close

తాజా వార్తలు

రౌడీయిజం చేస్తే సహించేదిలేదు: చంద్రబాబు

కర్నూలు: తెదేపా విజయ రహస్యం 65 లక్షల మంది పసుపు సైనికులేనని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. జెండాలు మోసి ఎన్నికలప్పుడు పార్టీని గెలిపించేది కార్యకర్తలేనని, నాయకులంతా వారిని గౌరవించాలని అన్నారు. కార్యకర్తలు ప్రజల బాధ్యత చూసుకొంటే, వారి బాధ్యత పూర్తిగా తనదేనని భరోసా ఇచ్చారు. కర్నూలులో జరిగిన ఎన్నికల సన్నాహక సభలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. మెజారిటీ ఓట్లు తెప్పించిన నాయకులే తనకు సన్నిహితంగా ఉండగలుగుతారని, పని చేయని నేతలను పట్టించుకొనేది లేదని తేల్చి చెప్పారు. తమ పార్టీ మంత్రాలయం అభ్యర్థి తిక్కారెడ్డిపై దాడి చేయడం హేయమన్నారు. రౌడీయిజం చేస్తే సహించబోమని హెచ్చరించారు. రాష్ట్రాన్ని కాపాడే శక్తి ఒక్క తెదేపాకే ఉందన్నారు.  

చనిపోయాక కూడా అండగా..
‘‘పసుపు-కుంకుమ వల్ల కోటి మంది చెల్లెమ్మలకు నేను అన్నగా మారాను. నా మానస పుత్రిక అయిన డ్వాక్రా సంఘాల సభ్యులకు రెండు విడతలుగా పసుపు-కుంకుమ పెట్టిన ఏకైక అన్నయ్యను నేను. కార్యకర్తలు 65 లక్షల మంది, పసుపు కుంకుమ తీసుకున్న చెల్లెళ్లు కోటి మంది, పింఛను తీసుకొనే పెద్దలు 55 లక్షల మంది ఉన్నారు. యువత కోసం ఎక్కడా లేని విధంగా రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తున్నాం. ఉపాధి కల్పన చేస్తున్నాం. కడుపులో గర్భం దాల్చినప్పటి నుంచి చనిపోయాక అండగా నిలవడం వరకూ ప్రతి విషయంలో పేద ప్రజలకు అండగా ఉన్నాం. మరణానంతరం బీమా మిత్ర ఇంటికెళ్లి అంత్యక్రియలకు రూ.30 వేలు చెల్లిస్తున్నారు. చనిపోయాక కూడా గౌరవిస్తున్న ప్రభుత్వం మనది. ఇంత చేశాక కూడా ఎవరైనా ఓటు వేరే వాళ్లకు వేస్తారా..?’’

ముగ్గురు మోదీల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి

‘‘అమరావతిలో రాజధాని నిర్మాణం జరుగుతోంది. ఎన్నో భవనాలు నిర్మితమవుతున్నాయి. జగన్‌ ఒక్కసారి కూడా ఈ ప్రాంతాన్ని చూడ్డానికి రారు. వెళ్లి హైదరాబాద్‌లో లోటస్‌పాండ్‌లో ఉంటారు. ఆయనకు అక్కడేం పని? వెళ్లి కేసీఆర్‌తో చేతులు కలిపారు. నీతిమంతులపై దాడులు చేస్తూ దొంగలకు కాపు కాస్తూ దిల్లీలో మోదీ ఉన్నారు. దీంతో మొత్తం ముగ్గురు మోదీలు జమ అయ్యారు. వీరి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలా? లేదా? దుష్ట శక్తులకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది’’ అని చంద్రబాబు అన్నారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు