close

బిజినెస్‌

ఇ-అసెస్‌మెంట్‌కు శ్రీకారం

దిల్లీ: పన్ను సంస్కరణల్లో పెద్దదిగా చెప్పుకోదగిన ఇ-అసెస్‌మెంట్‌కు ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం సోమవారం శ్రీకారం చుట్టింది. పన్ను చెల్లింపుదార్లు, పన్ను అధికారులు ఒకరినొకరు (ఫేస్‌-టు-ఫేస్‌) చూసుకునే అవసరం లేకుండా ఇ-అసెస్‌మెంట్‌ వ్యవస్థను రూపొందించారు. ఇందుకోసం చేపట్టిన ఇ అసెస్‌మెంట్‌ జాతీయ కేంద్రాన్ని (ఎన్‌ఈఏసీ) రెవెన్యూ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ఈ కేంద్రం పర్యవేక్షిస్తుంది. వాస్తవానికి ఈ పథకంతో పాటు కేంద్రాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రారంభించాల్సి ఉంది. ప్రధానితో సమావేశంతో పాటు మరిన్ని కార్యక్రమాల వల్ల ఆమె పాల్గొనలేదు. పన్ను చెల్లింపుదార్లకు ఉత్తమ సేవలు అందించడం, ఫిర్యాదులను తగ్గించడమే ధ్యేయంగా ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని పాండే తెలిపారు. ఈ పథకం అమలుకు మొత్తం 2686 మంది ఐటీ అధికారులను బదలాయించారు. 2018-19 మదింపు సంవత్సరానికి సంబంధించి 58,322 కేసులను స్క్రూటినీ కింద ఎంపిక చేసి, ఇ-నోటీసులు జారీ చేయడం ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించారు.

* పన్ను చెల్లింపుదార్లు నమోదిత ఇ-ఫైలింగ్‌ ఖాతాలతో పాటు ఇ మెయిల్‌లను తనిఖీ చేసుకుని, నోటీస్‌ ఉంటే 15 రోజుల్లోగా సమాధానం తెలపాల్సి ఉంటుంది. స్క్రూటినీకి వచ్చిన ఏ కేసులో అయినా, పన్ను చెల్లింపుదార్లు తమ పత్రాలను ఆన్‌లైన్‌లో సమర్పిస్తే సరిపోతుంది. ఏ అధికారి పరిశీలిస్తారనేది కంప్యూటర్‌ ద్వారా ఎంపిక చేస్తారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు