అనుమానంతో సమీపంలో మాటు వేశారు. రాత్రి 10 గంటల సమయంలో ఓవైపు చితి కాలుతుండగానే కాకతాళీయంగానో.. మరేదో కారణమో తెలియదు కానీ అనూహ్యంగా ఆంజనేయులు అక్కడికి వచ్చాడు. లక్ష్మి బంధువులకు అప్పటికే అతడిపై అనుమానం ఉండటం..తమ అనుమానాన్ని నిజం చేస్తూ అతడు అక్కడికి రావడంతో వారిలో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా కొట్టి చితిమంటల్లో  పడేయడంతో అతడు కాలిపోయాడు. ఈ దురాగతం గురించి తెలియడంతో గ్రామస్థులు శామీర్‌పేట పోలీసులకు సమాచారం అందించారు. వారు  ఘటనాస్థలికి చేరుకొని  కాలిపోతున్న ఆంజనేయులు మృతదేహాన్ని చితి నుంచి బయటికి తీశారు.

ఫోన్‌ చేసి పిలిపించారు!
పోలీసులు అనుమానితుల్ని అదుపులోకి తీసుకోవడంతో ఈ అమానుష ఘటనకు గల కారణాలపై బలమైన ఆధారాలు లభించాయి. చితి వద్ద ఆంజనేయులు అన్న గణేశ్‌ చెప్పులు లభించడం.. తమ్ముడు తన చెప్పులను వేసుకొని వెళ్లాడని గణేశ్‌ వాంగ్మూలం ఇవ్వడం.. తమ అదుపులో ఉన్న నిందితుల నుంచి సేకరించిన సమాచారం మేరకు ఆంజనేయులే హతమయ్యాడనే నిర్ధారణకు వచ్చారు. బహిర్భూమి కోసం ఆంజనేయులు తరచూ చెరువు వద్దకు వెళుతుంటాడని.. బుధవారం రాత్రి నిందితులే ఫోన్‌ చేసి పిలిపించారని.. అక్కడికి వెళ్లిన అతడిని లాక్కెళ్లి సజీవ దహనం చేశారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపించారు.

కాలిన మృతదేహానికి డీఎన్‌ఏ పరీక్షలు
ఘటనాస్థలిని బాలానగర్‌ డీసీపీ పద్మజారెడ్డి సందర్శించారు. కాలిపోయిన మృతదేహం నుంచి ఎముకల్ని, ఘటనాస్థలిలోని రక్త నమూనాల్ని నిపుణులు సేకరించి డీఎన్‌ఏ పరీక్షల నిమిత్తం పంపించారు. కాగా ఈ మృతదేహం ఆంజనేయులుదేనని గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్‌ వైద్య నిపుణులు ధ్రువీకరించారు. అనంతరం మృతదేహానికి బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. అద్రాస్‌పల్లిలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు.


చితిలోనుంచి లేచి పారిపోయినా దక్కని ప్రాణం

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో విస్మయకర విషయాలు వెలుగుచూశాయి. ఆంజనేయులు పూర్వీకులు కొందరు క్షుద్రపూజలు చేసేవారని స్థానికంగా ప్రచారంలో ఉందని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యమే తాజా దురాగతానికి బలమైన కారణంగా భావిస్తున్నారు. రాత్రి లక్ష్మి చితి మండుతున్న సమయంలో అక్కడే ఉన్న కుటుంబసభ్యులు, బంధువులు మద్యం మత్తులో ఉండగా ఆంజనేయులు అక్కడ కనబడటంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆంజనేయులును కొట్టి చితిలో వేసిన తర్వాత అతడు లేచి పరిగెత్తినట్లు పోలీసులు గుర్తించారు. అయితే అతడిని మళ్లీ తీసుకొచ్చి చితి మంటల్లో పడేసినట్లు తేలింది. ఈక్రమంలో నిందితుల్లో ఒకరికి మంటలు అంటుకుని గాయాలైనట్లు ఆధారాలు సేకరించారు. ఆంజనేయులు చితి వద్దకు వెళ్లి ఒంటికి పసుపు రాసుకొని.. ప్రదక్షిణలు చేస్తుండగా అతడిపై దాడి చేశారనే ప్రచారం ఉన్నా పోలీసులు ధ్రువీకరించడం లేదు. లక్ష్మి బావ బాల్‌రామ్‌తోపాటు మరో నర్సింహ, కిష్టయ్య, శ్రీరామ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు