close

తెలంగాణ

కరీంనగర్‌ రెడ్‌జోన్‌పై ప్రత్యేక దృష్టి

ఇంటింటికీ నిత్యావసరాల సరఫరా
సేవాస్ఫూర్తిని చాటుతున్న సిబ్బంది

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: కరోనా కలవరంతో అప్రమత్తమైన కరీంనగర్‌లో ఇప్పుడు అందరి దృష్టి రెడ్‌జోన్‌పైనే పడింది. ఇండోనేసియా నుంచి వచ్చిన 10 మంది సంచరించిన ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించి అధికారులు పూర్తిగా నిర్బంధంలో ఉంచారు. అక్కడి ఇళ్లలో నుంచి ఎవరినీ కాలు బయటపెట్టకుండా ఆంక్షల్ని విధించారు. బ్యారికేడ్లు ఏర్పాటు చేసి అన్ని దారుల్ని మూసివేయించారు. సుమారు మూడు డివిజన్ల పరిధిలో ఈ ప్రాంతాలున్నాయి. నాలుగు వేలకు పైగా ఉన్న ఇళ్ల చెంతకే కూరగాయలు, పాలు తదితరాలను సరఫరా చేస్తున్నారు. ఏ అవసరమొచ్చినా అక్కడి ప్రజలు ఫోన్‌ చేస్తే అధికారులు స్పందించేలా ఏర్పాటు చేశారు. ఈ విధుల్లో ఉన్న నగరపాలక సిబ్బందితో పాటు పోలీసులు, ఆసుపత్రుల సేవల్ని ఉన్నతాధికారులు, ప్రజలు ప్రశంసిస్తున్నారు. గ్యాస్‌, తాగునీరు, నిత్యావసర వస్తువులు, ఇతర అత్యవసర సేవలకు ఎవరిని సంప్రదించాలనే విషయంలో ప్రత్యేకమైన ఫోన్‌ నంబర్లతో కాలనీవాసులకు కరపత్రాల్ని పంపిణీ చేశారు. బుధవారం 3,718 ఇళ్లకు కూరగాయల్ని అందించారు. గురువారం నుంచి పాల సరఫరాతో పాటు ఇంటింటికీ బియ్యం పంపిణీకి అధికారులు సిద్ధమయ్యారు. మంత్రి గంగుల కమలాకర్‌, జిల్లా కలెక్టర్‌ శశాంక, పోలీసు కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి, నగరపాలకసంస్థ కమిషనర్‌ క్రాంతిలు బుధవారం ఆయా కాలనీల్లో పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పారు. హైద్రాబాద్‌లో ఉన్న ఉద్యోగులు, విద్యార్థులు కరీంనగర్‌కు వచ్చేందుకు పడుతున్న ఇబ్బందులు మంత్రి దృష్టికి రావడంతో ఆయన డీజీపీˆతో మాట్లాడి అవసరమైన ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక వాహనాల్లో వారిని గమ్యస్థానాలకు వచ్చేందుకు చొరవ చూపించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు