రూ.7లక్షల కోట్ల వైద్య పరికరాల ఎగుమతికి వీలు - Bio devices export have potentail to grow to Rs 7lakh crores
close

Published : 24/02/2021 17:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.7లక్షల కోట్ల వైద్య పరికరాల ఎగుమతికి వీలు

దేశీయ వినియోగంలో 80 శాతం ఇక్కడే తయారు కావాలి
బయోఆసియా సదస్సులో వక్తల ఆకాంక్ష

ఈనాడు, హైదరాబాద్‌: ‘కరోనా మహమ్మారి తర్వాత వైద్యరంగంలో అనేక భారతీయ కంపెనీలు ఎంతో కృషి చేశాయి. ఎన్నో కొత్త ఆవిష్కరణలకు బీజం పడింది. వైద్య పరికరాలకు సంబంధించి స్వయం సమృద్ధి సాధించే దిశగా భారత్‌ ముందుకెళ్తోంది. స్థానికంగా ఉత్పత్తి రంగానికి తోడ్పాటు లభించింది. దిగుమతుల మీద ఆధారపడటం తగ్గించేందుకు, విధాన నిర్ణయాలూ తోడ్పడ్డాయని’ బయోఆసియా 2021 సదస్సులో ‘మెడికల్‌ టెక్నాలజీ- భవిష్యత్తు అవకాశాలు’  అంశంపై జరిగిన చర్చాగోష్ఠిలో పలువురు వక్తలు పేర్కొన్నారు. వచ్చే అయిదేళ్లలో భారత్‌ దాదాపు రూ.7లక్షల కోట్ల విలువైన వైద్య పరికరాలను ఎగుమతి చేసే దిశగా సిద్ధం కావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎవరు ఏమన్నారంటే..

దిగుమతులు తగ్గాలి

మన దేశం వైద్య పరికరాల కోసం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. దేశీయంగా అందుబాటు ధరల్లోనే, నాణ్యతతో వీటిని తయారు చేసేందుకు వీలుగా వైద్య పరికరాల పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ధరలు అసాధారణంగా ఉంటే ప్రభుత్వం జోక్యం చేసుకోకతప్పదు. ఈ పార్కులు నెలకొల్పమంటూ 16 రాష్ట్రాలు అభ్యర్థన పంపించాయి. ఇప్పటికే నాలుగు రకాల వైద్య పరికరాలకు సంబంధించి, ప్రత్యేక పథకాన్ని రూపొందించి, 5 శాతం ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందిస్తోంది. బల్క్‌డ్రగ్‌ పార్కులకు రూ.1,000 కోట్ల వరకు ప్రోత్సాహకాలు అందుతున్నాయి. భవిష్యత్తులో మెడ్‌టెక్‌ పార్కులకూ ఈ మొత్తం పెరిగే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా వైద్య పరికరాల నియంత్రణకు ప్రత్యేక విభాగం ఉంది. మనదేశంలో ఇది ఔషధ నియంత్రణ పరిధిలోనే ఉండటం కొంత ఇబ్బంది కలిగిస్తోంది. దీన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. త్వరలోనే వైద్య పరికరాలకు సంబంధించిన ప్రత్యేక బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టొచ్చు. - డాక్టర్‌ ఎస్‌.ఈశ్వర రెడ్డి, జాయింట్‌ డ్రగ్స్‌ కంట్రోలర్, సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌

ప్రపంచ స్థాయిలో ఆర్‌అండ్‌డీ

భారత్‌లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నాయి. మాకు హైదరాబాద్, బెంగళూరులో ఆర్‌అండ్‌డీ కేంద్రాలున్నాయి. అమెరికా తర్వాత అత్యంత పెద్ద కేంద్రాన్ని హైదరాబాద్‌లోనే నెలకొల్పేందుకు రూ.1,200 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం. ప్రోత్సాహకాలు తక్కువగా ఉండటం ప్రతికూలంగా మారుతోంది. వైద్య పరికరాలను ఫార్మా నుంచి విడదీస్తే, ఈ రంగ అభివృద్ధి  వేగవంతమవుతుంది.
- మదన్‌ ఆర్‌ కృష్ణన్,  మేనేజింగ్‌ డైరెక్టర్, మెడ్‌ట్రానిక్‌ ఇండియా 

20శాతానికి చేరాలి..

వైద్య పరికరాల అభివృదికి పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రపంచ స్థాయిలో వైద్య పరికరాల విపణి రూ.36 లక్షల కోట్ల మేర ఉంది. ఇందులో రానున్న 5-7 ఏళ్ల కాలంలో 20శాతం (రూ.7 లక్షల కోట్ల) మార్కెట్‌ను భారత్‌ సొంతం చేసుకోవాలి. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకం ప్రారంభం మాత్రమే. దీన్ని మరింత పెంచాలి. పరిశోధన-అభివృద్ధి కోసం 10శాతం కేటాయిస్తున్నాం.’ - సురేశ్‌ వజిరాణి, సీఎండీ, ట్రాన్స్‌ఆసియా బయో మెడికల్స్‌

ధరల నియంత్రణ అవసరం లేదు

ధరల నియంత్రణ వల్ల వినియోగం పెరుగుతుందనే భావన ఉంది. అయితే, ఇక్కడ రోగుల గురించి మనం ఆలోచించాలి. వారికి సరైన ఉత్పత్తిని అందించే ప్రయత్నాలు జరగాలి. దీనికోసం కొన్నిసార్లు ధరల విషయంలో రాజీ పడక తప్పదు. భారత్‌లో మా ఉత్పత్తులు మిగతా దేశాలతో పోలిస్తే తక్కువకే లభిస్తున్నాయి. నా దృష్టిలో ధరల నియంత్రణ అవసరం లేదు. మార్కెట్‌లో గిరాకీ పెరుగుతుంటే.. పోటీ పెరిగి, ధరలు వాటంతట అవే నియంత్రణలోకి వస్తాయి.’
- శ్రావణ్‌ సుబ్రమణ్యం, ప్రెసిడెంట్, సీఈఓ జీఈ హెల్త్‌కేర్‌ ఇండియా

ఆవిష్కరణల్లో వేగం పెరిగింది

దేశీయంగా స్టెంట్లను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం చాలా వరకు తగ్గింది. కొవిడ్‌ తర్వాత వైద్య పరికరాల ఆవిష్కరణల్లో వేగం పెరిగింది. రెండు మూడు నెలల్లోనే 5-6 సంస్థలు వెంటిలేటర్లను అభివృద్ధి చేశాయి. 12 నెలల్లోనే వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసిన దేశంలో.. పరికరాల తయారీ పెద్ద కష్టమా? అందుకే మేము పరిశోధనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం. చిన్న సంస్థలు, అంకురాలూ ఆర్‌అండ్‌డీ చేపట్టేందుకు ప్రభుత్వం, కంపెనీలు సాయం చేయాలి.
- భార్గవ్‌ కొటాడియా, మేనేజింగ్‌ డైరెక్టర్, ఎస్‌ఎంటీ

 పాత పరికరాల దిగుమతిని నిషేధించాలి

దేశంలోకి పాత కార్లనూ, పాత ఫోన్లనూ దిగుమతి చేసుకోవడానికి అనుమతించడం లేదు. కానీ, వాడిన వైద్య పరికరాలను దిగుమతి చేసుకుంటున్నాం. దీన్ని నిషేధించాలి. ఇ-వ్యర్థాలను పారవేయడానికి భారత్‌ను ఎంచుకుంటున్నారన్నది మనం గుర్తించాలి. దిగుమతి సుంకాలను భారీగా పెంచాలి. ఆ డబ్బును ఇక్కడి సంస్థలకు ప్రోత్సాహకాలుగా అందించాలి. అప్పుడు ప్రభుత్వంపై భారమూ ఉండదు.
- రాజీవ్‌ నాథ్, మేనేజింగ్‌ డైరెక్టర్, హిందూస్తాన్‌ సిరంజెస్‌ అండ్‌ మెడికల్‌ డివైసెస్‌

చైనాకు ప్రత్యామ్నాయంగా

‘వైద్య పరికరాల తయారీ అవసరాన్ని తెలంగాణ ప్రభుత్వం ముందే గుర్తించింది. చైనాలో అత్యధికంగా ఉత్పత్తి అవుతున్న పరికరాలనే మనం దిగుమతి చేసుకుంటున్నాం. అక్కడి తయారీ కేంద్రంలో ఉన్న సౌకర్యాలతో ఇక్కడా ఒక పార్కు ఏర్పాటు చేసి, అక్కడ పెట్టుబడి పెట్టే సంస్థలను ఇక్కడికి రప్పించేందుకు ప్రయత్నించాం. హైదరాబాద్‌ సమీపంలో 200 ఎకరాల్లో ఈ పార్కును అభివృద్ధి చేశాం. అక్కడ కార్యకలపాలు ప్రారంభించేందుకు ఇప్పటికే 40 సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. స్టెంట్ల తయారీ కోసం ఆసియాలోనే అతిపెద్ద యూనిట్‌ను ఎస్‌ఎంటీ ఏర్పాటు చేస్తోంది. పరిశ్రమ అవసరాలు తెలుసుకుని, వాటిని తీర్చడం ఇప్పుడు ప్రధానం. ధరల నియంత్రణ కొన్ని రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇలాంటి విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సంస్థల భయాలనూ అర్థం చేసుకోవాలి.’
-జయేశ్‌ రంజన్, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ

ముడి ఔషధాల్లో డ్రాగన్‌కు చెక్‌ చెప్పేదెట్లా?

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌-19 మహమ్మారి అనంతరం ముడి ఔషధాలు (బల్క్‌ డ్రగ్స్, ఏపీఐ- యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్‌) కోసం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు దేశీయ ఫార్మా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ముడి ఔషధాల కోసం చైనా వైపు చూడటాన్ని తగ్గించాలని భారతీయ కంపెనీలు భావిస్తున్నాయని బయో ఆసియా- 2021 సదస్సులో పాల్గొన్న జైడస్‌ క్యాడిల్లా సప్లై చైన్‌ విభాగాధిపతి గౌరవ్‌ సుచక్‌ పేర్కొన్నారు. ఏపీఐ మాలిక్యూల్స్‌ను సొంతంగా తయారు చేసుకోడానికి కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయని, తద్వారా సరఫరాల్లో స్థిరత్వం పెరుగుతుందని అన్నారు. సిప్లా లిమిటెడ్‌ జాయింట్‌ ప్రెసిడెంట్‌  స్వపన్‌ మల్పాని మాట్లాడుతూ ‘ఏపీఐ రీ-ఇమాజినేషన్‌’ పేరుతో ఏపీఐ ఔషధాల్లో స్వయం సమృద్ధి సాధించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రాయితీలను వినియోగించుకుంటూ తయారీ కార్యకలాపాలను పెంపొందించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. బయోకాన్‌ కూడా అదే బాటలో ముందుకు సాగుతోంది. చైనాతో సంబంధం లేకుండా సొంతంగా ఎన్ని ఔషధాలు తయారు చేయగలమని పరిశీలన చేస్తున్నట్లు ఆ సంస్థ సప్లైచైన్‌ హెడ్‌ ప్రసాద్‌ దేశ్‌పాండే వివరించారు. ‘ప్రస్తుతం మేం ఉత్పత్తి చేసే ఔషధాల్లో 50 శాతం పూర్తిగా దేశీయ ముడి పదార్థాలను వినియోగిస్తున్నవే. చైనాపై ఆధారపడటాన్ని ఆమేరకు తగ్గించగలిగాం’ అని ఆయన చెప్పారు. ముడి ఔషధాల కోసం చైనాపై ఆధారపడటాన్ని దేశీయ ఫార్మా పరిశ్రమ గణనీయంగా తగ్గించాలంటే, అందుకు అనువుగా దేశీయంగా మౌలిక సదుపాయాలను భారీగా విస్తరించాలని, ముడి ఔషధాల తయారీని విశేషంగా ప్రోత్సహించాలని సూచించారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని