60 ఏళ్ల పైబడినవారు జీవిత బీమా తీసుకోవచ్చా? - Does -it-Makes-Sense-For-Senior-Citizens-To-buy-Term-policy
close

Updated : 15/06/2021 10:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

60 ఏళ్ల పైబడినవారు జీవిత బీమా తీసుకోవచ్చా?

1. నా వయసు 69. నేను రూ. 1 కోటి బీమా హామీ తో జీవిత బీమా తీసుకోవాలి అనుకుంటున్నాను. సలహా ఇవ్వండి. 
- PV Chalapati Rao

జీవిత బీమా అనేది కుటుంబంలో అధిక సంపాదన కలిగిన వారి పేరు మీద తీసుకోవాల్సి ఉంటుంది. వారికి ఏదైనా జరిగితే కుటుంబానికి (నామినీ కి) ఒకే సారి బీమా మొత్తం అందిస్తారు. మీరు ఉద్యోగస్తులు కాకపోతే జీవిత బీమా అవసరం లేదు. మీ కుటుంబంలో ఎవరైనా మీ మీద ఆధార పడితే తీసుకోవచ్చు. లేదా మీ కుటుంబంలో అధిక సంపాదన కలిగిన వారు టర్మ్ పాలసీ తీసుకోవచ్చు. వారు మిమ్మల్ని నామినీ పెట్టడం వల్ల మీకు రక్షణ ఉంటుంది. 

టర్మ్ పాలసీలో వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి.  సాధారణంగా, చిన్న వయసు లో టర్మ్ పాలసీ తీసుకుని 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించడం మంచిది. 60 ఏళ్ళ పైన వయసు ఉన్న వారికి టర్మ్ పాలసీ దొరకడం కూడా కాస్త కష్టమే. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీలో తక్కువ ప్రీమియంతో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.

2. నేను ఒక ప్రైవేట్ ఉద్యోగిని. నా నెలసరి జీతం రూ. 12 వేలు. సిటీకి దగ్గరలో ఇల్లు కొనాలనుకుంటున్నాను, ఇంటి రుణం పొందొచ్చా? ఎంత వరకు వస్తుంది, వడ్డీ ఎంత?
- Gopi Mandadapu

మీరు ఇంటి రుణం పొందొచ్చు. దీని కోసం మీరు ఎస్బీఐ లేదా ఏదైనా దగ్గరలో ఉన్న బ్యాంకుని సంప్రదించవచ్చు. సాధారణంగా, మీ ఉద్యోగ సంస్థ అందించిన పే స్లిప్స్, 6 నెలల బ్యాంకు స్టేట్మెంట్, ఆదాయ పన్ను రిటర్న్స్ (అవసరం పడితే) లాంటివి అడగవచ్చు. మీ నెలసరి జీతాన్ని బట్టి రూ. 6 నుంచి రూ. 10 లక్షల వరకు రుణం పొందే వీలుంటుంది. ఇది బ్యాంకుని బట్టి మారవచ్చు. వడ్డీ రేటు సుమారుగా 7 శాతం లోపు ఉండే అవకాశం ఉంటుంది. ఈఎంఐలు మీ నెలసరి ఆదాయంలో 30 శాతాన్ని మించకుండా చూసుకోవడం మంచిది. మీ ఇతర లక్ష్యాల కోసం కూడా మదుపు చేయండి. ఆ తరవాత మిగిలిన ఆదాయం నుంచి ఇంటి రుణం చెల్లించవచ్చు.  

3. నా వయసు 29. నెల నెలా మ్యూచువల్ ఫండ్స్ లో రూ. 2000 మదుపు చేయడానికి సూచనలు ఇవ్వండి. అలాగే, రూ. 5 లక్షల మొత్తానికి ఆరోగ్య బీమా సూచించండి. 
- Gowdu Narsimha Murthy

మీరు సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. కనీసం 10 ఏళ్ళ పాటు మదుపు చేస్తే మంచి రాబడి పొందగలరు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  ఆప్ లాంటివి) ద్వారా  డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు, కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

ఆరోగ్య బీమా పాలసీ కూడా తీసుకోవడం చాలా మంచిది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే దానికి అదనంగా సూపర్ టాప్ అప్ పాలసీని తీసుకోవడం ద్వారా మరింత ప్రయోజనం పొందేందుకు వీలుంటుంది. మాక్స్ బూపా, అపోలో మునిచ్, స్టార్ హెల్త్ కంపెనీల పాలసీలు పరిశీలించండి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని