ఆర్థిక స్థిరత్వం.. ఇలా సాధ్యం.. - Financial Stability is possible with this
close

Updated : 16/04/2021 13:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్థిక స్థిరత్వం.. ఇలా సాధ్యం..

గతంలో ఎన్నడూ లేనంతగా.. ఆర్థిక  ప్రణాళికలు.. ఆర్థిక స్థిరత్వం గురించి  ఆలోచించాల్సిన పరిస్థితులు ఇప్పుడు   కనిపిస్తున్నాయి. కరోనా మహమ్మారి ఒక్కసారిగా అందరి భవిష్యత్తునూ ప్రశ్నార్థకం చేసింది.. ఇంకా కోరలు చాస్తూ.. కొత్త సవాళ్లను విసురుతోంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనాలంటే.. ముందుగా మనం ఆర్థికంగా స్థిరంగా ఉండాలి. అప్పుడే క్లిష్ట పరిస్థితులు వచ్చినా.. జీవితంలో  అనుకున్న లక్ష్యాలను చేరేందుకు ఎలాంటి రాజీ పడాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుత పరిస్థితుల్లో.. ఆర్థిక స్థిరత్వం సాధించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయాలనే   విషయాలు  తెలుసుకుందాం..
ఆర్థిక ప్రణాళికలపై గత కొంత కాలంగా అవగాహన బాగా పెరిగిందనే చెప్పాలి. చాలా ఏళ్లుగా భారతీయులు తమ సంపాదనను ఎక్కువగా పొదుపు వైపే మళ్లిస్తున్నారు. లేదా బంగారం, స్థిరాస్తిలాంటి వాటిని ఎంచుకునేవారు. అయితే.. పెట్టుబడి పథకాల గురించి తెలుసుకోవడం మొదలైన తర్వాత పెట్టుబడుల తీరూ మారిపోయింది. డిజిటల్‌ అభివృద్ధి చెందడంతో.. షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేస్తున్న వారి సంఖ్య అధికమవుతోంది. వృద్ధి ఆధారిత పథకాలు, పొదుపు పథకాల్లో డబ్బును జమ చేసినప్పుడే ఆర్థిక స్థిరత్వం సాధించేందుకు వీలవుతుంది. ఈక్విటీల్లో మదుపు చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధి చెందితే.. స్థిరాదాయ పథకాల్లో పెట్టుబడులు... సొమ్ముకు భద్రతనిస్తాయి. ఒక్కో పెట్టుబడి పథకానికి ఒక్కో విధమైన ప్రయోజనాలుంటాయి. విభిన్నంగా మదుపు చేసినప్పుడే ఇవి మనకు అధిక రాబడిని ఆర్జించి పెడతాయని గుర్తుంచుకోవాలి.

ద్రవ్యోల్బణానికి అనుగుణంగా..

ధరలు పెరగడం ఇప్పుడు నిత్యకృత్యం అయ్యింది. ఇలా పెరుగుతున్న ధరలను తట్టుకునేందుకు మన పెట్టుబడులు తోడ్పడాలి. ఆర్థిక అవసరాలు ఎన్నో ఉంటాయి. వాటిని సాధించే ప్రయత్నంలో ద్రవ్యోల్బణాన్నీ లెక్కలోకి తీసుకోవాల్సిందే. పిల్లల ఉన్నత విద్య, విహార యాత్రలు, పిల్లల వివాహం, కొత్తగా ఏదైనా చేయాలని అనుకోవడం ఇలా ప్రతి లక్ష్యమూ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. పదవీ విరమణ తర్వాత ప్రశాంత జీవితం గడిపేందుకూ ముందునుంచే తగిన ప్రణాళిక వేసుకోక తప్పదు. 
జీవితంలోని ఒక్కో దశలో ఎలాంటి ఆర్థిక అవసరాలుంటాయనే విషయంలో స్పష్టత ఉండాలి. ఏడాదికోసారి కొంత సమయం తీసుకొని, మీ లక్ష్యాలు ఏమిటి? వాటి ప్రగతి ఎంత వరకూ వచ్చింది? దానికోసం ఇంకా మనం పెట్టుబడులను పెంచాలా? ఆ మొత్తాన్ని సాధించేందుకు ఏం చేయాలి? ఇలా అనేక అంశాలను ఆలోచించుకోవాలి. కాలం మారుతున్న కొద్దీ.. మీరు అనుకుంటున్న లక్ష్యాల్లోనూ కొన్ని మార్పులు చేర్పులు రావచ్చు. వీటిని గుర్తించాలి. ఆదాయంలో వచ్చిన హెచ్చుతగ్గులూ మీ లక్ష్యాలను ప్రభావితం చేస్తాయి. వీటిని గమనిస్తూ కొత్త ప్రణాళికలను వేసుకోవాలి. సంపద సృష్టిలో నష్టభయం భరించే సామర్థ్యమూ కీలకమే. పదవీ విరమణలాంటి దీర్ఘకాలిక పెట్టుబడుల్లో స్వల్పకాలంలో వచ్చే నష్టాలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

ఏం చేయాలంటే..

మనం ప్రస్తుతం ఏ దశలో ఉన్నామనే విషయాన్ని పట్టించుకోకుండా.. కొన్ని సూత్రాలు పాటించడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని సాధించేందుకు వీలవుతుంది..

చిన్న వయసు నుంచే పెట్టుబడులను ప్రారంభించాలి. చిన్న మొత్తమైనా దాన్ని నెలనెలా మదుపు చేస్తూ దీర్ఘకాలం కొనసాగించాలి.

వచ్చిన ఆదాయం.. ఖర్చులకు సంబంధించి నెలవారీ బడ్జెట్‌ను తయారు చేసుకోండి. దాన్ని క్రమశిక్షణతో అమలు చేయాలి. ఎప్పటికప్పుడు రుణ వాయిదాలు, బిల్లులు చెల్లించేయండి. పొదుపు పథకాల్లోకి వెళ్లే డబ్బును ఎట్టి పరిస్థితుల్లోనూ కదపకూడదు.

రుణాలు ఇస్తున్నారు కదా అని తీసుకోవడం మంచిది కాదు. మీ చెల్లింపు సామర్థ్యాన్ని చూసుకోండి. క్రమం తప్పకుండా మీ క్రెడిట్‌ స్కోరు, రుణ చరిత్ర నివేదికలను పరిశీలిస్తూ ఉండండి. ఇది మీ ఆర్థికారోగ్యాన్ని తెలియజేస్తుంది.

క్రెడిట్‌ కార్డులను జాగ్రత్తగా వాడాలి. వాటి బిల్లులను గడువుకు ముందే చెల్లించండి. లేకపోతే వడ్డీ భారం అధికంగా ఉంటుంది.

విలువ పెరగడంతోపాటు, క్రమం తప్పకుండా ఆదాయాన్ని అందించే ఆస్తులను కొనుగోలు చేయండి. తక్కువ ధరకు లభించి, దీర్ఘకాలంలో వృద్ధి చెందే వాటిపై దృష్టి పెట్టాలి.

* మీ ఆర్థిక లక్ష్యాల సాధనకు ఉపయోగపడే పథకాలను ఎంచుకోండి. వైవిధ్యం పాటించండి.

గత ఏడాది మనకు ఎన్నో పాఠాలు నేర్పింది. ఇప్పుడు మరోసారి వాటిన్నింటినీ మనం గుర్తుకు తెచ్చుకోవాల్సిన తరుణమిది. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం ఇప్పుడు ఎంత అవసరమో.. స్వల్పకాలంలోనూ, దీర్ఘకాలంలోనూ ఆర్థిక స్థిరత్వం సాధించడమూ అంతే ముఖ్యం.

- నవీన్‌ చందాని, ఎండీ, సీఈఓ, క్రిఫ్‌ హైమార్క్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని