close

గ్రేటర్‌ హైదరాబాద్‌

మానవత్వం మంటగలిసె

గుండె నొప్పితో విలవిలలాడుతున్నా పట్టించుకోని దైన్యం
తక్షణ సాయం అందక.. రోడ్డుపైనే ప్రాణం విడిచిన అభాగ్యుడు

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌; కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: కరోనా వైరస్‌ భయం మానవత్వాన్ని దూరం చేసింది. తోటి మనిషి నడిరోడ్డుపై గుండెనొప్పితో విలవిలలాడుతున్నా ఎవరూ సాయం చేయలేని పరిస్థితి తెచ్చింది. పది నిమిషాల తర్వాత పోలీసులు వచ్చి ఆసుపత్రికి తరలించేలోపే బాధితుడు తుది శ్వాస విడిచారు. ఉగాది పండుగ రోజు కరీంనగర్‌లో చోటుచేసుకున్న విషాద మరణం తీరిది. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ముస్తాబాద్‌కు చెందిన కె.వెంకటేష్‌(55) కరీంనగర్‌లో ఉంటూ ఓ స్టీల్‌ దుకాణంలో 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  బుధవారం ఉదయం ఉగాది పండుగ సందర్భంగా నిత్యావసర వస్తువుల కొనుగోలుకు ఇంటి నుంచి రైతుబజార్‌కు నడిచి వెళ్తూ ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయారు. 10 నిమిషాలపాటు బాధతో విలవిలలాడారు. ఛాతీని నొక్కుకుంటూ ఇబ్బంది పడుతున్నా స్థానికులు చూస్తూ ఉండిపోయారు. ఆయన మాస్క్‌ ధరించి ఉండటంతో.. కరోనా భయంతో ఏ ఒక్కరూ ఆయన వద్దకు వెళ్లలేదు. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చేసరికే ఆయన మృతి చెందారు. గుండెపోటుతో మృతి చెందినట్లు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. వెంకటేష్‌కు భార్య అనిత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మొదటి కుమార్తె ల్యాబ్‌ టెక్నిషియన్‌ కోర్సు పూర్తిచేయగా, రెండో కుమార్తె ఎంబీఏ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం వెంకటేష్‌కు గుండె సంబంధ శస్త్రచికిత్స జరిగిందని కుటుంబసభ్యులు తెలిపారు. అంత్యక్రియలు నిర్వహించే స్థోమత లేకపోవడంతో.. కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు తనవంతు సాయం అందించారు. నగరపాలక సంస్థ తరఫున ఏర్పాట్లు చేసి అంత్యక్రియలు పూర్తి చేయించారు. నిరుపేద కుటుంబమైన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబసభ్యులు కోరారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు